నోబెల్: కణాలు ఆక్సిజన్ స్థాయులను ఎలా గుర్తిస్తాయో పరిశోధించిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్

ఫొటో సోర్స్, Getty Images
కణాలు ఆక్సిజన్‌ను ఎలా గుర్తిస్తాయి, దాని స్థాయికి తగ్గట్లుగా ఎలా తమ పనితీరు మార్చుకుంటాయనే అంశాలపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 నోబెల్ బహుమతి వరించింది.
మానవ శరీరంలోని కణాలు ఆహారాన్ని శక్తిగా మార్చుకోవడానికి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి.
శరీరంలో ప్రాణవాయువు స్థాయులు తగ్గినప్పుడు కణాలు తమ పనితీరును మార్చుకుని, దానికి అనుగుణంగా ఎలా స్పందిస్తాయో విలియమ్ కేలిన్, సర్ పీటర్ రాట్‌క్లిఫ్, గ్రెగ్ సెమెంజాలు పరిశోధన చేశారు.

ఫొటో సోర్స్, ALBERT AND MARY LASKER FOUNDATION
వీరి అద్భుత ఆవిష్కరణ రక్తహీనతతో పాటు కేన్సర్ చికిత్సలో కూడా ఎంతో ఉపయోగపడుతుందని స్వీడన్‌లోని నోబెల్ అకాడమీ వ్యాఖ్యానించింది.
"శతాబ్దాల క్రితమే ఆక్సిజన్ వాయువు అవసరాన్ని అర్థం చేసుకున్నాం. కానీ శరీరంలోని కణాలు ఆక్సిజన్ స్థాయుల్లో మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా ఎలా మారతాయనేది ఇప్పటి వరకూ తెలియదు" అని ఈ సందర్భంగా అకాడమీ వ్యాఖ్యానించింది.
శరీరంలో ఆక్సిజన్ స్థాయులు ఒక్కో భాగంలో ఒక్కో రకంగా మారుతుంటాయి. వ్యాయామం చేసినప్పుడు, ఎత్తైన ప్రాంతాలకువెళ్లినప్పుడు, ఏదైనా గాయం అయినప్పుడు ఈ మార్పు మరింత స్పష్టంగా ఉంటుంది.
ఇలా ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు కణాల్లోని జీవక్రియల్లో మార్పు కూడా వేగంగా జరుగుతుంది.
ఈ మార్పుల కారణంగా శరీరంలో కొత్త ఎర్ర రక్తకణాలు ఉత్పత్తవుతాయి.
కేన్సర్ వ్యాధిగ్రస్తుల శరీరంలోని కణుతులు ఈ కణాల ఉత్తత్తిని అడ్డుకుంటాయి. దీంతో శరీరంలో కేన్సర్ వ్యాప్తి వేగం, సులభం అవుతుంది.
మరిన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయాలని శరీరానికి చెప్పడం కూడా అనీమియాను ఎదుర్కోవడంలో దోహదం చేస్తుంది.
సర్ పీటర్ రాట్‌క్లిఫ్ యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధన చేస్తున్నారు. విలియం కేలిన్ అమెరికాలోని హార్వర్డ్‌లో, గ్రెగ్ సెమెంజా అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
- పాక్ అధీనంలోని కశ్మీర్లో 'స్వాతంత్ర్యం' ఎంత?
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ఆర్టీసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోసారి సమీక్ష జరపనున్న సీఎం కేసీఆర్
- ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








