చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్ ఏమయ్యారు? వేర్పాటువాదం కేసులో మరణ శిక్ష పడిందా?

ఫొటో సోర్స్, EPHE
- రచయిత, ఆండ్రూస్ ఇల్మర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆయన ఓ ప్రొఫెసర్. ఆదర్శప్రాయుడైన విద్యావేత్త. చైనాలో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి సారథి. ఫ్రాన్స్‌లోని ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి గౌరవ డిగ్రీ అందుకున్నారు. ఆయనకు అంతర్జాతీయంగా సంబంధాలున్నాయి. ఆయన 2017లో ఒక రోజు చైనాలో ఉన్నట్టుండి కనిపించకుండాపోయారు. ఆయన ఆచూకీపై ఎలాంటి సమాచారమూ లేదు. చైనా రహస్య విచారణ జరిపి, వేర్పాటువాదం అభియోగాలపై ఆయన్ను నేరస్థుడిగా తేల్చి, మరణశిక్ష విధించిందని ప్రొఫెసర్ స్నేహితులు భావిస్తున్నారు.
చైనాలోని జిన్‌జియాంగ్ విశ్వవిద్యాలయం సారథి అయిన తష్‌పోలట్ తియిప్ వీగర్ ముస్లిం. వీగర్లు జిన్‌జియాంగ్ రాష్ట్రంలో మూలవాసులు. ఈ రాష్ట్రానికి భారత్ సహా ఎనిమిది దేశాలతో సరిహద్దులు ఉన్నాయి.
వీగర్ వర్గం మేధావులను చైనా పీడిస్తోందని, తియిప్ చైనా వేధింపుల బారిన పడ్డారని హక్కుల గ్రూపులు చెబుతున్నాయి. వీగర్ల అంశాన్ని వేర్పాటువాద, ఉగ్రవాద ముప్పుగా చైనా పేర్కొంటోంది.
వీగర్లను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని, వీరిలో వందల మంది వీగర్ విద్యావేత్తలు, మేధావులు, ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారని 'ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ద డిజప్పియర్డ్' పుస్తక రచయిత, పరిశోధకుడు మైకేల్ కాస్టర్ బీబీసీతో చెప్పారు.
వీగర్ వర్గాన్ని, వీగర్ వర్గ సాంస్కృతిక ప్రతినిధులను, సైద్ధాంతిక నాయకులను చైనా లక్ష్యంగా చేసుకొంటోందని, ఇది 'సాంస్కృతిక జాతిహననం' కిందకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ ప్రొఫెసర్ తియిప్ ఇప్పుడు చైనా నిర్బంధంలో ఉన్నట్లయితే ఆయనకు మరణశిక్ష ముప్పుందని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, HANDOUT
సీపీసీలో పనిచేసిన తియిప్
జిన్‌జియాంగ్ విశ్వవిద్యాలయంలో తియిప్ భౌగోళిక శాస్త్రం (జాగ్రఫీ) ప్రొఫెసర్. ఆచార్యుడిగా ఆయనకు మంచి పేరుంది. చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల మాదిరే ఇది కూడా ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం.
జిన్‌జియాంగ్ రాష్ట్రంలోని వీగర్ సమూహంలో తియిప్ ఒకరు. స్వరాష్ట్రంలోనే జాగ్రఫీ చదువుకున్నారు. కొంత కాలం జపాన్‌లో ఉన్నారు. తర్వాత చైనాకు వచ్చేసి తను చదువుకున్న చోటే పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు.
అంతర్జాతీయ విద్యావేత్తల వ్యవహారాల్లో తియిప్ క్రియాశీలంగా ఉండేవారు. ఫ్రాన్స్‌లోని 'ఎకోల్ ప్రాటిక్ డెస్ హాటెస్ ఎట్యూడ్స్ (ఈపీహెచ్‌ఈ)' అనే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డిగ్రీ అందుకున్నారు.
