'హౌడీ మోదీ' నిరసనలో నేనెందుకు పాల్గొన్నాను, అక్కడేం జరిగింది: అభిప్రాయం

ఫొటో సోర్స్, Prasad Charasala
- రచయిత, ప్రసాద్ చరసాల
- హోదా, బీబీసీ కోసం
వారం రోజుల క్రితం ఒక మిత్రుడితో అవీ ఇవీ మాట్లాడుతూ "వారాంతం ఏమి చేస్తున్నావ్" అని అడిగితే, అతడు "మోదీని ఆహ్వానించడానికి హూస్టన్ వెళుతున్నా" అన్నాడు. అప్పటివరకూ హూస్టన్ వెళ్లాలని నాకు లేదు.
'ముస్లిం వ్యతిరేకి' అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఆహ్వానించడానికి అతడు ఖర్చు భరించి, అంత దూరం వెళుతున్నపుడు, గొంతులేని కశ్మీరీల బాధను ప్రపంచానికి చెప్పడానికి, నిరసన తెలియజేయడానికి నేనెందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించుకున్నాను.
నిజానికిది కారులో వెళ్లి ఒక గంట నిరసన ప్రదర్శనల్లో పాల్గొని వచ్చేంత సులభమైనదేమీ కాదు.
నేనున్నది వాషింగ్టన్ డీసీ దగ్గర మేరీలాండ్ రాష్ట్రంలో. ఇక్కడి నుంచి హూస్టన్‌కు మూడు గంటల పైగా విమాన ప్రయాణం. అక్కడ దిగాక వసతి, కారు, తిండి.. ఎంత లేదన్నా 300 డాలర్లకు (దాదాపు 20 వేల రూపాయలకు) పైగా ఖర్చు.
అయినా, వెళ్లాలనే నిర్ణయించుకున్నా. స్థానిక సంఘాలేవైనా నిరసన చేస్తున్నాయా అని గూగుల్ చేస్తే కొన్ని ప్రకటనలు, ఈవెంట్ బ్రైట్‌లో ఈవెంట్స్ కనిపించాయి.

ఫొటో సోర్స్, Prasad Charasala
హూస్టన్ నగరం నలుమూలల నుంచి నిరసనలు జరిగే ప్రాంతానికి బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. నేను శనివారం సాయంత్రం బాల్టిమోర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 12 గంటలకు హూస్టన్ చేరాను. అక్కడ అద్దెకారు తీసుకొని దగ్గర్లోనే ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరుకొని ఆ రాత్రికి పడుకొన్నాను.
మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయాన్నే లేచి, హోటల్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా పక్క టేబుల్ మీద ఒక జంట "ప్రెసిడెంట్ ట్రంప్ ఈరోజు హూస్టన్ వస్తున్నారట, నిజమేనా" అంటూ మాట్లాడుకోవడం వినపడింది. నేను కలగజేసుకొని వస్తున్నది నిజమేనని, భారత ప్రధాని రాక గురించి కూడా చెప్పాను. వాళ్లకు అదేమీ తెలిసినట్టు లేదు, నాతో సంభాషణ పెద్దగా పొడిగించకుండా అక్కడినుండి వెళ్లిపోయారు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ట్రంప్‌కు బాగా బలముంది. అవి సంప్రదాయ రాష్ట్రాలు.
అక్కడికి దగ్గర్లోని బిలాల్ మసీదు దగ్గర్నుంచి ఉదయం 8.15కు బస్సు బయలుదేరుతుంది అని చెప్పడంతో ముందే అక్కడికి చేరుకున్నాను. అక్కడ అప్పటికే ఇరవై మందిదాకా ఉన్నారు. ఓ బెంచీపై కూర్చున్న ఇద్దరి దగ్గరికి వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నా. వాళ్లు పక్కనే చోటిచ్చి కూర్చోమన్నారు.

ఫొటో సోర్స్, Prasad Charasala
మా చర్చ కశ్మీర్ మీదకు మళ్లింది. భారత సైన్యం అక్కడ చేస్తున్న నిర్బంధం గురించి, కమ్యూనికేషన్ బ్లాకవుట్ గురించీ మాట్లాడుకున్నాం. ఆ ఇద్దరిలో ఒకరు "భారత ప్రభుత్వం ఎక్కడైనా పెట్టుకొని నెగ్గగలదేమో గానీ కశ్మీరులో నెగ్గలేదు. వాళ్లెవరనుకున్నారు, ముస్లింలు. వారు ఎక్కడ ఉన్నా, తిరగబడకుండా ఉండే ప్రశ్నే లేదు" అన్నారు.
నేను పాకిస్తానీని కాదు, ముస్లింను కూడా కాదని వారితో చెప్పగానే ఆయన మెల్లగా అక్కణ్ణుంచి తప్పుకున్నారు. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. తనది బర్మా అని చెప్పాడు. నాతో ఉన్న అతడు భారతదేశ చివరి మొఘల్ బహదుర్ షా జాఫర్ గురించి చెబుతూ "అతను చనిపోయింది బర్మాలోనే" అన్నాడు.
తర్వాత అతడు "రోహింజ్యాల గ్రామాలను నాశనం చేశాక, వారిలో చాలా మంది పల్లెలను వదిలి యాంగూన్ చేరారు. అక్కడ రోహింజ్యాలదే మెజారిటీ. యాంగూన్‌లో వాళ్లను టచ్ చెయ్యడం ఎవరి వల్లా కాదు'' అని చాలా అతి విశ్వాసంతో చెప్పాడు.

