780 భాషలను కనిపెట్టిన గణేశ్ దేవి

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
గణేశ్ దేవి.. గతంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. అంతరించి పోయే దశలో ఉన్న అనేక భారతీయ భాషలను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు.
అందమైన హిమాలయ ప్రకృతి రమణీయత మధ్య ఉన్నహిమాచల్ ప్రదేశ్‌లో 16 భాషలను గుర్తించారు.
కేవలం మంచుకే దాదాపు 200 పర్యాయపదాలు ఉన్నట్లు ఈయన తెలిపారు. ఇక్కడివారి భావవ్యక్తీకరణ కూడా ఎంతో కళాత్మకంగా ఉంటుంది.
మంచు తుంపరలను 'నీటిపై రాలే పూరేకులు'గా వర్ణిస్తారు.
రాజస్థాన్ సంచార జాతులకూ ప్రత్యేకమైన పదజాలం ఉంది. బంజరు భూములను పిలిచేందుకు వారు ఎన్నో పదాలు ఉన్నట్లు గణేశ్ చెబుతున్నారు.
బ్రిటీష్ ఏలుబడిలో వీరిని నేరస్తులుగా చూసేవారు.
ఈ జాతులకు చెందిన ఎంతో మంది ప్రస్తుతం దిల్లీలో జీవనోపాధి వెతుక్కుంటున్నారు.
తమను నేరస్తులుగా ముద్రవేసిన సమాజానికి భయపడి వారు తమ సొంత భాషను రహస్యంగా మాట్లడుకుంటున్నారని గణేశ్ అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర పశ్చిమ తీరంలో వందల గ్రామాలు నేడు మనుగడలో లేని పోర్చుగీసు మాట్లాడుతున్నట్లు గణేశ్ గమనించారు.
ఇవి కూడా చూడండి
అండమాన్, నికోబార్‌లో నివసించే వారిలో కొందరు మియన్మార్‌కు చెందిన సంప్రదాయ కరెన్ భాషను మాట్లాడుతున్నారు.
గుజరాత్‌లో కొందరు ఇప్పటికీ జపనీశ్ లో సంభాషిస్తున్నారు.
దాదాపు 125 విదేశీ భాషలు కొందరి భారతీయులకు మాతృ భాషలుగా ఉన్నాయి.
గుజరాత్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో దాదాపు 16 ఏళ్లపాటు గణేశ్ ఆంగ్లం బోధించారు.
ఆ తరువాత గిరిజనులతో దగ్గరగా ఉండేందుకు మారుమూల తండాలకు వెళ్లారు.
గిరిజనులను చైతన్య పరిచి అనేక విషయాలపై వారికి ఆయన అవగాహన కల్పించారు. రుణాలు పొందడం, విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్య సంరక్షణ వంటివి ఇందులో ముఖ్యమైనవి.
అంతేకాదు 11 గిరిజన భాషల్లో ఒక జర్నల్‌ను ప్రచురించారు.

అంకెల్లో భారతీయ భాషలు

ఫొటో సోర్స్, Getty Images
- 1961 జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో దేశంలో 1,652 భాషలున్నాయి.
- 2010లో ద పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా(పీఎల్ఎస్ఐ) 780 భాషలు గుర్తించింది.
- యునెస్కో లెక్కల ప్రకారం వీటిలో 197 అంతరించిపోతున్నదశలో ఉన్నాయి. మరో 42 ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లు తేలింది.
- అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో ఎక్కువ సంఖ్యలో భాషలున్నాయి.
- ప్రస్తుతం భారత్‌లో 68 రకాల లిపిలను వాడుతున్నారు.
- 35 భాషల్లో పత్రికలు నడుస్తున్నాయి.
- 40 శాతం భారతీయులు హిందీ మాట్లాడుతారు. ఆ తరువాత స్థానాల్లో బెంగాలీ (8శాతం), తెలుగు (7.1శాతం), మరాఠీ (6.9శాతం), తమిళం (5.9శాతం) ఉన్నాయి.
- భారత ప్రభుత్వ ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రసారాలు 120 భాషల్లో వస్తున్నాయి.
- భారత పార్లమెంట్‌లో కేవలం 4 శాతం భాషలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఆధారం: 2001, 1962 జనాభా లెక్కలు, యునెస్కో, పీఎల్ఎస్ఐ-2010

