అంతరిక్షంలో మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయా, పురుషులకు ఉంటాయా?

ఫొటో సోర్స్, Spl
అంతరిక్షంలోకి ఇప్పటివరకూ దాదాపు 564 మంది వ్యోమగాములు వెళ్లారు. వారిలో 65 మంది మాత్రమే మహిళలు.
సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా టెరెష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ. 1963లోనే ఆమె ఈ ఘనత సాధించారు.
ఆ తర్వాత 20 ఏళ్లకు గానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తమ తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ను అంతరిక్షంలోకి పంపలేకపోయింది.
'మీతో పాటు మేకప్ కిట్ తీసుకువెళ్తున్నారా? అంతరిక్ష నౌక సిమ్యులేషన్ (నమూనా)లో లోపాలు కనిపించినప్పుడు ఏడ్చారా?'.. ఇవీ అంతరిక్ష యాత్రకు ముందు ఆమెను మీడియా అడిగిన ప్రశ్నలు.

ఫొటో సోర్స్, NASA
గత అక్టోబర్ 18న నాసా ప్రత్యేకంగా అందరూ మహిళా వ్యోమగాములతోనే తొలిసారి ఓ స్పేస్ వాక్ నిర్వహించింది. ఈ ఏడాది మొదట్లోనే దీన్ని చేపట్టాల్సి ఉన్నా, ఓ వ్యోమగామికి సరిపడే మీడియం సైజు స్పేస్ సూట్ లేకపోవడంతో కుదరలేదు.
అసలు మహిళా వ్యోమగాముల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటోంది? అంతరిక్షంలో పురుషులు, మహిళలకు ప్రతికూలతలు వేర్వేరుగా ఉంటాయా? అసలు సమస్య ఎక్కడుంది?
సమాధానాల కోసం డాక్టర్ వర్షా జైన్‌తో బీబీసీ మాట్లాడింది.
దశాబ్దకాలంగా ఆమె స్పేస్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి నాసాతో కలిసి పరిశోధనలు చేస్తున్నారు.
బీబీసీ వ్యాఖ్యాత ఎమ్మా బార్నెట్ అడిగిన ప్రశ్నలకు వర్షా జైన్ ఇచ్చిన సమాధానాలు ఆమె మాటల్లోనే..

అంతరిక్ష వాతావరణ ప్రభావం మహిళలు, పురుషులపై భిన్నంగా ఉంటుందా?
మొత్తంగా అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడటం మహిళలు, పురుషుల్లో ఒకేలా ఉంటుంది. కానీ, కొన్ని తేడాలు ఉన్నాయి.
అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మహిళలకు ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. పురుషులకైతే.. తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక చూపు, వినికిడికి సంబంధించిన సమస్యలు పురుషులకు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు సంబంధించిన సమస్యలు మహిళలకు వస్తుంటాయి.
శరీరపరమైన, హార్మోన్ల తేడాల వల్లే ఇలా జరుగుతుందా అన్నది ఇంకా తెలియదు. ఇలాంటి వాటి గురించి లోతుగా అర్థం చేసుకుంటే దీర్ఘకాలంలో అంతరిక్షంలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన వస్తుంది.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఎలా?
అంతరిక్షంలో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? శాలీ రైడ్‌ను అంతరిక్షంలోకి పంపేటప్పుడు నాసా ముందున్న ప్రశ్నలు ఇవే.
సమస్యగా మారనంత వరకూ దీన్నొక సమస్యగా చూడొద్దని అప్పటి మహిళా వ్యోమగాములు అన్నారు. కానీ, ఇంజినీర్లు అన్ని ప్రణాళికలూ వేసుకోవాలి. ఎన్ని శానిటరీ ఉత్పత్తులు అవసరమవుతాయో అంచనా వేసుకోవాలి.
పురుషాధిపత్య సమాజం కాబట్టి, అప్పుడు వారు వారానికి 100 నుంచి 200 దాకా శానిటరీ ప్యాడ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అన్ని అవసరం లేదని తర్వాత తెలుసుకున్నారు.
ప్రస్తుతం మహిళా వ్యోమగాములు పీరియడ్స్‌ను ఆపేందుకు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. వారు ఆరోగ్యవంతులు కాబట్టి వాటిని వాడటం వల్ల సమస్యేమీ ఉండదు.
ఇంకా ఏయే మార్గాల ద్వారా పీరియడ్స్ రాకుండా చేయొచ్చన్న విషయంపైనా నేను పరిశోధనలు చేస్తున్నాను.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
టాయిలెట్లతో వచ్చే సమస్యేంటి?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో రెండు టాయిలెట్లు ఉన్నాయి. అయితే, పీరియడ్స్ రక్తాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించలేదు.
అంతరిక్షంలో మూత్రాన్ని వృథా చేయరు. దాన్ని రీసైకిల్ చేసి, మంచి నీరు తయారు చేస్తారు.

