గద్దలపై డేటా రోమింగ్ చార్జీలు.. క్రౌడ్ ఫండింగ్‌లో రూ. 1,11,000 సేకరించిన రష్యన్లు

ఫొటో సోర్స్, Getty Images
అవి పక్షులు. వలస పోవటం వాటి నైజం. రష్యా నుంచి ఇరాన్, పాకిస్తాన్‌లకు వలస వెళ్లాయి. అవి అలా వెళ్లినందుకు రష్యన్లు భారీగా డాటా, రోమింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.
ఎంత భారీగా అంటే.. ఆ పక్షుల మీద పరిశోధనలకు కేటాయించిన నిధులన్నీ అయిపోయి కొండంత అప్పులు పేరుకున్నాయి.
అసలు పక్షులకు రోమింగ్ చార్జీలు ఎందుకంటే.. వాటిలో అమర్చిన ట్రాన్స్‌మిటర్ల నుంచి పరిశోధకులకు ఎస్ఎంఎస్ సందేశాలు అందుతుంటాయి. కానీ ఆ పక్షులు ఖండాలు దాటి వలస వెళుతుండటంతో నెట్‌వర్క్, డాటా రోమింగ్ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి.
పరిశోధకుల బృందం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న రష్యా మొబైల్ ఆపరేటర్ మెగాఫోన్.. ఈ పరిశోధన ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ తమకు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేసింది. పరిశోధన కోసం డాటా, రోమింగ్ చార్జీలను అతి చౌకగా అందిస్తోంది.
ఇక పేరుకుపోయిన బిల్లులను చెల్లాంచటానికి పరిశోధకులు సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు.
ఈ పక్షులు దక్షిణ రష్యా, కజకిస్తాన్‌ల నుంచి బయలుదేరి వెళ్లాయి.
ముఖ్యంగా.. మిన్ అనే ఒక స్టెప్పీ గద్ద ప్రయాణం అన్నిటికన్నా ఖరీదుగా మారింది. అది కజకిస్తాన్ నుంచి ఇరాన్‌కు వెళ్లింది.
వేసవి కాలంలో కజకిస్తాన్‌లో ఈ పక్షి మీద పరిశోధనలు ప్రారంభించి.. దాని వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో తెలుసుకోవటానికి ట్రాన్స్‌మిటర్ అమర్చారు. కానీ.. మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో లేకపోవటంతో ఆ ఎస్ఎంఎస్‌లు సరిగా అందలేదు.

ఫొటో సోర్స్, RRRCN SCREENSHOT
అనూహ్యంగా ఆ పక్షి నేరుగా ఇరాన్ వలస వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పక్షికి అమర్చిన ట్రాన్స్‌మిటర్ నుంచి బ్యాక్‌లాగ్ మెసేజిలన్నీ భారీ సంఖ్యలో వచ్చిపడ్డాయి.
కజకిస్తాన్‌లో ఒక్కో ఎస్ఎంఎస్ చార్జీ 15 రూబుళ్లు (దాదాపు 17 రూపాయలు). కానీ.. ఇరాన్ నుంచి వచ్చిన ఒక్కో ఎస్ఎంఎస్‌కి 49 రూబుళ్లు (దాదాపు 55 రూపాయలు) చార్జీ అయింది. రోమింగ్‌లో ఉంది కనుక.
అలా.. అన్ని గద్దల కోసం కేటాయించిన నిధులన్నీ మిన్ వాడేసింది.
దీంతో.. రోమింగ్, డాటా బిల్లులు చెల్లించటానికి.. 'రష్యా గద్ద మొబైల్ ఫోన్‌ను టాపప్ చేయండి' అంటూ నోవోసిబిరిస్క్‌లోని వైల్డ్ యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు క్రౌడ్ ఫండింగ్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. అందులో వారు 1,00,000 రూబుళ్లు (సుమారు రూ. 1,11,000) సేకరించగలిగారు.
ఈ పక్షులు వలస వెళుతున్నపుడు అవి ఎక్కడున్నాయని తెలిపే అక్షాంశ రేఖాంశాలు ఈ ఎస్ఎంఎస్‌ల ద్వారా అందుతాయి. ఆ వివరాల ఆధారంగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఆ పక్షులు సురక్షితమైన ప్రాంతాలకు చేరాయా అనేది పరిశోధకులు పరిశీలిస్తారు.
రష్యా, మధ్య ఆసియా ప్రాంతంలో అంతరించే ప్రమాదంలో ఉన్న ఈ స్టెప్పీ గద్దలకు విద్యుత్ లైన్లు ప్రత్యేకించి ప్రమాదకరంగా తయారయ్యాయి.
పరిశోధకులు ప్రస్తుతం 13 గద్దలను ట్రాక్ చేస్తున్నారు. ఈ పక్షులు సైబీరియా, కజకిస్తాన్‌లలో గుడ్లు పెడతాయి. చలికాలంలో దక్షిణాసియాకు వలస పోతాయి.
ఈ పరిశోధకుల బకాయిలను రద్దు చేస్తామని మెగాఫోన్ ప్రకటించటంతో.. ఆ పక్షుల మార్గానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వీరు పరిశోధనను కొనసాగించవచ్చు. అది వీటి మనుగడకు సాయం చేయటానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఈ రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?
- తిమింగలాల బరువును ఎలా కొలుస్తారు?
- ఒరాంగుటాన్ శాండ్రా: ఇది జంతువు కాదు, మానవ హక్కులున్న మనలాంటి మనిషే'
- బీజేపీ విజయాలకు కారణం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లేకపోవడమేనా
- లారీ కంటైనర్‌లో 39 మృతదేహాలు.. 25 ఏళ్ల లారీ డ్రైవర్ అరెస్ట్
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతం - డోనల్డ్ ట్రంప్
- దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
- దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








