ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సురక్షితం కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్జు పింగ్ చాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫేస్‌బుక్ తన క్రిప్టో కరెన్సీ లిబ్రా సురక్షితమైందేనని నిరూపించుకుంటేనే దానికి అనుమతి లభిస్తుందని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీ7 దేశాల గ్రూప్ ఒక నివేదికలో తెలిపింది.
క్రిప్టో కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకకరమని జీ7 నివేదిక హెచ్చరించడం సోషల్ మీడియా దిగ్గజానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
డిజిటల్ కరెన్సీల వల్ల కలిగే తొమ్మిది ముఖ్యమైన నష్టాలను జీ7 ముసాయిదా నివేదిక పేర్కొంది.
లిబ్రా మద్దతుదారులు తమ ఆందోళనలను పరిష్కరించినప్పటికీ, ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించకపోవచ్చని హెచ్చరించింది.
లిబ్రా ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు చెల్లింపుల సంస్థలు మాస్టర్ కార్డ్, వీసాలు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ హెచ్చరిక వచ్చింది.
ఈ నివేదికను రూపొందించిన జీ7 టాస్క్‌ఫోర్స్‌లో జీ20 ఆర్థిక వ్యవస్థలకు నియమాలను నిర్దేశించే కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు సీనియర్ అధికారులు ఉన్నారు.
లిబ్రా వంటి డిజిటల్ కరెన్సీలను తీసుకొచ్చేవారు చట్టబద్ధంగా ఉండాలని, లావాదేవీలకు భద్రత కల్పించాలని,
మనీలాండరింగ్ చేయడానికి లేదా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగపడకుండా చూసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది.
ఈ వారంలో ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలలో ఆర్థిక మంత్రులకు అందించే ఈ నివేదికలో లిబ్రా మాత్రమే కాకుండా ఇలాంటి డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేసింది.
వేగంగా నగదు బదిలీ చేసే సామర్థ్యం ఉన్న ''ఇలాంటి అంతర్జాతీయ కాయిన్స్'' వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం
వడ్డీ రేట్లను నిర్ణయించే విధాన రూపకర్తలకు కూడా లిబ్రా వంటి గ్లోబల్ క్రిప్టో కరెన్సీలు సమస్యలు సృష్టిస్తాయని ఆ నివేదిక వెల్లడించింది.
లిబ్రా వల్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో పోటీ ఉండదని, వినియోగదారుల విశ్వాసం కోల్పోతే ఆర్థిక స్థిరత్వం కూడా ప్రమాదంలో పడే ఆవకాశం ఉందని హెచ్చరించింది.
''చట్టపరంగా ఉండటం, నియంత్రణ, పర్యవేక్షణ సవాళ్లు, నష్టాలను తగినంతగా పరిష్కరించే వ్యవస్థ లేనంత వరకు ఇలాంటి డిజిటల్ కరెన్సీల ప్రాజెక్ట్ కార్యకలాపాలు ప్రారంభించరాదని జీ7 నమ్ముతోంది'' అని ముసాయిదా నివేదిక తెలిపింది.
లిబ్రా ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నవారు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు లేవనెత్తిన ఆందోళనలను సంతృప్తిపరిచినప్పటికీ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

విడుదల ఆలస్యం
'లిబ్రా ప్రాజెక్టు ఈ సవాళ్లకు ప్రాధాన్యమిచ్చి, వాటిని పరిష్కరించాలి" అని జీ20 ఆర్థిక మంత్రులకు రాసిన లేఖలో ఎఫ్‌ఎస్‌బీ చైర్మన్ రాండల్ క్వార్ల్స్ హెచ్చరించారు.
రెగ్యులేటరీ అంతరాలను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారులతో కలసి ఎఫ్‌ఎస్‌బీ
పనిచేస్తోంది. వచ్చే వేసవిలో ఇది ఒక నివేదికను ప్రచురించనుంది.
లిబ్రా విషయంలో రెగ్యులేటరీ స్క్రూటినీ ఆలస్యం అవడమో లేదా ఆటంకం కలిగే అవకాశం ఉందని ఫేస్‌బుక్ ఇప్పటికే తెలిపింది.
ఒక్క లిబ్రా మాత్రమే కాకుండా అనేక క్రిప్టో కరెన్సీలు ఈ తరహా స్క్రూటినీలను ఎదుర్కొంటున్నాయి.
జేపీ మోర్గాన్‌కు చెందిన జేపీఎం కాయిన్ అమెరికా డాలర్ మద్దతుతో నడుస్తోంది. దీన్ని కూడా స్క్రూటినీ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్ ఏమయ్యారు?
- 'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు
- 'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








