‘ప్రేమలో పడ్డందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు’

ఫొటో సోర్స్, GARY LYON
కింది స్థాయి ఉద్యోగితో ప్రేమలో పడ్డందుకు తాను ఉద్యోగం కోల్పోవాల్సి రావడం తనకు ఇప్పటికీ విడ్డూరంగానే అనిపిస్తోందని ఆస్ట్రేలియన్ వ్యాపారి గేరీ లయాన్ అంటున్నారు.
అయితే, అలా ఉద్యోగం కోల్పోయినా జీవితంలో తనకంతా మంచే జరిగిందని ఆయన చెబుతున్నారు.
టమ్రాను గేరీ పెళ్లాడి 12 ఏళ్లు గడుస్తున్నాయి. వారికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. బ్రిస్బేన్‌లో సొంతంగా వారు ఇప్పుడు ఓ సంస్థను నడుపుతున్నారు.
తమ ఉద్యోగులు ఎవరైనా ప్రేమలో పడితే తనకు సంతోషమేనని గేరీ అంటున్నారు. ''పని మీద వారి బంధం ప్రభావం పడనంతవరకూ నాకు అసలు అది సమస్యే కాదు'' అని ఆయన చెప్పారు.
మెక్ డోనల్డ్స్ సంస్థ తమ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ తాజాగా పదవి నుంచి తొలగించింది. సంస్థలోని మరో ఉద్యోగితో ఆయన డేటింగ్‌లో ఉండటమే ఇందుకు కారణం.
పరస్పర అంగీకారంతోనే వారి బంధం కొనసాగుతున్నా, తమ నియమనిబంధనలకు అది విరుద్ధమని మెక్ డోనల్డ్స్ తెలిపింది.
ఒకే సంస్థలో పనిచేస్తూ ప్రేమించుకునేవారు, ముఖ్యంగా వారిలో ఒకరు సీనియర్ పదవిలో ఉన్నవారైతే వచ్చే సమస్యలపై చర్చకు ఈ ఉదంతం కారణమైంది.
ఈస్టర్‌బ్రూక్ తొలగింపు వార్త తెలుసుకుని, గేరీ లయాన్ బీబీసీని సంప్రదించారు.
గతంలో గేరీ తలుపులు, కిటికీలు తయారు చేసే ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేసేవారు. అక్కడ ఆయన కింది ఉద్యోగుల్లో ఒకరిగా టమ్రా చేరారు. ఆమె ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా ఉండేవారు. 3-4 నెలల తర్వాత ఒక ఆఫీస్ కార్యక్రమంలో వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. అది ప్రేమగా మారింది.
''మొదటి చూపులోనే ఆమె నాకు నచ్చింది. ఆ తర్వాత నేను కూడా తనకు నచ్చినట్లు టమ్రా సంకేతాలిచ్చింది'' అని గేరీ చెప్పారు.
''ఆఫీసులో కలిసి సమయం గడుపుతాం కాబట్టి ఒకరి గురించి మరొకరికి బాగా తెలుస్తుంది'' అని అన్నారు.
వారి ప్రేమ బంధం మొదలయ్యే సమయానికి గేరీ వయసు 41 ఏళ్లు. టమ్రా ఆయన కన్నా 14 ఏళ్ల చిన్నవారు.

ఫొటో సోర్స్, GARY LYON
మొదట్లో వాళ్లు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. కొన్ని రోజుల తర్వాత బయటకు చెప్పడం మొదలుపెట్టారు.
వీళ్ల డేటింగ్ మొదలైన మూడు నెలలకు గేరీని పైఅధికారులు ఓ రోజు పిలిచి, ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. టమ్రాను మాత్రం తీసేయలేదు.
''నా ఉద్యోగం పోవడంతో టమ్రా చాలా బాధపడింది. కానీ, మనం చేయగలిగిందేమీ లేదు'' అని గేరీ అన్నారు.
''సహోద్యోగులతో డేటింగ్‌కు సంబంధించి నియమనిబంధనలేవీ స్పష్టంగా లేవు, నన్ను ఏకపక్షంగానే తొలగించారు. సమాజం ఇంకా పాత విధానాలనే పాటిస్తోందనడానికి ఇది నిదర్శనం'' అని గేరీ అభిప్రాయపడ్డారు.
''మేనేజర్లు కింది స్థాయి ఉద్యోగులతో డేటింగ్ చేయకూడదా? పరస్పర అంగీకారం ఉంటే తప్పేంటి? మనం ఎవరితో ప్రేమలో పడతామో మనకే తెలియదు. జంటలో ఒకరిని ఉద్యోగంలో నుంచి తీసేసి, దాన్నొక నేరంలా ఎందుకు మార్చుతున్నారు?'' అని ఆయన ప్రశ్నించారు.
ఎక్కువ కాలం కొనసాగే బంధాల్లో 25 నుంచి 33 శాతం వరకూ బంధాలు సహోద్యోగుల మధ్య ఏర్పడుతున్నవేనని ఇదివరకు అధ్యయనాల్లో వెల్లడైంది.
అయితే, సహోద్యోగుల మధ్య ఏర్పడుతున్న బంధాలన్నీ దీర్ఘకాలిక బంధాలేమీ కావు.