ఆయన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) సభ్యుడిగానూ ఉన్నారు. 2010లో జిన్‌జియాంగ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో ఆచూకీ తెలియకుండాపోయే వరకు కూడా ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, EPHE
ఎలా అదృశ్యమయ్యారు?
ప్రొఫెసర్ తియిప్‌పై విచారణ రహస్యంగా సాగింది. ఆయనకు ఏం జరిగిందనే దానిపై అధికారిక రికార్డులేవీ లేవు.
2017లో ఒక సమావేశంలో పాల్గొనేందుకు, ఓ జర్మనీ విశ్వవిద్యాలయంతో కలసి చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఐరోపా వెళ్తుండగా చైనా రాజధాని బీజింగ్‌లోని విమానాశ్రయంలో ఆయన్ను అధికారులు అడ్డుకున్నారు. జిన్‌జియాంగ్ రాష్ట్ర రాజధాని ఉరూంఖికి తిరిగి వెళ్లిపోవాలని ఆయనకు చెప్పారు.
అప్పట్నుంచి ప్రొఫెసర్ తియిప్ ఎన్నడూ ఇంటికి రాలేదు. తర్వాత తియిప్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన స్నేహితులను, బంధువులను అధికారులు విచారించారు.
ఆ తర్వాత వేర్పాటువాదం అభియోగాల కేసులో తియిప్‌ను దోషిగా తేల్చారని, ఆయనకు మరణశిక్ష పడిందనే వార్త కుటుంబ సభ్యులకు అందిందని అమెరికాలో ఉన్న ఆయన మాజీ కొలీగ్ ఒకరు బీబీసీతో చెప్పారు.
ఆమె అమెరికాలో పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కూడా తియిప్ మాదిరే జిన్‌జియాంగ్‌కు చెందిన వీగర్ ముస్లిం. జిన్‌జియాంగ్‌లో తన స్నేహితులు, బంధువులు ఉంటున్నారని, వారికి ముప్పు కలగకుండా ఉండేందుకు తన వివరాలను వెల్లడించవద్దని ఆమె కోరారు.
'భయమనే ఆయుధంతో చేస్తున్న యుద్ధం'
ప్రొఫెసర్ తియిప్ కేసుకు సంబంధించిన ఏ సమాచారాన్నీ చైనా ఎన్నడూ ధ్రువీకరించలేదు.
జిన్‌జియాంగ్‌లో వీగర్ ముస్లింలపై చైనా చేపట్టిన కఠిన చర్యలతో అంతటా భయాందోళన నెలకొందని, తమపై ఎప్పుడూ నిఘా ఉందనే భావన అక్కడ అందరిలో ఉందని ఆ పరిశోధకురాలు వెల్లడించారు. రాత్రికి రాత్రి తమను కూడా అధికారులు తీసుకెళ్లిపోతారేమోననే భయం వీగర్లలో ఉందన్నారు.
"ఇది వీగర్లపై భయమనే ఆయుధంతో చైనా చేస్తున్న యుద్ధమని నా ఫ్రెండ్ ఒకరు అన్నారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ కూడా కనిపించకుండాపోయారు" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
వాట్సప్ ఉన్నా అదుపులోకి!
నిర్బంధ శిబిరాల్లో వీగర్లను, ఇతర ముస్లింలను, మైనారిటీలను సుమారు పది లక్షల మందిని చైనా బంధించిందని ఐక్యరాజ్య సమితి నిపుణులు, హక్కుల గ్రూపులు చెబుతున్నాయి.
వీగర్లకు సంబంధించి పెద్దయెత్తున చేపడుతున్న ఆపరేషన్‌ను చైనా తోసిపుచ్చడం లేదు. అయితే నిర్బంధించిన వారికి చదువు చెప్పించడం, వారు చైనా ప్రధాన స్రవంతిలో కలసిపోయేలా చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని నియంత్రిస్తున్నామని చైనా చెబుతోంది.
