మహాత్మా గాంధీ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటుంటారు? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మహమ్మద్ హనీఫ్
- హోదా, బీబీసీ కోసం
మహాత్మా గాంధీ జన్మించి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. గాంధీ గురించి పాకిస్తానీలు ఏం అనుకుంటుంటారని చాలా మంది నన్ను అడుగుతుంటారు.
మా ఇంట్లోనే సవాలక్ష సమస్యలుంటే, ఇంక గాంధీ గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుందని వాళ్లకు చెప్పాలని మనసులో అనిపిస్తుంటుంది.
అంతలో మా స్కూలు రోజులు గుర్తుకువచ్చేస్తాయి.
గాంధీ హిందువని మాత్రమే అప్పుడు పాఠాల్లో చెప్పారు. ఇంక మిగతా విషయాలు మీరే అర్థం చేసుకోండి.
గాంధీ కపటి మనిషని, బనియా అని.. పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారని కూడా చదువుకున్నాం.
ఆయన భరత మాతను పూజించేవారని, శతాబ్దాలుగా హిందువులను పాలించిన ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునేవారని కూడా పాఠాలు చెప్పారు.
మరోవైపు మా జాతిపిత క్వాయిడ్-ఇ-ఆజమ్ (గొప్ప నేత) జిన్నా ఉండేవారు.
జిన్నా లండన్‌లో బాగా చదువుకుని, వచ్చిన న్యాయవాది అని, గాంధీని ఓడించి పాకిస్తాన్‌ను సాధించారని చదువుకునేవాళ్లం.
కొంచెం పెద్దయ్యాక గాంధీ సినిమా చూసినప్పుడు అర్థమైంది... హిందువుల జాతిపిత భారత స్వాతంత్ర్య పోరాటానికి నేతృత్వం వహించారనీ, అంతకుముందు ఆఫ్రికాలో జాతివిద్వేషాలకు వ్యతిరేకంగా తెల్లజాతీయులనూ ఎదురించారని.
అయితే, ఆ సినిమా తీసిన ఆంగ్లేయ డైరెక్టర్ హిందువుల జాతిపితను కావాలనే హీరోలా చూపించి, మా జాతిపితను విలన్‌ను చేశారని పాకిస్తానీల అభ్యంతరం.

ఫొటో సోర్స్, HULTON ARCHIVES
గాంధీ, జిన్నాల పాత ఫొటోలు చూసి మేం సంబరపడేవాళ్లం.
వాటిలో మా జాతిపిత జిన్నా సూట్ వేసుకుని, క్లీన్ షేవ్‌తో కనిపించేవారు. ఆయన చేతిలో లగ్జరీ సిగరెట్ ఉండేది.
పాకిస్తాన్‌లో రూ.50 వేల నోటును ముద్రించినప్పుడు, దానిపై ఇదే ఫొటో ఉంటుందని ఓ మేధావి చెప్పారు.
గాంధీ మాత్రం ధోతీ కట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని ఉండేవారు.
హిందుస్తాన్-పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితులు భవిష్యత్తులో ఇలా ఉంటాయని తెలిసి ఉంటే వీళ్లిద్దరూ ఒకరిని పట్టుకుని మరొకరు ఏడ్చేవారేమో!
ఒక ఫొటోలో మహాత్మా గాంధీ చేయి పైకెత్తి వాదిస్తున్నట్లు కనిపించేవారు. మమ్మల్ని వదిలి వెళ్లొద్దని ఆయన చెబుతున్నట్లుగా ఉందా చిత్రం.
''మిత్రమా గాంధీ, త్వరగా కానీ. మనం ముసలి వాళ్లమైపోతున్నాం. ఎలాగైనా విభజన జరుగుతుంది'' అని గట్టిగా ఓ దమ్ము లాగి చెబుతున్నట్లుగా మా జిన్నా కనిపించేవారు.

ఫొటో సోర్స్, AFP
మా జాతిపిత జిన్నా ఇంగ్లిష్ ఎంత బాగా మాట్లాడేవారంటే.. హిందువులు, ముస్లింలకు మధ్య అస్సలు పోలికేలేదని తెల్లవాళ్లు కూడా నిర్ణయానికి వచ్చేశారు. రాత్రికి రాత్రే రెండు దేశాలుగా విభజించేశారు.
మిగతా కత్తిరింపులు, ముక్కల వ్యవహారం మనమే చూసుకున్నాం. మా జిన్నా గెలిచారు. గాంధీ ఓడిపోయారు.
హిందుస్తాన్, పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత ఏడాదే రెండు దేశాల జాతిపితలు కాలం చేశారు. ఒకరిని క్షయ బలితీసుకుంది. ఇంకొకరిని ఆయన హిందూ సోదరుడే కాల్చి చంపారు.
బాల్యం నుంచి మాకు గాంధీ పట్ల ద్వేషాన్నే నూరిపోశారు.
''గుర్తుంచుకోండి. ఒకవేళ పాకిస్తాన్ ఏర్పడకుండా ఉంటే, రోజూ మన గుమ్మాల ముందు గాంధీ లాంటి హిందువులు ధోతీ ఎత్తి మూత్రం పోసేవారు'' అని ఓ పాకిస్తానీ ఉర్దూ రచయిత ఒక పుస్తకంలో రాశారు.
చాలా మంది హిందువులను వెళ్లగొట్టడం మంచిదైంది. ఇప్పుడు మాకు మేమే ఒకరి ఇంటి ముందు మరొకరం మూత్రం పోసుకుంటున్నాం.

ఫొటో సోర్స్, HULTON ARCHIVE
అతిపెద్ద హిందువని మేం భావించిన గాంధీని, ఇప్పుడు కొత్త హిందువులు 'అమాయక హిందువు' అని అంటున్నారు.
హిందుస్తాన్‌లో ఆయనకు స్థానం లేదని, ఇక కేవలం కరెన్సీ నోట్లపై కనిపించాలని చెబుతున్నారు.
ఇప్పుడు హిందుస్తాన్‌లో గాంధీ హంతకుడిని తమ హిందువని అనుకునేవారి రాజ్యం నడుస్తోంది.
ఇంతకుముందు పాకిస్తాన్‌లో గాంధీ పేరు ఓ తిట్టులా ఉండేది. ఇప్పుడు హిందుస్తాన్‌లోనూ ఆ పేరు పల్చబడుతోంది.
గాంధీనే వదలనివాళ్లు మమ్మల్ని ఏం చేస్తారో అని అక్కడి వాళ్లు భయపడిపోతుండొచ్చు.
మేం బయటికి చెప్పం కానీ, ఈ కొత్త పాలకుల కన్నా గాంధీనే నయం అని మనసులో అనుకుంటుంటాం.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- చంపారన్: ‘‘నేను దేవుణ్నీ, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను’’
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు కారణమైన ఫోన్ సంభాషణ ఇదే
- 'బహిరంగ మల విసర్జన చేశారని ఇద్దరు దళిత చిన్నారులను కొట్టి చంపారు'
- పెళ్లిలో బీఫ్ బిర్యానీ వడ్డించిన కేసులో జైలుకెళ్లిన వ్యక్తిని విడుదల చేసిన గుజరాత్ హైకోర్టు
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- ఈ చైనా మహిళ గాంధీ ప్రభావంతో శాకాహారిగా మారారు, పాత దుస్తులు ధరిస్తారు, ఇంకా..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








