అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, AFP
"అమెరికా కమాండోలు చుట్టుముట్టడంతో వాయవ్య సిరియాలో ఉన్న జీహాదీ గ్రూప్.. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) నాయకుడు, ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అబూ బకర్ అల్-బగ్గాదీ తనను తాను పేల్చేసుకున్నాడు" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
అనుచరులు 'ఖలీఫా ఇబ్రహీం' అని పిలిచుకునే బగ్దాదీపై 25 మిలియన్ డాలర్ల(177 కోట్ల రూపాయలు) బహుమతి ఉంది. ఐదేళ్ల క్రితం ఐఎస్ ఆవిర్భావం నుంచీ అమెరికా, దాని సంకీర్ణ సేనలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయి.
ఐఎస్ పూర్తి బలంతో ఉన్నప్పుడు పశ్చిమ సిరియా నుంచి తూర్పు ఇరాక్ వరకూ 88 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంపై పట్టు సాధించింది. దాదాపు 80 లక్షల మందిపై క్రూర పాలన అమలు చేసింది. చమురు, దోపిడీ, కిడ్నాపింగ్ ద్వారా వందల కోట్ల డాలర్లు సంపాదించింది.

ఫొటో సోర్స్, AFP
ఆస్తికుడుగా పేరు
బగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వద్ ఇబ్రహీం అల్-బద్రి. ఆయన మధ్య ఇరాక్ నగరం సమర్రాలో 1971లో పుట్టారు.
బగ్దాదీని మొహమ్మద్ ప్రవక్త ఖురాయ్ష్ తెగ వారసులని చెప్పే సున్నీ అరబ్ కుటుంబానికి చెందిన వారుగా చెబుతారు. సాధారణంగా ఖలీఫా కావడానికి దానిని ఒక ప్రధాన అర్హతగా భావిస్తారు.
యువకుడుగా ఉన్నప్పుడు ఆయనకు బంధువుల్లో 'ఆస్తికుడు'(భక్తుడు) అనే ముద్దు పేరు ఉండేది. ఎందుకంటే, ఆయన స్థానిక మసీదులో ఖురాన్ చదవడం నేర్చుకుంటున్న సమయంలోనే ఇస్లామిక్ చట్టం లేదా షరియాను పాటించడంలో విఫలమైనవారిని శిక్షించేవారు.
బగ్దాదీ మద్దతుదారులు రాసిన ఆయన జీవిత చరిత్ర ప్రకారం 1990లో స్కూల్ విద్య పూర్తి చేసిన బగ్దాదీ రాజధాని బగ్దాద్ వెళ్లారు. అక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రయత్నానికి ముందు ఇస్లామిక్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు బగ్దాద్ వాయవ్య తోబ్చీ జిల్లాలో ఉన్న ఒక సున్నీ మసీదు దగ్గర నివసించేవాడు. బగ్దాదీ ఎక్కువగా మౌనంగా ఉండేవారని, ఖురాన్ పఠనంలో నిపుణుడని, మసీదు క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆడేవారని చెబుతారు. అప్పుడే బగ్దాదీ సలాఫిజం, జీహాదీజానికి దగ్గరయ్యాడు.

ఫొటో సోర్స్, AFP
'జీహాదీల యూనివర్సిటీ'
అమెరికా నేతృత్వంలో సాగిన దాడులతో 2003లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైంది. అప్పుడు అమెరికా సంకీర్ణ సేనలపై దాడి చేసిన జమాత్ జయేష్ అహ్ల్ అల్-సున్నావా-ఇ-జమా అనే ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూప్ ఆవిర్భావానికి బగ్దాదీ సాయం చేశారని చెబుతారు. అందులో అతడు షరియా కమిటీకి అధిపతిగా ఉండేవారు.
2004లో ఫలూజాలో ఉన్న బగ్దాదీని అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడిని బుక్కా క్యాంపులో నిర్బంధించాయి.
ఈ బుక్కా క్యాంపును ఐఎస్ భవిష్యత్ నాయకులకు ఒక యూనివర్సిటీగా వర్ణిస్తారు. లోపలున్న వారితో కలిసి వారు తీవ్రవాదంవైపు మళ్లేవారు, కీలకమైన కాంటాక్ట్స్ సంపాదించేవారు.
