ప్రపంచం మెరుగవుతోందని చెప్పడానికి ఇదిగో 7 ఉదాహరణలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలియస్ ప్రాస్ట్
- హోదా, 'ది కన్వర్సేషన్' నుంచి
"అనేక సమస్యలతో ఈ ప్రపంచం రోజురోజుకీ అధ్వానంగా తయారవుతోంది" అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, వాస్తవానికి పరిస్థితులు అలా ఏమీ లేవని ఈ కింద ఇచ్చిన ఏడు చార్టులను చూస్తే అర్థమవుతుంది. మన పూర్వీకుల కాలంతో పోల్చితే నేడు ప్రపంచం ఎంత మెరుగ్గా ఉందో తెలుస్తుంది.
"ప్రపంచం మెరుగుపడుతోందన్న వాస్తవాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని చాలామంది నమ్మడం లేదు. పైగా ప్రపంచం తిరోగమన దిశగా పయణిస్తోందన్న ప్రతికూల ఆలోచనలు వారిలో పెరిగిపోతున్నాయి" అని స్వీడన్‌కు చెందిన హాన్స్ రోస్లింగ్ అనే పరిశోధకుడు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు, ఉగ్రవాద దాడులు, యుద్ధాలు, ఆకలి కేకలు వంటి విషయాలకే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో.. ప్రజలు అలా ప్రతికూలంగా ఆలోచించడం ఆశ్చర్యమేమీ కాదు.
"ప్రపంచంలో రోజూ సగటున దాదాపు 2,00,000 మంది దారిద్ర్య రేఖ ఎగువకు(రోజూ 2 డాలర్లు సంపాదన) వెళ్తున్నారన్న వాస్తవాన్ని ఎవరు తెలుసుకుంటారు? రోజూ 3,00,000 లక్షల మందికి పైగా ప్రజలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తోందన్న నిజాన్ని ఎవరు గుర్తిస్తారు? తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు సంబంధించిన ఇలాంటి వార్తలు ధనిక దేశాల వారికి పెద్దగా ఆకస్తికరంగా అనిపించవు" అని రోస్లింగ్ తన 'ఫ్యాక్ట్‌ఫుల్‌నెస్' అనే పుస్తకంలో విమర్శించారు.
ప్రపంచ పరిస్థితులను అంచనా వేయాలంటే అలాంటి వార్తలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచీకరణ కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మధ్య తరగతి ప్రజలపై భారం పెరిగిన మాట వాస్తవం. అదే సమయంలో దాని వల్ల లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారు కూడా.
ప్రపంచీకరణ వల్ల బాగా అభివృద్ధి చెందిన ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఆ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి.
పెరిగిన సంపద.. అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం కాకుండా అన్ని దేశాలకూ విస్తరించాలంటే గ్లోబలైజేషన్ ఒక్కటే మార్గం.
గతంతో పోల్చితే, నేటి ప్రపంచం ఎంత మెరుగ్గా ఉందో ఈ 7 చార్టులు వివరిస్తాయి.
1. ఆయుర్దాయం పెరుగుదల

పారిశ్రామిక విప్లవం (18, 19 శతాబ్దాల మధ్యకాలం) సమయంలో యూరప్ ప్రజల సగటు ఆయుర్దాయం 35 ఏళ్లకు మించేది కాదు.
అలా అని ఎక్కువ మంది 30, 40 ఏళ్ల వయసులోనే చనిపోయేవారని కాదు. అప్పట్లో శిశు మరణాల రేటు, బాలింతల మరణాలు అధికంగా నమోదవుతుండేవి. దాంతో, సగటు జీవిత కాలం తగ్గేది.
అప్పుడు స్మాల్‌పాక్స్, ప్లేగు, లాంటి వ్యాధులు సర్వసాధారణం. కానీ, ప్రస్తుతం అధిక ఆదాయం ఉన్న దేశాల్లో అలాంటి వ్యాధులు పూర్తిగా నిర్మూలించారు.
గడచిన కొన్ని దశాబ్దాల్లో వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం ఎంతో మెరుగుపడింది.
1960ల్లో ఐక్యరాజ్య సమితి ప్రపంవ్యాప్తంగా ఆరోగ్య ప్రజల పరిస్థితులకు సంబంధించిన వివరాలను నమోదు చేయడం ప్రారంభించింది. అప్పట్లో, ప్రపంచవ్యాప్తంగా సగటు జీవిత కాలం 52.5 ఏళ్లుగా ఉండేది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2016లో ప్రపంచ జనాభా సగటు జీవిత కాలం 72 ఏళ్లు.
1960ల్లో భారతీయుల సగటు జీవిత కాలం 41 ఏళ్లు ఉండేది. 2016 నాటికి అది 68.56 ఏళ్లకు పెరిగింది.
2018 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం, 1990తో పోల్చితే ఇప్పుడు భారతీయుల సగుటు జీవిత కాలం 11 ఏళ్లు పెరిగింది.
2. శిశు మరణాల తగ్గుదల