జిన్‌జియాంగ్‌లో ఆత్మీయులతో, శ్రేయోభిలాషులతో సమాచారం పంచుకోవడం కూడా కష్టమని ఫ్రొఫెసర్ తియిప్ స్నేహితులు చెబుతున్నారు. సమాచార వ్యవస్థలపై కన్నేసి ఉండే అధికార యంత్రాంగం దృష్టిలో పడకుండా ఉండేందుకు సంకేత పదాలతో సమాచారం పంచుకొంటున్నారని పేర్కొంటున్నారు. ఫోన్లో వాట్సప్ ఉంటే కూడా అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.
తమ సంబంధీకులతో మాట్లాడేటప్పుడు వాళ్ల పేర్లు కూడా చెప్పకుండా మాట్లాడతామని, అలాగైతైనే వాళ్లు ఏవైనా వివరాలు చెబుతారని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ప్రొఫెసర్ కుటుంబం ఏమనుకుంటోంది?
తియిప్ బతికే ఉన్నారని ఆయన కుటుంబం నమ్ముతోంది. వేర్పాటువాదం కేసుల్లో దోషులుగా తేలిన తియిప్, ఇతర విద్యావేత్తలకు సంబంధించిన వీడియోలు చూపించి నిర్బంధ కేంద్రాల్లోని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే సమాచారం వారి వరకు వచ్చింది.
ప్రొఫెసర్ తియిప్, ఆయన జాడ గురించి ప్రజలకు తెలియాలని చైనా కోరుకోదని, మనుషుల జాడ తెలియకుండా చేయడమెలా అనేదానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని పరిశోధకుడు మైకేల్ కాస్టర్ వ్యాఖ్యానించారు.
మళ్లీ మద్దతుదారుల ప్రయత్నాలు
ప్రొఫెసర్ తియిప్ గల్లంతైనప్పటి నుంచి ఆయన కేసును అందరి దృష్టికి తెచ్చేందుకు ఆయన మద్దతుదారులు పదే పదే ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఆయనకు రెండేళ్ల 'సస్పెండెడ్ మరణ శిక్ష' విధించి ఉంటారని వారు భావిస్తున్నారు. వారి నమ్మకమే నిజమైతే ఆ రెండేళ్ల కాలం ఇప్పుడు పూర్తి కావస్తోంది. దీంతో ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన విడుదలకు మద్దతు కూడగట్టేందుకు వారు మళ్లీ కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి శిక్ష విధించినప్పుడు దోషిగా తేలిన వ్యక్తి నిర్దేశిత కాలంపాటు షరతులకు లోబడి ఉంటే శిక్షను రద్దుచేసే లేదా సడలించే అవకాశం ఉంటుంది.

విడుదలకు డిమాండ్లు
ప్రొఫెసర్ తియిప్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల్లోనే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ జాగ్రాఫర్స్ (ఏఏజీ) ఒక లేఖ విడుదల చేసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా 1300 మందికి పైగా విద్యావేత్తలు, మేధావులు సంతకాలు చేశారు.
"తియిప్ అరెస్టు, నిర్బంధం, మరణ శిక్ష విధింపు చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మేధోస్వేచ్ఛకు పెను ముప్పు" అని ఏఏజీకి చెందిన డాక్టర్ గ్యారీ లాంగమ్ వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ తియిప్‌ను విడుదల చేయాలని ఆయనకు గౌరవ డిగ్రీ ప్రదానం చేసిన ఫ్రాన్స్‌లోని ఈపీహెచ్‌ఈ విశ్వవిద్యాలయం కూడా చైనాను డిమాండ్ చేసింది.
తియిప్ విచారణ గోప్యంగా సాగిందని, ఇది నిష్పాక్షికంగా జరగలేదని ఆక్షేపిస్తూ హక్కుల గ్రూపు 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' సెప్టెంబరులో ప్రకటన చేసింది. ఆయన విడుదలకు చైనాను ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చింది.
