ఈ నైజీరియా రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?

తాబేలు

నైజీరియాలోని రాజభవనంలో ఉండే ఓ తాబేలు స్వల్ప అనారోగ్యంతో మరణించినట్లు ప్రకటించారు. అయితే, ఇది 344 ఏళ్లు జీవించినట్లు తెలిపారు.

అలగ్బాగా పిలిచే ఈ తాబేలు ఓయో రాష్ట్రంలోని ఒగబొమోసో రాజప్రసాదంలో ఉండేది.

అలగ్బా అవసరాలు చూసేందుకు ఇద్దరు వ్యక్తిగత సహాయకులు ఉన్నారని, ఇది నెలకు రెండుసార్లు మాత్రమే తింటుందని బీబీసీ యోరుబా ప్రతినిధి అబ్దుల్ వాసి హసన్ తెలిపారు.

ఈ తాబేలుకు తనంతట తానే రోగాలను నయం చేసుకునే సామర్థ్యం ఉందని, అందుకే ఇది చాలా మంది పర్యటకులను ఆకర్షిస్తుందని భావిస్తారు.

రాజ్యానికి చెందిన మూడో అధినేత ఇసాన్ ఒకుమోయేడె పాలన కాలంలో (1770 నుంచి 1797) ఈ తాబేలును రాజభవనంలోకి తీసుకొచ్చారని చెబుతుంటారు.

ఇసాన్ ఒకుమోయేడె 200 ఏళ్ల క్రితం దేశాన్ని పాలించారు. అప్పటికే ఇది రాజభవనంలోకి వచ్చి 100 ఏళ్లు అవుతోంది. ఇప్పటికి దాని వయసు 344 ఏళ్లకు చేరింది.

అయితే, అలగ్బా వయసుపై సరీసృపాల నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిస్టల్ జంతుప్రదర్శనశాలలోని క్యూరేటర్ టిం స్కెల్టన్ మాట్లాడుతూ, ''అలగ్బా అన్నేళ్లు జీవించడం అనేది అసాధ్యం'' అని పేర్కొన్నారు.

తాబేలు

ఫొటో సోర్స్, GIANLUIGI GUERCIA

ఎలా సాధ్యం?

''వందేళ్లు అనేది తాబేలుకు సంబంధించి మంచి వయసు'' అని స్కెల్టన్ చెప్పారు. ''భారీ తాబేలు 200 ఏళ్ల వరకు బతుకుతుంది. అది కూడా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే'' అని పేర్కొన్నారు.

అలగ్బా ఫొటోలు చూసిన తర్వాత అది భారీ తాబేలు కాదని, ఆఫ్రికన్ భౌగోళిక జాతులకు సంబంధించినదని స్కెల్టన్ చెప్పారు.

జంతుశాస్త్ర నిపుణుడు జాన్ విల్కిన్ సన్‌ కూడా స్కెల్టన్ వాదనతో ఏకీభవించారు.

''ఇది అసంభవమని అనుకుంటున్నాను. తాబేళ్లు అంత ఎక్కువ కాలం జీవించవు'' అని ఆయన చెప్పారు.

సెయింట్ హెలెనాలో ఉండే 187 ఏళ్ల జోనాథన్‌ను ప్రపంచంలోని ఎక్కువ కాలం నుంచి జీవిస్తున్న తాబేలని భావిస్తూ వస్తున్నారు.

''సాధారణంగా తాబేలు 70-80 ఏళ్ల వరకు జీవిస్తుంది. గరిష్టంగా 100 ఏళ్లు బతకొచ్చు'' అని స్కెల్టన్ చెప్పారు.

రాయల్ తాబేలు

ఫొటో సోర్స్, PEACE SOJAY AND HIS FAMILY

అలగ్బా ఎక్కడి నుంచి వచ్చింది?

200 ఏళ్ల కిందట ఒకుమోయేడె విజయవంతంగా రాజ్యాన్ని విస్తరించి తిరిగి ఇంటికి వస్తున్న సందర్భంగా ఈ తాబేలును వెంట తీసుకొచ్చారని చెబుతుంటారు.

ఇదే నిజమైతే ఇప్పటి వరకు అలగ్బా 18 మంది ఒగబొమోసో రాజులను చూసి ఉంటుంది.

అయితే, ఈ విషయాన్ని విల్కిన్సన్ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ''నాకు తెలిసి దీని వెనక రహస్యం ఏమీ లేదు. నిజాయతీగా చెప్పాలంటే ఆ రాజనివాసంలో ఒకటి కంటే ఎక్కువ తాబేళ్లు ఉండి ఉంటాయి'' అని అన్నారు.

''వారు తాబేళ్లను చాలా ప్రేమించారు. అందుకే ఒకటి పోతే ఇంకోటి తెచ్చుకున్నారు'' అని చెప్పారు.

అలగ్బా కథ ఇక్కడితో ముగిసిపోయినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే పర్యటకం, చారిత్రక రికార్డుల కోసం అలగ్బా అవశేషాలను భద్రపరచాలని యోచిస్తున్నట్లు రాజు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)