ఫేస్‌బుక్ లోగోలో మార్పులు... వాటిలో మాత్రమే కనిపిస్తుంది

ఫొటో సోర్స్, `
ఫేస్‌బుక్ తన ఉత్పత్తులు, సేవలకు సంబంధించి కొత్త బ్రాండింగ్ ఇవ్వబోతోంది. రాబోయే కొద్ది వారాల్లో ఫేస్‌బుక్ కొత్త బ్రాండ్... ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కనిపించనున్నాయి.
అయితే, తన ప్రధాన వెబ్‌సైట్, యాప్‌లకు సంబంధించి గతంలో ఉన్న నీలి రంగు బ్రాండింగ్‌నే ఫేస్‌బుక్ కొనసాగిస్తుంది. కొత్త లోగోలో ఫేస్‌బుక్ పేరు క్యాపిటల్ లెటర్స్‌లో కనిపిస్తుంది.
ఇకపై ఉత్పత్తిని బట్టి బ్రాండింగ్ వివిధ రంగులలో కనిపించనుంది. ఉదాహరణకు, వాట్సాప్‌లో అయితే ఆకుపచ్చగా ఉంటుంది. ''ప్రపంచంతో, వ్యక్తులతో మా బ్రాండ్ ఆలోచనాత్మకంగా అనుసంధానం కావాలని కోరుకుంటున్నాం'' అని ఫేస్‌బుక్ తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK
ఫేస్‌బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో మాట్లాడుతూ, ''వినియోగదారులు వారు ఉపయోగించే ఉత్పత్తులను ఏ కంపెనీలు తయారు చేస్తాయో తెలుసుకోవాలి. ఫేస్‌బుక్‌లో భాగమైన ఉత్పత్తులు, సేవల గురించి చాలా ఏళ్ల నుంచి ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాం'' అని పేర్కొన్నారు.
అమెరికా చట్టసభల సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ మాట్లాడుతూ, ''ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ వంటి పెద్ద టెక్నాలజీ కంపెనీలను విడదీయాలి. వాటిపై కఠినమైన నియంత్రణ ఉంచాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఫేస్‌బుక్ బ్రాండింగ్ మార్పుపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.
''ఫేస్‌బుక్ తాను కోరుకున్న విధంగా బ్రాండింగ్‌ను మార్చుకోవచ్చేమో, కానీ, ఈ టెక్ కంపెనీలు చాలా పెద్దవి, శక్తిమంతమైనవి అనే నిజాలను దాచలేవు. పెద్ద టెక్ కంపెనీలను విడదీసే సమయం వచ్చేసింది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాండింగ్ మార్చడం సత్ఫలితాలిస్తుందా?
గతంలో అనేక పెద్ద కంపెనీలు తమ బ్రాండింగ్‌ను మార్చే ప్రయత్నం చేశాయి.
- 2001లో బ్రిటిష్ విమానయాన సంస్థ తన బ్రాండింగ్‌ను మార్చుకుంది. తన ఎయిర్‌క్రాఫ్ట్‌లోని జెండాపై ఉన్న ఎరుపు, తెలుపు, నీలం రంగును తొలగించింది. దానిస్థానంలో ప్రపంచపటాన్ని తీసుకొచ్చింది.
- గతేడాది డంకిన్ డోనట్స్ సంస్థ తన పేరులోని డోనట్స్‌ను తొలగించింది. కాఫీ వ్యాపారంలోకి రావడానికి ఈ ప్రయత్నం చేసింది. పేరు మార్పు తర్వాత దాని షేర్ ధరలు పెరుగుతూ వచ్చాయి.
అనేక కారణాలతో ఇటీవల ఫేస్‌బుక్ విమర్శలకు గురైంది. నిజనిర్ధారణ లేకుండా రాజకీయ ప్రకటనలను ఫేస్‌బుక్‌లో ప్రచారం చేయడంపై ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల అమెరికా చట్టసభ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
సామాజిక మాధ్యమంలో చిన్నారులపై వేధింపులను అరికట్టే విషయంలో విఫలమవడం, డిజిటల్ కరెన్సీ విషయంలో అడ్డంకులు, కేంబ్రిడ్జ్ అనలటికా డాటా కుంభకోణం ఇటీవల ఫేస్‌బుక్‌ను చుట్టుముట్టాయి.
వ్యక్తిగత గోప్యతను పెంపొందించేందుకు ఫేస్‌బుక్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ఈ ఏడాది మొదట్లో జుకర్‌బర్గ్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
'అక్కడ అవసరం లేదు'
బ్రాండ్ క్యాప్ కన్సల్టెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన్ఫ్రెండ్ అబ్రహం బీబీసీతో మాట్లాడుతూ, ''ఇది ఫేస్‌బుక్‌కు సంబంధించి విజయవంతమైన ముందడుగు అవుతుంది. బ్రాండ్ మార్పు అనేది సరళీకరణలో ఒక భాగం. బ్రాండింగ్ మార్పు అనేది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు'' అని పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం విషయంలో లోగోను మార్చకుండా అలాగే ఉంచడం సరైన చర్యేనని తెలిపారు.
''ఫేస్‌బుక్ ప్రధాన వెబ్‌సైట్‌కు బ్రాండ్ మార్పు అవసరం లేదు'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి: బీబీసీ గ్రౌండ్‌రిపోర్ట్
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- గద్దలపై డేటా రోమింగ్ చార్జీలు.. క్రౌడ్ ఫండింగ్‌లో రూ. 1,11,000 సేకరించిన రష్యన్లు
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








