తిమింగలాల బరువును ఎలా కొలుస్తారు?

అర్జెంటీనా సముద్రంలోని సదరన్ రైట్ తిమింగలం, పిల్ల తిమింగలం

ఫొటో సోర్స్, FREDRIK CHRISTIANSEN

ఫొటో క్యాప్షన్, అర్జెంటీనా సముద్రంలోని సదరన్ రైట్ తిమింగలం, పిల్ల తిమింగలం

ఈ భూమ్మీదే అతిపెద్ద జంతువులైన తిమింగలాల బరువును ఎలా కొలుస్తారు?

ఇప్పటివరకూ ఉన్న ఏకైక మార్గం... అవి చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చినప్పుడు వాటి బరువును కొలవడమే. సముద్రంలో ఉండగా వాటి బరువు తెలుసుకోవడం అసాధ్యం.

కానీ శాస్త్రవేత్తలు డ్రోన్ల సాయంతో తీసిన ఏరియల్ ఫొటోలను ఉపయోగించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నామని చెబుతున్నారు.

ఈ విధానం ద్వారా సదరన్ రైట్ తిమింగలలాల బరువు, పరిమాణాన్ని తాము కచ్చితంగా కొలవగలిగామని వారంటున్నారు. పిల్లతిమింగలాల సంచారాన్ని కనుగొనేందుకు ప్రస్తుతం ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారని, ఇది ఆ జాతి పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటివరకూ తిమింగలాల బరువుకు సంబంధించిన వివరాలు ఎప్పుడో రాసిన పుస్తకాల ద్వారానో లేదా అవి చనిపోయి తీరానికి కొట్టుకొచ్చినప్పుడో, వేటగాళ్ల వలలో పడి దొరికినప్పుడో మాత్రమే తెలుస్తోంది.

"ఓ స్కేలు ఉపయోగించో, మరొకటేదో ఉపయోగించి తిమింగలం బరువు కొలవడం చాలా కష్టం. కొలవాలంటే ముందు దాన్ని చంపాలి. అలా చేయలేం కదా" అని డెన్మార్క్‌లోని ఆర్హస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ సంస్థ పరిశోధన బృందంలో సభ్యుడు ఫ్రెడ్రిక్ క్రిస్టియన్‌సేన్ వ్యాఖ్యానించారు.

చలికాలంలో సంతానోత్పత్తి కోసం అర్జెంటీనా తీరానికి భారీ సంఖ్యలో చేరే సదరన్ రైట్ తిమింగలాలపై ఈ బృందం తమ పరిశోధనలు చేసింది.

పరిశోధకులు సృష్టించిన సదరన్ రైట్ తిమింగలం త్రీడీ నమూనా

ఫొటో సోర్స్, CHRISTIANSEN ET AL

ఫొటో క్యాప్షన్, పరిశోధకులు సృష్టించిన సదరన్ రైట్ తిమింగలం త్రీడీ నమూనా

స్వచ్ఛంగా, నిలకడగా ఉన్న నీటిలో ఈదుతున్న తిమింగలాలపై ఈ బృందం తమ డ్రోన్లను ఎగరవేస్తుంది. తిమింగలాలు, వాటి పిల్లలు శ్వాస తీసుకోవడానికి నీటి ఉపరితలానికి వచ్చినప్పుడు వాటి ఫొటోలను తీశారు. అవి ఎన్ని వైపులకు తిరిగితే అన్ని వైపుల నుంచి ఫొటోలు తీశారు.

అలా తీసిన 86 తిమింగలాలకు సంబంధించిన ఫొటోల సాయంతో వాటి పొడవు, వెడల్పు, ఎత్తులను గణించారు.

దీంతో తిమింగలాల శరీరాకృతి ఎలా ఉందనేదానిపై వారికి స్పష్టత వచ్చింది. దీన్ని ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వివరాలతో జోడించి వాటి పొడవు, బరువు, మధ్యభాగంలో చుట్టుకొలతలను లెక్కించారు. ఈ లెక్కల సాయంతో తిమింగలం బరువును వారు అంచనా వేస్తున్నారు.

"స్వేచ్ఛగా తిరిగే తిమింగలాల బరువును అంచనా వేయడం ద్వారా వాటిని తరచుగా పరీక్షించడానికి, వాటి బరువులో వచ్చే మార్పులను, ఎదుగుదలను గుర్తించడానికి అవకాశాలేర్పడతాయి" అని ప్రొఫెసర్ క్రిస్టియన్‌సేన్ అన్నారు.

అర్జెంటీనా తీరంలో డ్రోన్లు ఎగరేసి తిమింగలాలపై పరిశోధనలు చేశారు.

ఫొటో సోర్స్, FREDRIK CHRISTIANSEN

ఫొటో క్యాప్షన్, అర్జెంటీనా తీరంలో డ్రోన్లు ఎగరేసి తిమింగలాలపై పరిశోధనలు చేశారు.

మహాసముద్రాల్లోని తిమింగలాల సంఖ్యను, వాటి ఆరోగ్య పరిస్థితులను అంచనావేయడానికే కాదు, వాటి పరిరక్షణకు కూడా ఈ డ్రోన్ అధ్యయనాలు ఉపయోగపడే అవకాశముంది.

దీంతోపాటు, ఈ పద్ధతికి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇతర సముద్ర జంతువుల స్థితిగతులను కూడా గణించవచ్చు.

బలీన్ తిమంగలాలు ఈ భూమిపై నివసించే జీవుల్లో అతిపెద్దవి. 3500 కేజీల బరువుడే పిగ్మీ రైట్ తిమింగలాల నుంచి 1,90,000 కేజీలుండే బ్లూ వేల్స్ వరకూ వీటిలో అనేక జాతులున్నాయి.

శరీర బరువే ఈ జంతువుల మనుగడకు కీలకం. ఇదే తిమింగలాలు తమ శక్తిని ఉపయోగించడానికి, అవసరమైన ఆహారాన్ని అన్వేషించడానికి దోహదం చేస్తుంది.

అర్జెంటీనాలోని సదరన్ రైట్ వేల్ హెల్త్ మానిటరింగ్ ప్రోగ్రామ్, అమెరికాలోని వుడ్స్ హోల్ ఓషనోగ్రఫిక్ ఇన్‌స్టిట్యూషన్‌ల సహాయంతో ఈ పరిశోధన జరిగింది.

ఈ వివరాలు బ్రిటిష్ ఎకలాజికల్ సొసైటీ జర్నల్‌లో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)