కశ్మీర్: ఎల్‌వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం

ఫొటో సోర్స్, MA Jarral/BBC
- రచయిత, ఎంఏ జరల్
- హోదా, పాక్ పాలిత కశ్మీర్ నుంచి బీబీసీ కోసం
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ నుంచి 'ఆజాది మార్చ్' నిర్వహించడానికి వచ్చిన స్థానికులను ఎల్‌వోసీకి ఆరు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ దళాలు అడ్డుకున్నాయి.
అయితే, ఈ మార్చ్‌లో పాల్గొన్నవారు రాత్రిపూట అక్కడే బైఠాయించి పొద్దున్నే మళ్లీ సరిహద్దు వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంలో పాకిస్తాన్ అధికారులు, నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి ఫలితం వెలువడలేదు.
ముజఫరాబాద్ నుంచి ఈ మార్చ్ చేయాలని జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మూడు రోజుల కిందట పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, MA Jarral/BBC
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు నెలల కిందట భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత పాలిత కశ్మీర్‌లో కఠినమైన ఆంక్షలు విధించారు. దీనికి నిరసనగానే ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, నియంత్రణ రేఖను దాటవద్దని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సరిహద్దుకు వచ్చిన వేలాది మందిలో న్యాయవాది షామా తారిక్ ఖాన్ ఒకరు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ ''ఇది ఎల్‌వోసీ కాదు, ఆ పేరుతో ఉన్న ఒక రక్త ప్రవాహం. మేము ఈ నియంత్రణ రేఖను తొలగించాలనుకుంటున్నాం. ఇది మా ఇల్లు, మేము మా ఇంట్లోని ఒక గది నుంచి మరో గదికి వెళ్లాలనుకుంటున్నాం. దారిలో మమ్మల్ని ఆపకూడదు. మేము కశ్మీర్‌లోని మా ఇంటికి వెళ్తున్నాం'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MA Jarral/BBC
జేకేఎల్ఎఫ్ కార్యకర్త షెబాజ్ కశ్మీరీ మాట్లాడుతూ, ''ఇన్ షా అల్లా, మేము సరిహద్దును ధ్వంసం చేస్తాం. అక్కడి వారు కూడా బయటకొచ్చి నిరసన తెలపాలని, ప్రపంచానికి సందేశం పంపాలని కోరుకుంటున్నాం. అల్లా కోరుకుంటే, సరిహద్దు చెరిగిపోతుంది'' అని పేర్కొన్నారు.
ఈ మార్చ్‌ను ఒక నిరసన రూపంగా అభివర్ణించిన దనిష్ సానియా మాట్లాడుతూ, ''భారత్, పాక్ రెండింటి నుంచి మా దేశానికి స్వాతంత్ర్యం కావాలి. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటే మేం సహించం'' అని చెప్పారు.
ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని షమా తారిక్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, MA Jarral/BBC
మార్చ్‌ను అడ్డుకున్న పాక్ సైన్యం
చికోటీ చెక్ పాయింట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చినారి వద్ద పాక్ సైన్యం ఈ మార్చ్‌ను అడ్డుకుంది. కంటైనర్లు, ముళ్ల కంచె వేసి రహదారిని దిగ్భందం చేసింది.
దీంతో నిరసనకారులు శ్రీనగర్, ఉరి రహదారిపై బైఠాయించారు. ఈ సమయంలో, నిరసనకారుల, పాక్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
నిరసనకు నాయకత్వం వహిస్తున్న తౌకిర్ గీలానీ బీబీసీతో మాట్లాడుతూ, ''భద్రతా దళాలతో మేం ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, MA Jarral/BBC
పాక్ అధికారులు, నిరసనకారుల మధ్య చర్చలు
పాకిస్తాన్ అధికారులు, జేకేఎల్ఎఫ్ నేతల మధ్య రాత్రి చర్చలు జరిగాయి.
జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ప్రతినిధి రఫీక్ దార్ బీబీసీతో మాట్లాడుతూ, ''మా మార్చ్‌ను అడ్డుకోవడంతో మేము స్థానిక పాలకులతో మాట్లాడాం. అడ్డంకులను తొలగించమని అభ్యర్థించాం, అలా చేయకపోతే ఇక్కడే బైఠాయిస్తామని చెప్పాం'' అని తెలిపారు.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ అధికార ప్రతినిధి ముష్తాక్ మిన్హాస్, న్యాయ శాఖ మంత్రి ఫరూక్ అహ్మద్ తాహిర్ సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు.
ముష్తాక్ మిన్హాస్ బీబీసీతో మాట్లాడుతూ, ''మేము ఈ మార్చ్‌పై నిఘా పెట్టాం. వీరి యాత్ర భారత ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలపడంలో ఒక మైలురాయి. మార్చ్‌కు మద్దతుగా మేము ఇక్కడకు వచ్చాం'' అని చెప్పారు.
అయితే, ఇక్కడి నుంచి మార్చ్ చేయడాన్ని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని అన్నారు.
''ఇక్కడి యువత నిజమైన తపనతో ఇక్కడికి వచ్చారు. వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత జమ్ము కశ్మీర్ ప్రభుత్వంపై ఉంది. మేం ఈ నియంత్రణ రేఖను గుర్తించం. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. అయినప్పటికీ మేం వాటిని అధిగమిస్తాం'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- మాంసం తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత?
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- కశ్మీర్: ఆర్టికల్ 370 రూపొందించిన గోపాలస్వామి అయ్యంగార్ ఎవరు?
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
- గాలి నుంచి విమాన ఇంధనం తయారీ
- పాకిస్తాన్లో ‘అఖండ భారత్’ బ్యానర్లు.. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?
- భారతదేశ ఉత్పత్తులు బహిష్కరించాలంటూ పాక్ సోషల్ మీడియా ప్రచారం...
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