అధిక ఆదాయం ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ 1900ల్లో శిశు మరణాల రేటు 10 శాతానికి పైనే ఉండేది.
పై గ్రాఫ్ చూస్తే భారత్‌లో అప్పట్లో 50 శాతానికి పైగా పిల్లలు పసివయసులోనే చనిపోయేవారని అర్థమవుతుంది.
కొన్ని దశాబ్దాల కాలంలో అందుబాటులోకి వచ్చిన మందులు, వైద్య సదుపాయాల వల్ల ఇప్పుడు కొన్ని ధనిక దేశాల్లో పిల్లల మరణాల రేటు దాదాపు జీరోకు తగ్గించగలిగారు.
వందేళ్ల కిందటితో పోల్చితే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు శిశు మరణాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించాయి.
3. సంతానోత్పత్తి రేటు తగ్గుదల



చాలామంది ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఈ తగ్గుదల కారణంగా ఈ 21వ శతాబ్దం ఆఖరి నాటికి ప్రపంచ జనాభా 11 బిలియన్ (1100 కోట్లు) వద్ద స్థిరంగా ఉండిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలు చెబుతున్నాయి.
పై మ్యాప్‌ను పరిశీలిస్తే చైనా, బ్రెజిల్‌తో పాటు పలు ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికే సంతానోత్పత్తి రేటు కనిష్ఠ స్థాయికి చేరుకుందని అర్థమవుతుంది.
సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో ఆదాయంలో ముందున్న దేశాలకు దాదాపు 100 ఏళ్లు పట్టగా, చాలా దేశాలు రెండుమూడు దశాబ్దాల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాయి.
4. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీ పెరుగుదల

ఫొటో సోర్స్, ourworldindata
గత 150 ఏళ్లుగా అమెరికా, పశ్చిమ యూరప్ దేశాల జీడీపీ సగటున ఏటా 2 శాతం పెరుగుతూ వస్తోంది. అంటే, సుమారు 36 ఏళ్లకోసారి ఆ దేశాల ఆదాయం రెట్టింపవుతోంది.
మధ్యమధ్యలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా, దీర్ఘకాలిక సగటు చూస్తే మాత్రం ఆయా దేశాలు అద్భుతమైన అభివృద్ధి సాధించాయి.
గత కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా లాంటి తక్కువ ఆదాయం కలిగిన దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పశ్చిమ దేశాలను వెనక్కి నెట్టే దిశగా దూసుకెళ్తున్నాయి.
వృద్ధి రేటు 10 శాతానికి అటుఇటుగా అలాగే కొనసాగితే.. ఏడేళ్లకోసారి ఈ దేశాల సంపద రెట్టింపవుతుందన్నమాట. ప్రపంచీకరణలో భాగంగా ఆ సంపద ఇతర దేశాలకూ విస్తరిస్తే అది తప్పకుండా శుభవార్తే అవుతుంది.
5. అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతల తగ్గుదల

ఫొటో సోర్స్, ourworldindata

ఫొటో సోర్స్, ourworldindata
ప్రపంచీకరణ కారణంగా దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా అసమానతలు తగ్గుతూ వస్తున్నాయి.
అసమానతల తగ్గుదలలో భారత్, చైనా లాంటి దేశాలు కీలక పాత్ర పోషించాయి. ఈ దేశాల్లో లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగం మంది మధ్య తరగతిలో ఉన్నారు.
6. ప్రజాస్వామిక పాలన

ఫొటో సోర్స్, ourworldindata
గతంలో అనేకమంది నిరంకుశ ప్రభుత్వాల పాలనలో నలిగిపోయారు. కానీ, ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగం మంది ప్రజాస్వామిక దేశాల్లో నివసిస్తున్నారు.
మిగతా సగం జనాభాలో 90 శాతం మంది ఒక్క చైనాలోనే ఉన్నారు. అయితే, అర్థికాభివృద్ధి అలాగే కొనసాగితే అది ఆ దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా నడిపిస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
7. తగ్గుతున్న ఘర్షణలు

ఫొటో సోర్స్, ourworldindata
ప్రపంచ చరిత్రలో చూసుకుంటే ఎన్నో భీకర యుద్ధాలు జరిగాయి. అయితే, గత అయిదారు శతాబ్దాలుగా చూస్తే పెద్ద దేశాల మధ్య జరుగుతున్న పోరాటాల శాతం తగ్గుతూ వస్తోంది.
20వ శతాబ్దలంలో రెండు భీకర ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత అంత స్థాయిలో యుద్ధాలు జరగలేదు. మూడు తరాలుగా
ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాంతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
(ఈ కథనాన్ని మొదట theconversation.com ప్రచురించింది. వారి అనుమతితో బీబీసీ ప్రచురించింది.)
ఇవి కూడా చదవండి:
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- క్యాథలిక్ చర్చిల్లో మతాచార్యుల ఆధిపత్యం: ‘వాళ్లు చెప్పినదానిని గొర్రెల్లా అనుసరించాలి.. అంతే’
- ‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని నటిపై కేసు
- వివేకానందుడు చికాగో ప్రసంగంలో ఏం చెప్పారు?
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








