పాకిస్తాన్‌లో ఆజాదీ మార్చ్: ఇమ్రాన్‌ ఖాన్ వ్యతిరేక యాత్రలో మహిళలు ఎందుకు లేరు

ఆజాదీ మార్చ్ శుక్రవారం రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆజాదీ మార్చ్ శుక్రవారం రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది
    • రచయిత, ఫ్లోరా డ్రురీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ పాక్ నలుమూలల నుంచి నిరసనకారులు ఒక మార్చ్ (యాత్ర) చేపట్టారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీల్లో ఒకటైన జమియత్ ఉలేమా-ఎ ఇస్లాం - ఫజ్లుర్ రెహ్మాన్ (జేయూఐ-ఎఫ్) సభ్యులే.

మస్టర్డ్ యెల్లో దుస్తులు ధరించి, తెలుపు, నలుపు రంగులతో కూడిన జెండాలు చేతబూని నిరసనకారులు అక్టోబరు 27న కరాచీలో ప్రారంభించిన ఈ 'ఆజాదీ మార్చ్ (స్వేచ్ఛా యాత్ర)' చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ యాత్రలో ఒక్క సామాన్య మహిళ కూడా లేరు. ఎందుకు?

మహిళలు ఇంట్లోనే ఉండి ఉపవాసం పాటించాలని, ప్రార్థనలు చేయాలని చెబుతూ యాత్ర ప్రారంభానికి ముందు నిర్వాహకులు కరపత్రాలు పంపిణీ చేశారు.

జేయూఐ-ఎఫ్ కాన్వాయ్‌లో ఒక్క మహిళ కూడా లేరని బీబీసీ ఉర్దూ రిపోర్టర్లు చెప్పారు.

యాత్రలో పాల్గొంటున్నవారిలో అత్యధికులు జేయూఐ-ఎఫ్ మద్దతుదారులే

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, యాత్రలో పాల్గొంటున్నవారిలో అత్యధికులు జేయూఐ-ఎఫ్ మద్దతుదారులే

శుక్రవారం ఈ యాత్ర రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఇతర విపక్షాలతో కలిసి జేయూఐ-ఎఫ్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేయకుండా మహిళా రిపోర్టర్లపై 'నిషేధం' విధించారనే ప్రచారం జరిగింది.

కొందరు మహిళా రిపోర్టర్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. తమను తీవ్రంగా వేధించారని, మరో దారి లేక కార్యక్రమ స్థలి నుంచి వచ్చేశామని మరికొందరు మహిళా జర్నలిస్టులు చెప్పారు.

"మహిళలకు అనుమతి లేదు, మహిళలు ఇక్కడ ఉండకూడదు, వెళ్లిపోండి" అని ఒక వ్యక్తి తమకు హుకుం జారీచేశారని, తర్వాత ఓ గుంపు తమను చుట్టుముట్టి నినాదాలు చేసిందని, దీంతో అక్కడి నుంచి వచ్చేశామని జర్నలిస్ట్ షిఫా జడ్ యూసఫ్‌జాయ్ ట్విటర్లో తెలిపారు.

మాకు అపార గౌరవం: రెహ్మాన్

జేయూఐ-ఎఫ్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ స్పందిస్తూ- మహిళలంటే తమకు అపార గౌరవం ఉందని, ఫుల్ డ్రెస్ కోడ్‌లో మహిళా జర్నలిస్టులు ఈ ర్యాలీకి రావొచ్చని చెప్పారని ఏపీపీ వార్తాసంస్థ తెలిపింది.

ర్యాలీలో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారనే ప్రచారాన్ని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర అసెంబ్లీలో జేయూఐ-ఎఫ్‌కు ప్రాతినిధ్యం వహించే నయీమా కిష్వర్ ఖాన్ తోసిపుచ్చారు. యాత్రలో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని సమర్థించుకున్నారు.

"సైన్యాన్ని చూడండి. మగవారు ముందుంటారు, మహిళలు వెనకుండి వైద్య సహాయం అందిస్తుంటారు. మా ఉద్యమం యుద్ధం లాంటిది" అని ఆమె వ్యాఖ్యానించారు. "దేశంలో పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. లేదంటే మహిళలు వెనక ఉండేవారు కాదు" అని ఆమె అన్నారు.

ఆజాదీ మార్చ్

ఫొటో సోర్స్, AFP

జేయూఐ-ఎఫ్ యాత్రలో పాల్గొన్న మహిళలు కూడా ప్రముఖంగా కనిపించలేదు. వీరిలో కొందరు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినవారు.

యాత్రలో మహిళల ప్రాతినిధ్యం కొరవడటంపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.