ఫొటో సోర్స్, NASA
పీరియడ్స్ రక్తాన్ని ఓ ఘనరూప పదార్థంగానే పరిగణిస్తారు. స్పేస్ స్టేషన్‌లోని టాయిలెట్లు దీని నుంచి ద్రవ పదార్థాలను వేరు చేయలేవు. కాబట్టి అందులో ఉండే నీటిని రీసైకిల్ చేయలేం.
నీటి వినియోగంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి. రుతుస్రావం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం ఇబ్బందే.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
సంతాన సామర్థ్యంపై ప్రభావం పడుతుందా?
అంతరిక్ష యాత్రల వల్ల సంతాన సామర్థ్యం మీద ప్రభావం పడుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
అంతరిక్ష యాత్రలకు వెళ్లొచ్చిన తర్వాత పిల్లలను కన్న పురుషులు, మహిళలు ఉన్నారు.
తొలిసారి అంతరిక్ష యాత్ర చేపట్టే సమయానికే మహిళా వ్యోమగాముల సగటు వయసు 38 ఏళ్లుగా ఉంటోందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు.
భవిష్యత్తులో సంతానం పొందేందుకు అండాలను, వీర్యాన్ని ఘనీభవించి భద్రపరుచుకోవడమన్నది వారివారి వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నాసా నిబంధనలేవీ పెట్టలేదు.
వ్యోమగాములకు అంతరిక్షంలో రేడియేషన్ ముప్పు ఉంటుంది. అయితే, అది సంతాన సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలియదు.
అంతరిక్ష ప్రయాణంలో వీర్య నాణ్యత తగ్గుతుంది. కానీ తిరిగివచ్చిన తర్వాత మళ్లీ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ప్రభావం ఎలా ఉంటున్నది మాత్రం అధ్యయనం చేయాల్సి ఉంది.
మహిళల్లో పుట్టేటప్పుడే వారి జీవితకాలానికి అవసరమయ్యే అండాలుంటాయి. అంతరిక్ష యాత్రలకు ముందు అండాలను భద్రపరచాలనుకునే మహిళా వ్యోమగాములకు నాసా చాలా సహకరిస్తోంది.

ఫొటో సోర్స్, Alamy
అంతరిక్షంలోకి మీరు వెళ్తారా?
ఎక్కువకాలమైతే ఉండాలనుకోను. ఎందుకంటే శారీరకంగా వచ్చే మార్పుల గురించి నాకు చాలా తెలుసు.
అంతరిక్షంలో శరీరం వయసు పైబడే ప్రక్రియ వేగం పెరిగినట్లుగా ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. తిరిగి భూమిపైకి వచ్చాక ఎన్ని మంచి చర్యలు తీసుకున్నా, అందులో కొన్ని భాగాలు తిరిగి కోలుకోవడం లేదు.
అంతరిక్షం నుంచి భూమిని చూడటం నాకూ ఇష్టమే. కానీ, దాన్నొక దీర్ఘకాలిక లక్ష్యంలా చూస్తా. ప్రస్తుతానికి నేను నా డ్రీమ్ జాబ్ చేస్తున్నా.
ఇవి కూడా చదవండి
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









