జస్టిస్ రంజన్ గొగొయ్: రెండు వారాల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పులు వెల్లడించే అవకాశం

జస్టిస్ రంజన్ గొగొయ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుచిత్రా మొహంతి
    • హోదా, సీనియర్ న్యాయవాది, బీబీసీ కోసం

అయోధ్యలోని వివాదాస్పద భూభాగానికి సంబంధించిన కేసులో వచ్చే రెండు వారాల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశముంది. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సందర్భం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 4 నుంచి 15వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ అంశంపై తీర్పును వెల్లడించొచ్చు.

ఈ కేసు విచారణలో మొదటినుంచీ ఉన్న జస్టిస్ గొగొయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేస్తున్నారు. ఆరోజు సెలవు రోజు కావడంతో దానికన్నా ముందే సుప్రీంకోర్టు అయోధ్య కేసులో తీర్పును వెల్లడించే అవకాశముంది.

జస్టిస్ రంజన్ గొగొయ్

ఫొటో సోర్స్, Getty Images

ఇది చాలా సున్నితమైన కేసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని మాజీ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్ అన్నారు.

"ఇది రాజకీయంగానూ, మతపరంగానూ చాలా చాలా సున్నితమైన అంశం. నాలుగు దశాబ్దాలకు పైబడి నడుస్తున్న భూవివాదం ఇది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాక.. ఆ తీర్పు ఎలా ఉన్నప్పటికీ అన్ని వర్గాలూ శాంతియుతంగా ఉండాలి" అని పరాశరన్ బీబీసీతో అన్నారు.

అయోధ్య

ఫొటో సోర్స్, AFP

"ఉన్నత న్యాయస్థానం తీర్పు ఏమైనప్పటికీ మనమంతా దాన్ని స్వాగతించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని ధిక్కరించకూడదు" అని మరో ప్రముఖ క్రిమినల్ లాయర్ గీతా లూథ్రా అభిప్రాయపడ్డారు.

"అన్నిచోట్లా శాంతి నెలకొనాలి. వివిధ వర్గాలు, మతాలకు చెందిన మనమంతా కోర్టు తీర్పును గౌరవించాలి" అని లూథ్రా బీబీసీతో అన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

నవంబర్ 4-15 మధ్యలో సీజేఐ గొగొయ్ మరికొన్ని కీలకమైన తీర్పులు కూడా ఇచ్చే అవకాశముంది.

ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారాన్ని సమీక్షించడం, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం, సీజేఐ కార్యాలయం సమాచార హక్కు పరిధిలోకి వస్తుందా రాదా వంటి అంశాలపై కూడా గొగొయ్ తుది తీర్పునివ్వవచ్చు.

రఫేల్ యుద్ధ విమానం అందుకున్న రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు

రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై డిసెంబర్ 14, 2018న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని వచ్చిన పిటిషన్లపై సీజేఐ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మే 10, 2019న తన తీర్పును రిజర్వ్ చేసింది.

36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గత సంవత్సరం డిసెంబరు 14న సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే, తీర్పును సమీక్షించాలని చాలా పిటిషన్లు వచ్చాయి.

మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వంటివారు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

దీనిపై సమీక్షించాలని పిటిషనర్లంతా కోరారు. అనేక తప్పుడు చర్యలు, అవసరమైన సమాచారాన్ని దాచిపెట్టడం ద్వారా ఈ ఒప్పందం జరిగిందని వారు ఆరోపించారు.

పిటిషనర్ల ఆరోపణలను వ్యతిరేకించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. సమీక్ష పిటిషన్లను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్లకు ఎలాంటి విచారణయోగ్యతా లేదని ఆయన అన్నారు.

శబరిమల ఆలయ వివాదం

ఫొటో సోర్స్, Getty Images

శబరిమల ఆలయ ప్రవేశ వివాదం

అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి.

నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్), ఆలయ తంత్రి వంటి వారు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తన తీర్పును రిజర్వు చేసింది.

దీనిపై కూడా తుది తీర్పు రావచ్చు.

ఆర్టీఐ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా?

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా, రాదా అనే అంశంపై సీజేఐ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చే అవకాశం ఉంది.

సీజేఐ కార్యాలయం 'పబ్లిక్ అథారిటీ' అంటూ జనవరి 2010 నాటి దిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

పిటిషనర్ సుభాష్ చంద్ర అగర్వాల్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్... సరైన వ్యక్తుల నియామకం జరగడానికి, ప్రజల కోసం, ప్రజలకు సమాచార వెల్లడి చేయడం మంచిది అని వ్యాఖ్యానించారు.

"నియామకాలు, బదిలీల ప్రక్రియ అంతా ఓ మిస్టరీగా ఉంది. ఇది పవిత్రంగా ఉండాలి, దీనిలోని రహస్యాలన్నీ ప్రజలకు తెలియాలి" అని భూషణ్ అన్నారు.

"పారదర్శకత ఆవశ్యకతను అనేక తీర్పుల్లో కోర్టులు స్పష్టం చేశాయి. కానీ కోర్టుల పారదర్శకత విషయానికి వచ్చేసరికి అవి ముందుకురావడం లేదు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, ఇంకా ఇతర అంశాలు ఆర్టీఐ చట్టం పరిధిలోకి రావాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)