అక్కడ, నిర్బంధంలో ఉన్నప్పుడు బగ్దాదీ ప్రార్థనలు చేయడం, సభలు పెట్టడం చేసేవారు. మతపరమైన బోధనలు చేసేవారు. కొన్నిసార్లు జైల్లో వివాదాలు వచ్చినపుడు అతడిని మధ్యవర్తిత్వం చేయమని అమెరికా అధికారులు అడిగేవారు. బగ్దాదీ నుంచి తమకు పెద్ద ప్రమాదం లేదని భావించిన అమెరికా పది నెలల తర్వాత అతడిని వదిలేసింది.
"2004లో బగ్దాదీని అదుపులోకి తీసుకున్నప్పుడు అతడు ఒక వీధి దొంగ. అప్పుడు మా దగ్గర అతడు భవిష్యత్తులో ఐఎస్‌కు నాయకుడు అవుతాడని చూపించే మాయా దర్పణం ఉండుంటే, బాగుండేది. ఇప్పుడు ఇంత జరిగేది కాదు." అని 2014లో పెంటగాన్ అధికారి న్యూయార్క్ టైమ్స్‌తో అన్నాడు.

ఫొటో సోర్స్, AFP
ఇరాక్‌లో అల్-ఖైదా పునర్నిర్మాణం
బుక్కా క్యాంపు వదిలిన బగ్దాదీ ఇరాక్‌లో కొత్తగా ఏర్పడిన అల్-ఖైదా ఇన్ ఇరాక్(ఏక్యూఐ) కాంటాక్ట్‌లోకి వచ్చారని చెబుతారు. జోర్డాన్ వాసి అబూ ముసబ్ అల్-జరకవీ నాయకత్వంలో ఏక్యూఐ ఇరాక్ తిరుగుబాటు, శిరచ్ఛేదం లాంటి క్రూరమైన దాడులు చేసే ప్రధాన దళంగా మారింది.
2006లో ఏక్యూఐ ముజాహిదీన్ షురా కౌన్సిల్ అనే ఒక జీహాదీ రక్షణ సంస్థను సృష్టించింది. బగ్దాదీ గ్రూప్ అందులో చేరింది.
ఆ ఏడాది చివర్లో అమెరికా వైమానిక దాడుల్లో జరకవీ చనిపోవడంతో, ఆ సంస్థ తన పేరును ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐఎస్ఐ)గా మార్చింది. బగ్దాదీ ఐఎస్ఐలోని షరియా కమిటీలను పర్యవేక్షించేవారు, షురా కౌన్సిల్లో కూడా చేరారు.
2010లో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ఐ నాయకుడు అబూ ఉమర్ అల్-బగ్దాదీ, అతడి డిప్యూటీ అబూ అయ్యూబ్ అల్-మస్రీ మరణించడంతో అబూ బకర్ అల్-బగ్దాదీ దానికి నాయకుడు అయ్యారు.
అమెరికా దళాలు ఓటమి అంచున ఉందని భావించిన ఒక సంస్థకు అతడు నాయకుడు అయ్యారు. కానీ సద్దాం సైన్యంలో పని చేసిన సైనికులు, నిఘా అధికారులు, బుక్కా క్యాంపులో అతడితో కలిసి ఉన్న మాజీ ఖైదీలతో కలిసి అతడు క్రమంగా ఐఎస్ఐ పునర్నిర్మాణం చేశాడు.

ఫొటో సోర్స్, Reuters
'కెప్టెన్ ఇబ్రహీం'
2013లో అతడు ఒకే నెలలో పదికి పైగా దాడులు చేయించారు. దాంతో సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌పై తిరుగుబాటు చేస్తున్న వారు కూడా అతడితో చేతులు కలిపారు. సిరియాలో అల్-ఖైదాకు అనుబంధంగా అల్-నుస్రా ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఆ దేశ మిలిటెంట్లను ఇరాక్ నుంచి తిరిగి వారి దేశానికి పంపించారు. దాంతో, అక్కడ నుంచి ఆయుధాలు పొందడం వారికి మరింత సులభమైంది.
అదే ఏడాది ఏప్రిల్లో ఇరాక్, సిరియాలోని దళాలను విలీనం చేసిన బగ్దాదీ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్(ఐఎస్ఐఎస్/ఐఎస్ఐఎల్) ఏర్పాటు చేశారు. అల్-నుస్రా, అల్ ఖైదా నేతలు దానిని వ్యతిరేకించారు. కానీ వాటిలోని బగ్దాదీ నమ్మకస్తులు అల్-నుస్రాను వదిలి సిరియాలో ఐఎస్ఐఎస్ అడుగుపెట్టేలా సాయం చేశారు.
