ఆంధ్రప్రదేశ్: ‘పనుల్లేవు... భార్యాబిడ్డలను బతికించుకోలేకపోతున్నా’ - ఇసుక కొరతే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమా?

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత చాలా సమస్యలకు కారణం అవుతోంది. సుమారుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అనుబంధ రంగాలకు చెందిన కార్మికులకు కూడా పనులు తగ్గడంతో కూలీ దొరకట్లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడంతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది.
అయితే, పోలీసుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. కార్మికుల ఆత్మహత్యలకు చాలా కారణాలున్నాయని వారు చెబుతున్నారు. విచారణ కొనసాగుతోందని గుంటూరు రూరల్ పోలీసులు బీబీసీతో అన్నారు.
భవన నిర్మాణ కార్మికుడి సెల్ఫీ వీడియో...
గుంటూరు రూరల్ మండలం గోరంట్లకు చెందిన పోలేపల్లి వెంకటేశ్వర రావు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.
అక్టోబర్ 2వ తేదీన వెంకటేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య రాశి, ఏడాది వయసు ఉన్న ఛాయా చరణ్ అనే కుమారుడు ఉన్నారు.
"పరిస్థితులు బాగోలేక పనుల్లేవు. సంపాదన లేదు. పెళ్లాం, బిడ్డలను బతికించుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. అందరూ అడుగుతున్నారు.. ఏం చేస్తావని..పైపుల పనిచేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నాను. పనులున్నాయా అని అడుగుతున్నారు. ఉన్నాయని చెబుతున్నాను. కానీ వాస్తవానికి పనుల్లేవు. దాంతో పనుల్లేవనే అసహనాన్ని నా భార్య మీద, నా బిడ్డ మీద చూపించాల్సి వస్తోంది. నన్ను నమ్మి వచ్చిన వాళ్లని మోసం చేయలేను. చేతగాని వాడిలా చచ్చిపోతున్నా.. " అంటూ సెల్ఫీ వీడియోలో వెంకటేశ్వరరావు మాట్లాడిన కొంత భాగం వైరల్ అవుతోంది.
తమ బిడ్డ ఆరోగ్యం బాగోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా, పనులు లేకపోవడంతో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వ రావు భార్య బీబీసీకి తెలిపారు..
"బాబుకి ఆరోగ్యం బాగోలేదు. ఏడాది నుంచి చాలా ఆస్పత్రులు తిప్పాం. ఆపరేషన్ చేయాలన్నారు. ఖర్చులు రూ.50వేలు అవుతుందని చెప్పారు. మా దగ్గర అంత లేవు. ఇసుక లేకపోవడంతో పనుల్లేవు. పనుల్లేక మమ్మల్ని పోషించలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. అటు ఆపరేషన్ కోసం ఖర్చులు, ఇటు ఇంట్లో పోషణ కోసం ఖర్చుల కోసం చాలా తపన పడ్డారు. చివరకు మనసు స్థిరంగా లేకపోవడంతో ఈ బాధల నుంచి ఎలా బయటపడాలో తెలియక మేము ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకున్నారని" ఆమె బీబీసీకి చెప్పారు..