యాత్రలో మహిళలు లేకపోవడం మంచిదేనని జర్నలిస్ట్ బేనజీర్ షా బీబీసీ ఉర్దూతో అభిప్రాయపడ్డారు. "ఈ మార్చ్ ఇద్దరు మగవారు, వారి అహంభావాల మధ్య పోరాటం. ఇది వారి బలప్రదర్శన కూడా. ఈ పోరాటంలో ఈ దేశ మహిళలు భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

"లెబనాన్లో మాదిరి సామాజిక మార్పు కోసం స్త్రీ, పురుషులు కలసి చేపట్టిన ఉద్యమం లాంటిది కాదు ఈ మార్చ్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని జేయూఐ-ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మతాన్ని ఉపయోగించడం, ఇతర వక్రమార్గాలను పాటించడం చేస్తుంది" అని ఆమె తెలిపారు. ఈ యాత్రలో పాల్గొంటే ఈ దేశ మహిళలు తప్పు చేసినట్లవుతుందన్నారు.

నిరసనకారులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నిర్వాహకులు తమను వెళ్లిపొమ్మన్నారని యాత్రను కవర్ చేయడానికి వెళ్లిన కొందరు మహిళా రిపోర్టర్లు చెప్పారు.

యాత్ర ఎందుకు?

ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ చిరకాల ప్రత్యర్థి. 18 నెలలుగా అధికారంలో కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురైన తొలి పెద్ద సవాలు ఈ యాత్రే. ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వంలోని ఈ యాత్రకు ఇతర ప్రధాన విపక్షాల మద్దతు ఉంది.

48 గంటల్లో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని ఈ పార్టీలు శుక్రవారం డిమాండ్ చేశాయి.

2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ తప్పుడు విధానంలో గెలిచారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందనే ఆధారాలేవీ లేవని ఈ ఎన్నికలను పరిశీలించిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధులు గుర్తించారు. అయితే ఎన్నికల సన్నాహాల్లో అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలను కల్పించలేదని వారు చెప్పారు.

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనమూ ఇమ్రాన్ ఖాన్‌పై నిరసనకారుల ఆగ్రహానికి ఓ కారణం. ఆర్థిక కష్టాల నుంచి ప్రజలను ఆదుకుంటానని ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం వారి కష్టాలను పెంచింది.

"వాళ్లు (ఇమ్రాన్ ఖాన్) ప్రజాబలంతో అధికారంలోకి రాలేదు. ఇతరుల నిర్దేశంతో గద్దెనెక్కారు. వాళ్లు ప్రజల కోసం పనిచేయరు. వాళ్లను ప్రధాని పదవికి ఎంపిక చేసినవారినే సంతోషపెడతారు" అని రెహ్మాన్ తన మద్దతుదారులతో అన్నారు.

జేయూఐ-ఎఫ్ అధినేత రెహ్మాన్ నాయకత్వంలో సాగుతున్న యాత్ర

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జేయూఐ-ఎఫ్ అధినేత రెహ్మాన్ నాయకత్వంలో సాగుతున్న యాత్ర

రెహ్మాన్ యాత్రకు వేరే కారణాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

తెలివైన రాజకీయ నాయకుడైన రెహ్మాన్, సంవత్సరాలపాటు ప్రభుత్వంలో తన పాత్ర పోషించారు. గత ఏడాది ఎన్నికల్లో తన స్థానంలో ఆయన ఓడిపోయారు.

కాలమిస్టు అరీఫా నూర్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ- కీలక రాజకీయ వ్యవహారాల్లో రెహ్మాన్‌కు పాత్ర లేకుండా పోయిందని, తనకు దక్కాల్సిన స్థానం దక్కకుండా చేశారనే భావన ఆయనలో ఉందని చెప్పారు.

జేయూఐ-ఎఫ్ ఎన్నడూ మహిళల అనుకూల పార్టీ కాదని జర్నలిస్టు బేనజీర్ షా అభిప్రాయపడ్డారు. పరువు హత్యల నిరోధక బిల్లును, మహిళల రక్షణ బిల్లును, బాల్య వివాహాల నిరోధక బిల్లును ఆ పార్టీ వ్యతిరేకించిందని ఆమె ప్రస్తావించారు.

మహిళల కోసం జేయూఐ-ఎఫ్ కాకుండా మిగతా మూడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా పాలక పక్షం ఏం చేస్తోందో అందరూ ఆలోచించాల్సి ఉందని బేనజీర్ చెప్పారు. జాతీయ కేబినెట్లో మహిళలకు అరకొర ప్రాతినిధ్యమే ఉందని, పంజాబ్ రాష్ట్ర కేబినెట్లో ఇద్దరే ఇద్దరు మహిళలు ఉన్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)