2013 చివర్లో ఇరాక్‌పై దృష్టి పెట్టిన ఐఎస్ఐఎస్ అక్కడి షియా ప్రభుత్వం, మైనారిటీ సున్నీల మధ్య ఉన్న రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. సద్దాం హుస్సేన్ విశ్వాసపాత్రులు, గిరిజన తెగల సాయంతో ఐఎస్ఐఎస్ ఫలూజాకు కూడా వ్యాపించింది.
2014 జూన్‌లో వేలాది ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఇరాకీ సైన్యాన్ని తరమికొట్టి మోసూల్ నగరాన్ని ఆక్రమించారు. తర్వాత దక్షిణ దిశగా బగ్దాద్ వైపు దూసుకొచ్చారు. అక్కడ, శత్రువులు అందరినీ ఊచకోత కోసిన ఐఎస్ఐఎస్ దేశంలోని ఎన్నో జాతులను, మైనారిటీలను అంతం చేస్తామని భయపెట్టింది.
అదే నెల చివరికల్లా ఇరాక్‌లోని చాలా నగరాలు, పట్టణాలపై పట్టు సాధించిన ఐఎస్ఐఎస్ షరియాకు అనుగుణంగా 'ఖలీఫా సామ్రాజ్యం' ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. దానికి 'ఇస్లామిక్ స్టేట్' అని పేరు పెట్టింది. ఐఎస్ఐఎస్ బగ్దాదీని 'ఖలీఫా ఇబ్రహీం'గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమకు విధేయులుగా ఉండాలని కోరింది.

ఫొటో సోర్స్, AFP
తొలిసారి జనంలోకి
ఐదు రోజుల తర్వత ఐఎస్ మోసూల్‌లోని ప్రముఖ మసీదు అల్-నూరీ నుంచి బగ్దాదీ ప్రసంగిస్తున్న ఒక వీడియోను విడుదల చేసింది. కెమెరా ముందు అతడు కనిపించడం అదే మొదటిసారి.
అతడి తొలి ప్రసంగాన్ని గమనించిన నిపుణులు, అది ఇస్లాం తొలి శతాబ్దంలో ఖలీఫాల ప్రసంగాలను పోలి ఉందని చెప్పారు. మతాన్ని నమ్మనివారితో పోరాటం చేయడానికి మతాన్ని విశ్వసించేవారు ఐఎస్ భూభాగంలోకి వలస రావాలని బగ్దాదీ ముస్లింలను కోరాడు.
నెల తర్వాత ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్‌లో కుర్దిష్ మైనారిటీల అదుపులో ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లారు. యాజిది మతానికి చెందిన వేలాది మందిని ఊచకోత కోసింది. దాంతో అమెరికా సంకీర్ణ సేనలు ఇరాక్‌లోని జీహాదీలకు వ్యతిరేకంగా ఆపరేషన్ ప్రారంభించాయి. పశ్చిమ దేశాలకు చెందిన చాలామంది బందీలను ఐఎస్ శిరచ్ఛేదం చేయడంతో అదే ఏడాది సెప్టెంబర్లో సిరియాలో వైమానిక దాడులు కూడా చేశాయి.
అమెరికా సంకీర్ణ సేనలతో నేరుగా తలపడే ఆ అవకాశాన్ని ఐఎస్ స్వాగతించింది. ఆ పోరాటాన్ని ముస్లింలకు, వారి శత్రువులకు మధ్య ఉన్న విరోధానికి తెరదించే యుద్ధంగా భావించింది.

ఫొటో సోర్స్, Reuters
ఐఎస్ ఓటమి
కానీ తర్వాత ఐదేళ్లలో జీహాదీ గ్రూపులను మెల్ల మెల్లగా అక్కడ నుంచి బయటకు తరిమేయగలిగారు. సైన్యంలోని ఒక ప్రత్యేక గ్రూప్ ఆ పనిని నియంత్రించింది.
ఈ యుద్ధం రెండు దేశాల్లో ఎంతోమంది మరణాలకు కారణమైంది. లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేసింది. మొత్తం ఆ ప్రాంతమంతా విధ్వంసం అయ్యింది.