ఫొటో సోర్స్, facebook/janasenaparty
‘ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇసుక కొరత’
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురు సోషల్ మీడియాలో ఈ వీడియోలో కొంత భాగాన్ని పోస్ట్ చేశారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఇసుక కొరత కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ప్రభుత్వ హత్యలుగా వ్యాఖ్యానించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. చేతగాని సర్కారుగా పేర్కొన్నారు. 151 సీట్లలో గెలిపించింది..ఇందుకేనా, ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇసుక కొరత.. అంటూ ప్రశ్నించారు.
వామపక్షాలు, భవన నిర్మాణ కార్మిక సంఘాలు కూడా సమస్య పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఈ సమస్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
మరో ముగ్గురు కార్మికుల మరణాలు
గుంటూరు జిల్లాలోనే మరో ముగ్గరు కార్మికులు కూడా మరణించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో కాలే ప్రసన్నకుమార్ తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. కానీ ఇటీవల ఉపాధి లేకపోవడం, అదే సమయంలో అనారోగ్యం కారణంగా మనస్తాపానికి గురయ్యి మరణించినట్టు బంధువులు చెబుతున్నారు.
తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన చింతం నాగబ్రహ్మజీ ఈనెల 26న ఆత్మహత్య చేసుకున్నారు.
‘‘మా ఆయన తాపీ మేస్త్రి. నాలుగైదు నెలలుగా పనులు లేవు. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇల్లు జరగక చంటిబిడ్డను ఇంట్లో వదిలిపెట్టి నేను స్పిన్నింగ్ మిల్లులో పనికి వెళ్తున్నా’’ అంటూ నాగ బ్రహ్మాజీ భార్య భార్య లక్ష్మీ తిరుపతమ్మ మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
చింతం నాగబ్రహ్మజీ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ భార్య లక్ష్మీ తిరుపతమ్మ సహా పలువురు నాయకులు తెనాలిలో ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పార్టీ తరుపున రూ.1లక్ష సహాయం ప్రకటించారు. గోరంట్లకు చెందిన పోలేపల్లి వెంకటేశ్వర రావు కుటుంబానికి టీడీపీ నేతలు కూడా పార్టీ తరపున రూ.2 లక్షల సహాయాన్ని అందించారు.
గుంటూరు నగరానికే చెందిన పడతావు వెంకట్రావు కూడా బలవన్మరణం పాలయ్యారు.

ఆత్మహత్యలపై పోలీసులు ఏమంటున్నారు?
గుంటూరు జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై పోలీసుల వాదన భిన్నంగా ఉంది.
కార్మికుల ఆత్మహత్యలకు కారణాలపై విచారణ సాగుతోందని తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మీ బీబీసీకి తెలిపారు.
"చింతం నాగబ్రహ్మజీ మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకపోవడమే ప్రధాన కారణమని బంధువులు చెబుతున్నారు. ఇతర కారణాలు ఏమున్నాయన్నది పరిశీలిస్తున్నాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం" అని డీఎస్పీ తెలిపారు.
పోలేపల్లి వెంకటేశ్వ రావు సెల్ఫీ వీడియో వ్యవహారంలో కూడా సమగ్ర విచారణ చేపడతామని రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. వీడియోలోని కొంత భాగం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, పూర్తి వీడియో సారాంశం భిన్నంగా ఉందని తమ దృష్టికి వచ్చినట్టు ఆయన తెలిపారు. విచారణ తర్వాత మాత్రమే పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఆయన వివరించారు.
‘భవన నిర్మాణ కార్మికుల మరణాలు ఆపాలి’
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఆంధ్రప్రదేశ్ భవన మరియ ఇతర నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామనరసింహరావు తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ "కార్మికుల ఉపాధి సమస్య గురించి నాలుగు నెలలుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. సెప్టెంబర్ 5 వరకూ కొత్త ఇసుక విధానం పేరుతో జాప్యం చేశారు. ఇప్పుడు వరదలను కారణంగా చూపించి ఇసుక లేకుండా చేస్తున్నారు. ఇసుక లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయి, కార్మికులు ఉపాధి కోల్పోవడంతో అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఇసుక సమస్య పరిష్కరించి 30లక్షల మంది కార్మికులను కాపాడాలి. ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక అక్రమ తరలింపు కూడా సాగుతోంది. దానిని అడ్డుకుంటే కొరత తీర్చవచ్చు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి" అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇసుక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి, వంశధార, తుంగభద్ర వంటి ప్రధాన నదుల్లో వరద కారణంగా తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందని చెబుతున్న ఆయన దానికి ప్రత్యామ్నాయంగా వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు జరిపి , స్థానిక అవసరాలు తీర్చాలని ఆదేశాలు జారీ చేశామని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఎందుకు దొరకడం లేదు? ప్రభుత్వం ఏమంటోంది?
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- సుజిత్ విల్సన్ మృతి.. బోరు బావి నుంచి మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు
- ‘‘ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. ప్రపంచం కళ్లు మూసేసుకుంది’’
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- "విమానం టాయిలెట్లో సీక్రెట్ కెమెరా, పైలెట్లు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు"
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
- అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








