అమెరికా: అక్రమ వలస కుటుంబాలపై న్యాయ విచారణ నిలిపివేత

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారులతో కలిసి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్లను తాత్కాలికంగా ఆపేసినట్లు అమెరికా సరిహద్దు భద్రత విభాగ ఉన్నతాధికారి తెలిపారు.
కస్టమ్స్, సరిహద్దు రక్షణ(సీబీపీ) కమిషనర్ కెవిన్ మెక్ అలీనన్ ఈ అంశంపై టెక్సాస్‌లో విలేఖర్లతో మాట్లాడారు.
అక్రమంగా వలస వచ్చేవారిపై ప్రాసిక్యూషన్ సిఫార్సులను గతవారం రద్దు చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస కుటుంబాలను వేరు చేయడాన్ని నిలుపుదల చేస్తూ జారీ చేసిన ఆదేశానికి ఇది కొనసాగింపని వివరించారు.
అయితే గతవారం ట్రంప్.. తన ఆదేశంలో వలస కుటుంబాలను వేరు చేయం కానీ.. వారిని నిర్బంధిస్తాం అని సూచించారు.
ఇటీవల వలస కుటుంబాలలో తల్లిదండ్రులను పిల్లలను వేరు చేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా, బయటా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో వలస కుటుంబాలను కలిపే ఉంచాలన్న ఆదేశంపై ట్రంప్ గత బుధవారం సంతకం చేశారు.

ఫొటో సోర్స్, John Moore for Getty Images
మెక్ అలీనన్ మాట్లాడుతూ.. జీరో టాలరెన్స్ సంబంధించిన ప్రభుత్వ చర్యలు ఇప్పటికీ ఆచరణలోనే ఉన్నాయని తెలిపారు.
పిల్లల నుంచి వేరు చేయొద్దని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్రమంగా వలస వచ్చిన వారిని కూడా ఇప్పుడు ప్రాసిక్యూషన్ చేయలేమన్నారు.
పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయకుండా వారిపై న్యాయ విచారణ ఎలా జరపాలన్న అంశంపై ప్రస్తుతం న్యాయ శాఖ కసరత్తు చేస్తోందని మెక్ అలీనన్ చెప్పినట్లు వార్తా సంస్థ అసోసియెటెడ్ ప్రెస్ వెల్లడించింది.
తాజా నిర్ణయం ప్రకారం.. చిన్నారులతో కలిసి అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని అధికారులు నిర్బంధించరు. దీనికి బదులు వారికి కోర్టు సమన్లు జారీ చేస్తారు.
వివాదం నేపథ్యం...
అక్రమ వలసలను ఏ మాత్రం సహించేది లేదనే ట్రంప్ విధానం ఇప్పటికే వివాదాస్పదం అయ్యింది. ట్రంప్ విధానం వల్ల ఇటీవల ఆరు వారాల వ్యవధిలో దాదాపు రెండు వేల కుటుంబాల్లోనివారు ఒకరికొకరు దూరమయ్యారు.
ఏప్రిల్ 19, మే 31 మధ్య 1,940 మంది వయోజనులను నిర్బంధంలోకి తీసుకోగా, 1,995 మంది మైనర్లు వారికి దూరమయ్యారని అమెరికా అంతర్గత భద్రత విభాగం గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే తల్లిదండ్రులను, వారి పిల్లలను వేరు చేసే విధానంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దీంతో ఈ అంశంపై ట్రంప్ వెనక్కి తగ్గారు.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