తియిప్‌కు మరణ శిక్ష అమలును వెంటనే నిలిపివేయాలని, ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా కేంద్రంగా పనిచేసే విద్యాసంస్థల అంతర్జాతీయ నెట్‌వర్క్ 'స్కాలర్స్ అట్ రిస్క్' కూడా ఒక ప్రకటన చేసింది.

ఫొటో సోర్స్, AFP
ఆచూకీ తెలియకుండా పోయిన మేధావులు
జిన్‌జియాంగ్ రాష్ట్రంలో చాలా మంది విద్యావేత్తలు, మేధావులు కనిపించకుండాపోయారు. వేర్పాటువాదం అభియోగాలపై జరిగిన తొలి ఉన్నతస్థాయి అరెస్టు- ఆర్థికవేత్త తోహ్తి అరెస్టే. 2014లో ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించారు.
వీగర్ల పట్ల చైనా ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించేవారు. వీగర్లు, హన్ చైనీస్ మధ్య హింసాత్మక ఘర్షణల్లో ప్రభుత్వం పాత్రను ఆయన ప్రశ్నించేవారు.
గత నెల్లో ఆయనకు 'కౌన్సిల్ ఆఫ్ యూరప్స్ వాక్లా హావెల్ ప్రైజ్ ఫర్ హ్యూమన్ రైట్స్' లభించింది.
జిన్‌జియాంగ్ యూనివర్శిటీకే చెందిన ప్రముఖ ఆంత్రోపాలజిస్టు రహీలే దావుత్ కూడా 2017లో కనిపించకుండాపోయారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమెపై ఏవైనా కేసులు పెట్టారా అనేదీ తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
జిన్‌జియాంగ్ రాష్ట్రంలో అనాదిగా ఉంటున్న వీగర్లు టర్కీ సంతతి ముస్లింలు. ఈ రాష్ట్రానికి టిబెట్ మాదిరే స్వయంప్రతిపత్తి ఉంది. జిన్‌జియాంగ్ చైనా పశ్చిమ ప్రాంతంలో ఉంది. చైనాలోనే అతిపెద్ద రాష్ట్రమైన జిన్‌జియాంగ్‌కు భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజక్‌స్తాన్, రష్యా, మంగోలియా దేశాలతో సరిహద్దు ఉంది.
దాదాపు 2.2 కోట్ల జనాభా గల ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది వీగర్ ముస్లింలున్నారు. చైనాలోని ఇతర ప్రాంతాల్లో ఉండే 'హన్ చైనీస్' ప్రజలు, సహజ వనరులు పుష్కలంగా ఉండటంతో జిన్‌జియాంగ్‌కు పెద్దయెత్తున వలస వచ్చారు.
తదనంతర కాలంలో హన్ వ్యతిరేక, వేర్పాటువాద భావనలు ఇక్కడ పెరిగాయి. చైనా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందన్న భావన 1990 నుంచి స్థానిక వీగర్లలో బలపడుతూ వస్తోంది. 1990లో ఇక్కడ వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంది. చైనా పాలనకు వ్యతిరేకంగా అప్పటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌కు నోబెల్ శాంతి పురస్కారం
- 97 ఏళ్ల వయసులో నోబెల్
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- నోబెల్ పురస్కారాలు: పోలండ్ రచయిత్రి ఓల్గా (2018), ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కే (2019)
- కణాలు ఆక్సిజన్ స్థాయులను ఎలా గుర్తిస్తాయో పరిశోధించిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను మరో మావో అని ఎందుకంటారు?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- విరాట్ కోహ్లీ: బ్రాడ్‌మన్, సచిన్, సెహ్వాగ్‌ల రికార్డ్ బ్రేక్
- బంగ్లాదేశ్ జైలులో విజయనగరం జిల్లా మత్స్యకారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