ఫొటో సోర్స్, Prasad Charasala
నేను ఆయనతో విభేదించాను. "కశ్మీరులో, వెస్ట్ బ్యాంక్‌లో ముస్లింలే మెజారిటీ అయినా అక్కడి ప్రభుత్వాలు దమనకాండ కొనసాగిస్తున్నాయి. యాంగూన్‌ను సురక్షితం అనుకోవడం సరి కాదు" అన్నాను.
తొమ్మిది అవుతున్నా బస్సు రాకపోవడంతో, కొంతమంది కార్లలో వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. నేనూ సందిగ్ధంలో పడ్డాను. అంతదూరం నుంచి వచ్చింది, ఇక్కడ పిచ్చాపాటీ మాట్లాడ్డానికా అనుకున్నాను.
అక్కడ ఆర్గనైజర్లలో కొందరిని మరోసారి అడిగితే, అతడు ఎవరికో ఫోను చేసి, మరో అరగంటలో బస్సు వస్తుందని భరోసా ఇచ్చాడు. నేను అక్కడ ఉండడం వాళ్లకు అసౌకర్యంగా ఉందేమోనని నాకు అనిపించింది.
ఒక వృద్ధుడు తన వీల్‌చైర్‌కు రెండు కశ్మీరీ జెండాలు, ఒక పెద్ద అమెరికా జెండా కట్టుకుని అక్కడ బస్సుకోసం చూస్తున్నాడు. అక్కడివారు ఆయనకు చాలా ప్రాధాన్యం ఇవ్వడం గమనించాను. ఆయన హూస్టన్‌లో మంచి పేరున్న డాక్టర్ అని వాళ్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Prasad Charasala
బస్సు గంట ఆలస్యంగా వచ్చింది. ఈలోపు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బస్సులో నా పక్కన మరో పెద్దాయన కూర్చున్నారు. ఆయన వయసు 65-70 మధ్య ఉండొచ్చు.
తెలుగు అని తెలియగానే, ఆయన "ఓహో.. దక్కనా!" అంటూ తెలుగులో కొన్ని మాటలు, అంకెలూ చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. మీరెప్పుడైనా హైదరాబాద్ వచ్చారా అంటే "లేదు, మా నాన్నది హైదరాబాదే. ఆయన మంచి పండితుడు. ఉర్దూ, తెలుగుతో పాటు సంస్కృతం కూడా వచ్చు. ఇవి ఆయన దగ్గరే నేర్చుకున్నా" అన్నారు.
బస్సు దిగి చూస్తే, ఒక వీధి అంతా నిరసనకారులతో నిండిపోయి కనిపించింది. అక్కడ ఎక్కువ "ఖలిస్తాన్" వాదులు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. వారిలో ఎక్కువ మంది "రెఫరెండం 2020' పేరుతో ఉన్న టీషర్టులు ధరించారు.