గణేశ్ 1998లో అత్యంత పేదిరకంతో ఉన్నగిరిజన గ్రామాలకు వెళ్లారు. తనతోపాటు స్థానిక భాషల్లో రాసిన జర్నల్‌కు సంబంధించి 700 ప్రతులను తీసుకెళ్లారు.
ఒకో ప్రతి ధరను రూ.10గా నిర్ణయించారు.
ఒక చోట బుట్ట ఉంచి డబ్బులు అందులో వేసి ప్రతులను తీసుకోవాల్సిందిగా గణేశ్ ప్రజలను కోరారు.
సాయంత్రానికల్లా ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. బుట్టలో చాలా కరెన్సీ నోట్లు ఉన్నట్లు గణేశ్ గమనించారు.
ఆ నోట్లలో కొన్ని దుమ్ము కొట్టుకు పోయి ఉన్నాయి. మరికొన్ని ముడతలు పడి నలిగినవి.
ఆ గిరిజనులు రోజంతా కష్టపడి తెచ్చుకున్న కూలీలో కొంత ఈ ప్రతుల కోసం వెచ్చించారు.

ఫొటో సోర్స్, ANUSHREE FADNAVIS/INDUS IMAGES
"తమ జీవితంలో సొంత భాషలో ముద్రించిన కాగితాలను చూడటం ఆ గిరిజన తెగలకు బహుశా అదే మొదటిసారి" అని గణేశ్ అన్నారు.
"కనీసం చదవలేని వారు కూడా తమ కష్టంలో ఎంతో కొంత వెచ్చించి ప్రతులను కొన్నారు. అంటే వారు తమ భాషకు ఇస్తున్న గౌరవం, ప్రాముఖ్యం ఏమిటో అప్పుడే నాకు అర్థమైంది" అని గణేశ్ అన్నారు.
ఏడేళ్ల క్రితం పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాను ఆయన ప్రారంభించారు.
"భారతదేశంలోని భాషలన్నింటిపై సమగ్ర సర్వే నిర్వహించే ఉద్యమంగా" దీన్ని ఆయన అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Images
విశ్రాంతి ఎరుగని ఈ భాషా యోధుడుకి 60 ఏళ్లు నిండాయి.
భాషాల కోసం దేశమంతటా పర్యటించారు. 18 నెలల్లో 300 ప్రయాణాలు చేశారు.
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపన్యాసాల ద్వారా వచ్చే డబ్బును తన ప్రయాణ ఖర్చులకు గణేశ్ వినియోగించేవారు.
రాత్రి, పగలు అనే తేడా లేదు. కొన్ని రాష్ట్రాలకు 10 సార్లు కూడా వెళ్లారు.

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Image
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తులతో గణేశ్ ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
3,500 మంది స్కాలర్లు, టీచర్లు, కార్యకర్తలు, డ్రైవర్లు, సంచారులు ఇందులో ఉన్నారు. వీళ్లంతా భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించినవారే.
ఒడిశా ప్రభుత్వ అధికారి కారు డ్రైవర్ కూడా వీరిలో ఒకరు. తన ప్రయాణంలో ప్రజలు మాట్లాడే కొత్త పదాలను సేకరించి అతను ఒక పుస్తకంలో రాసుకునేవారు.
తమ పరిశోధనలకు సంబంధించి 100 పుస్తకాలను ప్రచురించాలని పీఎల్ఎస్ఐ భావిస్తోంది. ఇప్పటికి 39 పుస్తకాలను ప్రచురించింది. మరో 35,000 పేజీల సమాచారం ప్రచురణకు సిద్ధంగా ఉంది.

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Images
భారతదేశంలో కొన్ని వందల భాషలు అంతరించి పోయాయి.
ప్రభుత్వ ఆదరణ లేకపోవడం, మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోవడం, స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య కొరవడటం, గిరిజనులు తమ సొంత గ్రామాల నుంచి బయటకు వలసలు పోవడం వంటివి భాషలు అంతరించి పోయేందుకు కారణమవుతున్నాయి.
ప్రస్తుతం గణేశ్ మదిలో ఎన్నో ఆందోళనలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందూవాద భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆయనను మరింత కలవరానికి గురి చేస్తోంది.
హిందీని దేశవ్యాప్తంగా ప్రజలపై రుద్దాలని భాజపా చేస్తున్న ప్రయత్నాలను "ఇతర భాషలపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి"గా గణేశ్ అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Indus Images
"ఒక భాష అంతరించిపోయిన ప్రతిసారీ నాకు చెప్పలేని బాధ కలుగుతుంది. మన సంస్కృతిలో వైవిధ్యం దెబ్బతినడానికి ఇది దారి తీస్తుందని" మహారాష్ట్రలోని చారిత్రక పట్టణమైన దార్వర్‌లోని తన ఇంటిలో కూర్చొని ఉన్నగణేశ్ అంటున్నారు.
"మన ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే, మన భాషలను కాపాడుకోవాలి" అన్నది ఆయన అభిమతం.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