ఇరాక్‌లో అమెరికా సంకీర్ణ దళాల సాయంతో ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లపై సమాఖ్య సైనిక దళాలు, కుర్దిష్ పెష్మెర్గా సైనికులు పైచేయి సాధించాయి.
సిరియాలో అమెరికా సంకీర్ణ సేనలు, సిరియా కుర్దిష్, అరబ్ మిలిటెంట్లు, సిరియన్ డెమాక్రటిక్ ఫోర్సెస్, దక్షిణ ఎడారిలో కొన్ని సిరియా అరబ్ తిరుగుబాటు దళాలు ఉన్నాయి. అధ్యక్షుడు అసద్‌కు విశ్వసనీయులైన దళాలు కూడా రష్యా వైమానిక దాడులు, ఇరాన్‌కు మద్దతిచ్చే మిలిటెంట్లతో కలిసి ఐఎస్‌తో పోరాడుతున్నాయి.
ఈ యుద్ధం కొనసాగినంత కాలం బగ్దాదీ చనిపోయాడా, లేక సజీవంగా ఉన్నాడా అనే ప్రశ్న అమెరికా దళాలను తొలిచేస్తూనే వచ్చింది.
2017 జూన్‌లో మోసూల్‌లో ఉన్న చివరి ఐఎస్ మిలిటెంట్లతో ఇరాక్ భద్రతా దళాలు పోరాడాయి. రక్కాపై జరిపిన వైమానిక దాడుల్లో బగ్దాదీ చనిపోయుండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు రష్యా అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఖలీఫా సామ్రాజ్యానికి తెర
కానీ సెప్టెంబర్లో బగ్దాదీదిగా చెబుతూ ఒక ఆడియో సందేశాన్ని ఐఎస్ విడుదల చేసింది.
2018 ఆగస్టులో బగ్దాదీ కొత్త ఆడియో సందేశం పంపారు. తర్వాత నెలలో ఎస్డీఎఫ్ ఐఎస్‌ను తూర్పు సిరియా నుంచి తరిమికొట్టేందుకు చివరి దశ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ సమయంలో మోసూల్, రక్కా నుంచి పారిపోయిన వేలాది ఐఎస్ మిలిటెంట్లు, వారి కుటుంబాలు హాజీన్ దగ్గరకు చేరాయి. వారిలో కూడా బగ్దాదీ ఉన్నట్లు సూచనలేవీ కనిపించలేదు.
కానీ తర్వాత ఐఎస్‌లోని ఒక వర్గం అతడిని పదవి నుంచి దించేందుకు ప్రయత్నించడంతో బగ్దాదీ ఇరాక్ పశ్చిమ ఎడారిలోకి పారిపోయినట్లు నిరాధార వార్తలు వచ్చాయి.
2019 మార్చిలో ఐఎస్ అధీనంలో ఉన్న సిరియాలోని చివరి ప్రాంతమైన బఘుజ్ గ్రామం కూడా ఎస్డీఎఫ్ చేతుల్లోకి వచ్చింది. బగ్దాదీ 'ఖలీఫా సామ్రాజ్యానికి' తెర పడింది. సిరియా విముక్తిని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రశంసించారు. "కానీ, ఐఎస్ గురించి అప్రమత్తంగానే ఉంటాం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఘర్షణ యుద్ధం
ఐఎస్‌కు ఈ ప్రాంతంలో ఇంకా వేలాది సాయుధ మద్దతుదారులు ఉన్నారని భావిస్తున్నారు. వారిలో చాలామంది స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారు. ఇరాక్ ప్రభుత్వాన్ని బలహీనం చేసేందుకు ఇప్పటికీ దాడులు చేస్తున్నారు.
2019 ఏప్రిల్లో ఐదేళ్ల తర్వాత బగ్దాదీ ఒక వీడియోలో కనిపించారు. కానీ మోసూల్లోని మసీదు నుంచి ప్రసంగించకుండా, అందులో ఆయన ఒక గదిలో తన పక్కనే రైఫిల్ పెట్టుకుని మాట్లాడుతూ కనిపించారు.
తమకు జరిగిన నష్టం గుర్తించిన బగ్దాదీ "ఐఎస్ ఇప్పుడు ఘర్షణ యుద్ధం చేస్తోందని, సైనికపరంగా, ఆర్థికంగా శత్రువుల అన్ని వనరులపై దెబ్బకొట్టేందుకు దాడులు చేయాలని" మద్దతుదారులను కోరారు.
ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో స్పష్టంగా లేదు. కానీ బగ్దాదీ మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించింది. తను మరో ముగ్గురితో కలిసి కూర్చుని ఉన్నారు. వారి ముఖాలు బ్లర్ చేశారు.
విశ్లేషకులు మాత్రం తను ఇంకా ఐఎస్‌కు నాయకుడుగా ఉన్నానని నమ్మకం కలిగించడానికే అతడు ఆ వీడియో విడుదల చేశాడని చెప్పారు.

ఆమెరికా దళాల ఉపసంహరణ
సెప్టెంబర్ వరకూ అతడి నుంచి ఎలాంటి సందేశాలూ రాలేదు. తర్వాత ఐఎస్ విడుదల చేసిన ఒక ఆడియో క్లిప్‌లో బగ్దాదీ వివిధ దళాలపై తమ 'రోజువారీ ఆపరేషన్లు' కొనసాగిస్తున్నామని చెప్పారు.
సిరియాలోని ఎస్డీఎఫ్ జైళ్లు, కాంపులలో ఎస్డీఎఫ్ నిర్బంధించిన ఐఎస్‌కు సంబంధించిన వేలాది మహిళలు, పిల్లలు, అనుమానిత ఐఎస్ మిలిటెంట్లను విడుదల చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
తర్వాత నెలలో టర్కిష్ సైన్యం ఈశాన్య సిరియాలో ఉన్న ఎస్డీఎఫ్‌పై దాడి చేసింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని నిర్ణయించారు. దాంతో అమెరికా సైన్యం లేని ఆ సమయంలో ఐఎస్ మళ్లీ ఆక్రమించుకుంటుందేమో అని భయపడ్డారు.
ఆ సమయంలో 100 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఐఎస్ స్లీపర్ సెల్స్ ఎన్నో దాడులు చేశారు. కానీ అమెరికా దళాల ఉపసంహరణపై వచ్చిన విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. టర్కీ, సిరియా సహా, ఆ ప్రాంతంలో ఉన్న మిగతా వారు ఐఎస్ ఆ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకోకుండా కలిసి చూసుకోవాలన్నారు. "అవన్నీ పొరుగు దేశాలు. అక్కడ పరిస్థితిని అవే చూసుకోవాలి" అన్నారు.

ఫొటో సోర్స్, AFP
టార్గెట్ బగ్దాదీ
అక్టోబర్ 23న అమెరికా స్పెషల్ ఆపరేషన్ దళాలు వాయవ్య సిరియాలో అధ్యక్షుడు అసద్ వ్యతిరేకులకు పట్టున్న చివరి ప్రాంతమైన ఇడ్లిబ్ ప్రావిన్సులోని బరిషా గ్రామ శివార్లలో దాడులు జరిపాయి. ఆ సైనిక దళాల ఏకైక లక్ష్యం బగ్దాదీ. కానీ అతడు దాక్కున్నాడని వారు మొదట అనుకున్న ప్రాంతం నుంచి ఇది కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ దాడుల తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ "దాడుల సమయంలో బగ్దాదీ తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఒక సొరంగంలోకి పారిపోయాడు. పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్‌ను పేల్చుకున్నాడు" అని చెప్పారు. ఆ పేలుళ్లలో అతడిని వెంటాడుతూ లోపలికి వెళ్లిన నాలుగు అమెరికా మిలిటరీ కుక్కలు కూడా చనిపోయాయని తెలిపారు. పేలుడుతో బగ్దాదీ మృతదేహం ముక్కలైపోయినా, పరీక్షల్లో అది అతడేనని గుర్తించామని చెప్పారు.
"ఒక క్రూర హంతకుడు, ఎన్నో మరణాలకు, కష్టాలకు కారణమైన వ్యక్తి క్రూరంగా అంతమయ్యాడు. తను ఇక అమాయకులెవరికీ ఎప్పుడూ హాని తలపెట్టడు. తను కుక్కచావు చచ్చాడు. ఒక పిరికివాడులా చనిపోయాడు. ఈ ప్రపంచం ఇప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది" అని ట్రంప్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP
కానీ, బగ్దాదీ మృతిపై ఐఎస్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
ఇవి కూడా చదవండి
- ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతం - డోనల్డ్ ట్రంప్
- శిథిల నగరం కింద శవాల కోసం వెదుకులాట
- ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఏ దేశంలో విస్తరిస్తోంది?
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