ఫొటో సోర్స్, Getty Images
మెక్ డోనల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ విషయంలోనే కాదు.. ఇది వరకు కూడా ప్రముఖ సంస్థల్లో ఉన్న కొందరు ఇలా ప్రేమ వ్యవహారాల కారణంగా ఉన్నత పదవులు కోల్పోవాల్సి వచ్చింది.
2018లో ఇంటెల్ సీఈఓ బెరియన్ క్రాజనిక్ తమ సంస్థలో ఓ ఉద్యోగితో పరస్పర అంగీకారంతో బంధంలో ఉన్నందుకు పదవిని వీడాల్సి వచ్చింది. ఆ బంధం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే దానికి కారణం.
2016 ఏప్రిల్‌లో ప్రైస్‌లైన్.కామ్ అనే ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్ అధిపతి డారెన్ హ్యూస్టన్ తమ సంస్థ ఉద్యోగితో తనకున్న బంధం ఓ విచారణలో బయటపడటంతో రాజీనామా చేశారు.
2009లో అవివా సంస్థ అధిపతి ఆండ్రూ మోస్ తమ సంస్థలోని ఓ సీనియర్ అధికారి భార్య (ఆమె కూడా ఆ సంస్థలో ఉద్యోగే)తో తనకు సంబంధం ఉన్నట్లు అంగీకరించినా, పదవిలో కొనసాగారు. చివరికి, 2012లో ఆయన ఆ సంస్థను వదిలివెళ్లారు.
హాలీవుడ్‌లో పేరుమోసిన నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ మీద చాలా మంది సినీ నటులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. #MeToo పేరుతో పెద్ద ఉద్యమానికి ఇది దారితీసింది. ఆఫీసుల్లో, పనిచేసే చోట్ల మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ఈ విషయంలో కఠినంగా ఉంటున్నాయి.
ఓ సీనియర్ ఉద్యోగి తన కింది స్థాయి ఉద్యోగితో బంధంలో ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజన (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తొచ్చు.
''వేతన పెంపు, పదోన్నతి, అవకాశాల కల్పన, పని కేటాయింపు.. ఇలా చాలా వ్యవహారాల్లో తమకు ఇష్టమైనవారికి వ్యక్తులు అనుకూలంగా వ్యవహరించవచ్చు'' అని బ్రిటన్‌లోని న్యాయ నిపుణురాలు రెబెక్కా థార్న్లీ-గిబ్సన్ అన్నారు.
''సీనియర్ ఉద్యోగులు ఇష్టపడుతున్నామని చెబితే, కాదనడాకి కింది స్థాయి ఉద్యోగులు భయపడొచ్చు. లైంగిక వేధింపుల ముప్పు కూడా ఉంటుంది'' అని అభిప్రాయపడ్డారు.
అలా అని బంధాలను అడ్డుకోవడం సరికాదని, వాటి వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను నివారించే విధానాలను సంస్థలు ఏర్పరుచుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి.
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికే వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు
- తిరువల్లువర్ విభూతిపై తమిళనాడులో వివాదం ఎందుకు రేగింది?
- గర్ల్‌ఫ్రెండ్‌కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- మీ ఎక్స్ మీ 'టైప్' కాదని బ్రేకప్ చెప్పారా... మరి కొత్త లవర్ సంగతేమిటి...
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








