యోగా శిక్షకులు తమ ఆసనాలతో తుంటి ఎముక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారా?

ఫొటో సోర్స్, NATALIE GARTSHORE
- రచయిత, కరోలిన్ పార్కిన్సన్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్
భారత్‌లో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది.
శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమమైన వ్యాయామం అని భావించి యోగాను చేస్తున్నవారు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. ఇక వారికి శిక్షణనిస్తున్నవారు వేలల్లో ఉన్నారు.
అయితే, కొందరు యోగా శిక్షకులు ఆసనాలను మరీ తీవ్రంగా ప్రయత్నిస్తూ తుంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని బ్రిటన్‌కు చెందిన బెనోయ్ మాథ్యూస్ అనే ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ అంటున్నారు.
కొందరు శస్త్ర చికిత్సలు అవసరమయ్యేంత తీవ్రమైన సమస్యలను తెచ్చుకుంటున్నారని చెప్పారు.
తమ శరీరం సహకరించకున్నా, అతి కష్టమైన ఆసనాలను పదేపదే ప్రయత్నించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
చార్టర్డ్ సొసైటీ ఆఫ్ ఫిజియోథెరపీలో సభ్యుడైన మాథ్యూస్.. తుంటి, మోకాలు వైద్యంలో నిపుణుడు.
ప్రతి నెలా తన దగ్గరికి కనీసం ఐదుగురు యాగా శిక్షకులు తుంటి నొప్పి సమస్యతో వస్తున్నారని ఆయన చెప్పారు. వారిలో సగం మందికి ఆసనాలను సరిచేసుకోమని సలహా ఇస్తుంటానని అన్నారు.
ఇంకొందరికి మాత్రం తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా చేయాల్సి వస్తోందని చెప్పారు.
''వ్యక్తులు తమ తమ శరీరాలకు ఉన్న పరిమితులను తెలుసుకోవాలి. ఆసనాలు వేసేటప్పుడు గజ్జల్లో నొప్పిగా అనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. కొందరికి నొప్పికి, కండరాల బిగుతుకు తేడా తెలియదు'' అని మాథ్యూస్ అన్నారు.
కీలు నొప్పి వస్తే ఆసనాన్ని ఆపివేయాలని, మరీ తీవ్రంగా ప్రయత్నించకూడదని ఆయన సలహా ఇచ్చారు.

''యోగా ప్రయోజనాలు మనందరికీ తెలుసు. నేనూ యోగా చేస్తా. కానీ, అన్ని వ్యాయామాల్లాగే అందులోనూ గాయాలకు ఆస్కారం ఉంది'' అని మాథ్యూస్ వివరించారు.
''యోగాను నేనేమీ తోసిపుచ్చడం లేదు. దానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, మనల్ని మనం అర్థం చేసుకోవాలి'' అని అన్నారు.
''ఆ వ్యక్తి శరీరం ఎంతవరకూ వంగగలదు? వారి తుంటి ఎముకల అమరిక ఎలా ఉంది? అన్నవి ముఖ్యం. కొందరు ఇతరులను చూసి, తమకు సాధ్యం కానీ ఆసనాలను మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంటారు. అహం కూడా ఇందుకో కారణం కావొచ్చు. కానీ, ఇబ్బందిగా అనిపించినప్పుడు ఆసనాన్ని ఆపేయాలి'' అని మాథ్యూస్ అభిప్రాయపడ్డారు.
యోగా శిక్షకులు మిగతా రకాల వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తుండొచ్చని మాథ్యూస్ అన్నారు.
''వారంలో ఆరో రోజులూ యోగా చేసే వాళ్లు.. కార్డియో, క్రాస్ ట్రెయినింగ్ లాంటి మిగతా వ్యాయామాలను చేయకుండా ఉండొచ్చు. ఒకే పని మళ్లీ, మళ్లీ చేస్తుంటే సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి'' అని చెప్పారు.
వివిధ రకాల వ్యాయామాలను మిళితం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.
''నా దగ్గరికి వచ్చేవాళ్లలో 40-42 ఏళ్ల వాళ్లు ఉంటున్నారు. 10 మీటర్లు కూడా నడవలేని స్థితిలో ఉంటే, ఫిజియో ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. సమస్య రెండేళ్లకుపైగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. కొన్ని సార్లు కీహీల్ సర్జరీ లేదా తుంటి మార్పిడి చేయాల్సి రావొచ్చు'' అని మాథ్యూస్ అన్నారు.
యోగా శిక్షణ ఎలా ఇవ్వాలో నేర్పించేటప్పుడు ఫిజియోలజీ, అనాటమీ (శరీర శాస్త్రం)లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని నటాలీ గార్ట్‌షోర్ అన్నారు.
ఆమె 16 ఏళ్లుగా యోగా శిక్షణను ఇస్తున్నారు.
ఐదేళ్ల క్రితం ఆమె తుంటిలోని మృదులాస్థిలో చీలిక వచ్చింది.
యోగా శిక్షణ కార్యక్రమాల భారం మరీ ఎక్కువగా ఉండకుండా ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. వారాంతాల్లో పనిచేయడం ఆపేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని రకాల యోగా పద్ధతుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఎక్కువ సేపు ఒకే ఆసనంలో జనాలు ఉంటుంటారని, అలాంటి చర్యల వల్ల సమస్యలు తలెత్తుతాయని బ్రిటీష్ వీల్ ఆఫ్ యోగా ఎడ్యుకేషన్ చైర్‌వుమన్ వెండీ హారింగ్ అన్నారు.
బ్రిటీష్ వీల్ ఆఫ్ యోగాకు బ్రిటన్ ప్రభుత్వ సంస్థ 'స్పోర్ట్ ఇంగ్లండ్' గుర్తింపు ఉంది. యోగా గురువులకు శిక్షణ కోర్సులు, సర్టిఫికేషన్ కూడా అందిస్తోంది.
తమ సంస్థ నిర్దేశించిన కోర్సుల్లో అనాటమీ, ఫిజియోలజీలకు ప్రధాన పాత్ర ఉందని, ఆసనాలను మార్చడం కూడా తాము నేర్పిస్తామని హారింగ్ అన్నారు.
బ్రిటన్‌లో ప్రభుత్వం ఆమోదించిన కోర్సుల్లోనే శిక్షకులు చేరాలని సూచించారు.
యోగా అద్భుతమైన వ్యాయామమని, ఆరోగ్యపరంగా దాని నుంచి ఎన్నో ప్రయోజనాలున్నాయని చార్టర్డ్ సొసైటీ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రొఫెషనల్ అడ్వైజర్ పిప్ వైట్ అన్నారు.
''మనందరి శరీరాలు ఒకేలా ఉండవన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. యోగా అంటే ఒకరితో మరొకరికి పోటీ కాదు. శరీరానికి ఉన్న పరిమితులను పాటిస్తూనే, యోగా ప్రయోజనాలన్నింటినీ పొందొచ్చు'' అని వివరించారు.
ఇవి కూడా చదవండి.
- అబ్దుల్లాపూర్‌మెట్: ‘భూ వివాదంతోనే తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- స్వామి వివేకానంద నుంచి మోదీ వరకు.. యోగాను ఎలా ప్రపంచవ్యాప్తం చేశారు
- ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక యాత్ర 'ఆజాదీ మార్చ్'లో మహిళలు ఎందుకు లేరు
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- రష్యా జైళ్లలో యోగా: 'సెక్స్ కోరికలు పెరిగి హోమో సెక్సువల్స్ అవుతారు'
- భారతదేశ కొత్త మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎందుకు చూపించలేదు?
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