ఫొటో సోర్స్, Prasad Charasala
అది పేరుకు కశ్మీర్‌కు సంఘీభావంగా జరిగే నిరసనే అయినా, అక్కడ నాకు నామమాత్రంగా కూడా కశ్మీరీలు కనిపించలేదు. కశ్మీర్ కోసం వచ్చారని కూడా అనిపించలేదు.
కొందరితో మాట్లాడితే వాళ్లకు ఆర్టికల్ 370/35A ల గురించి కూడా పెద్దగా తెలీదు. వారి మాటలు, భారత సైనికులు ఎప్పట్లాగే ఇప్పుడూ బల ప్రయోగం చేస్తున్నారు అన్నట్లున్నాయి.
భారత ప్రభుత్వం మీద, మోదీ మీద రకరకాల కారణాల రీత్యా కోపంతో ఉన్నవారు దీన్నొక వేదికగా ఉపయోగించుకుందామనుకున్నారు తప్పితే ప్రత్యేకంగా గత నెలన్నరగా కశ్మీర్ లోయలో ఏం జరుగుతోంది అనే స్పృహతో వచ్చినవారు నాకు తారసపడలేదు.
అక్కడ ఒక సిక్కు నన్ను "మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా" అని పలకరించాడు. నేను.. "కాదు, ఇండియా నుంచి" అన్నాను. ఆయన ఫిలడెల్ఫియాలో పిల్లల డాక్టరట. మామధ్య ఒకలాంటి వాగ్యుద్దమే నడిచింది.
నేను "భారత రాజ్యాంగం గొప్పదే, కానీ సమస్య ఈ నాయకులతోనే" అంటే, ఆయన "వ్యవస్థే సరిగా లేదు" అంటాడు. అలా 30 నిమిషాలు మాట్లాడుకున్నాం.
తర్వాత ఆవైపు తిరిగి నినాదాలిస్తున్న ఆయన వీపుపై "రెఫరెండం 2020 ఖలిస్తాన్" చూపిస్తూ "రెఫరెండం ఉమ్మడి పంజాబ్ అంతటానా?" అన్నాను. ఆయన "కాదు, ఇండియా పంజాబ్‌లోనే" అన్నాడు.
నేను "అదేంటి, ఒకప్పుటి పంజాబ్ ఇప్పటి పాకిస్తాన్‌లోనూ ఉంది కదా" అన్నాను. దానికి ఆయన "అది జరిగేపని కాదు. మొదట ఇండియా పంజాబ్‌లో స్వయంపాలన రావాలి, తర్వాత పాకిస్తాన్ పంజాబ్ గురించి ఆలోచించవచ్చు" అన్నాడు.
భారత్‌లో దేశభక్తి పేరుతో కశ్మీర్, ఇతర వివాదాస్పద ప్రాంతాల మీద ఎక్కువ మంది హిందువులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడి, మన దేశం విధానాలమీద ఎలా మౌనం వహిస్తారో, ఆయన మాటలు కూడా అలాగే అనిపించాయి.
"భారతీయ జంట అనుకుంటాను, వీపుకు భారత జెండాలు కట్టుకొని, చేతిలో "నాట్ మై ఇండియా" అనే ప్లకార్డు పట్టుకున్నారు. వాళ్లను కలుద్దామని ప్రయేత్నించేలోగా కనపడకుండా మాయం అయ్యారు.
లౌడ్ స్పీకర్లలో నినాదాలు ఇస్తున్న ఒక చోట ఒక మహిళ తను వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చానని చెబుతూ, కశ్మీరులో ప్రస్తుత స్థితి గురించి మాట్లాడి, ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు 'ఆజాదీ' అని నినాదాలు చేస్తున్నవారు మాటవరసకు కూడా బెలూచిస్తాన్ పేరెత్తలేదు.

ఫొటో సోర్స్, Prasad Charasala
అక్కడ ఒక్కో గ్రూప్‌కు, ఒక్కో అజెండా వుంది, నిజానికి కశ్మీర్ గురించి ఎవరికీ పట్టదా, అనిపించింది. అసలక్కడ కశ్మీరీ గొంతు ఒకటైనా ఉందా అంటే అనుమానమే.
అలాగే నాకు భారతీయులు కూడా తారసపడలేదు. అంటే ప్రత్యేక కశ్మీర్, ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ల మినహా, మానవహక్కుల కోసం నినదించే గొంతు అక్కడ నాకు ఒక్కటీ కనపడలేదు.
మోదీ కోసం ఆ స్టేడియానికి 50 వేలమందికి పైగా హాజరయ్యారని అంటున్నారు, కానీ నిరసన ప్రదర్శనలకు పట్టుమని పదిమంది భారతీయులు కూడా రాకపోవడం చూసి చాలా ఆశ్చర్యం, నిరాశ కలిగాయి.
మీడియా, రాజకీయ నాయకులు పూర్తిగా మొహం చాటేశారు. వచ్చిన కొన్ని కెమెరాలు కూడా నిరసనకారుల దగ్గరికి రాకుండా, బారికేడ్లకు అవతలి నుంచే ఫొటోలు తీసుకున్నాయి.

ఫొటో సోర్స్, Prasad Charasala
ఇటువైపు 'వైస్' (VICE) చానల్ అని చెప్పిన ఒక కెమెరా మాత్రం కొందరిని ఇంటర్వ్యూలు చేసింది. పైన మీడియా హెలికాప్టర్లే అనుకుంటా.. చక్కర్లు కొట్టాయి.
పోలీసులు సైకిళ్లపై మా మధ్య తిరుగుతూ బాగా నీళ్లు తాగమని హెచ్చరిస్తున్నారు. ఎండలు మండిపోతున్నాయి మరి. రోడ్డుకు అవతల గుర్రాలపై ఉన్న పోలీసులు కూడా కనపడ్డారు.
ఎవరో నీళ్ల బాటిల్స్, కొబ్బరి నీళ్ల డబ్బాలు, చపాతీలు ఉచితంగా పంచారు.

ఫొటో సోర్స్, Prasad Charasala
సాధారణంగా పదిమంది గుమిగూడే 'స్ట్రీట్ ఫెస్టివల్'కు కూడా స్థానిక రాజకీయ నాయకులు వస్తూ ఉంటారిక్కడ. కానీ ఈ నిరసన వైపు ఏ ఒక్కరూ తొంగిచూడలేదు.
అలాగే ఒక్క తెల్లముఖం కూడా కనిపించలేదు. ఒకరిద్దరు నల్లవాళ్లు కనిపించినా వాళ్లు అమెరికన్ల కంటే ఆఫ్రికా ముస్లింలలాగే అనిపించారు.
మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నిరసనకారులు పల్చబడ్డారు. రెండింటికి పూర్తిగా తగ్గిపోయారు. చివర్లో మోదీ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. మధ్య మధ్యలో ఆగి ఆ బొమ్మని కొట్టారు.
ఆ ప్రాంతమంతా అందరూ తాగి పడేసిన వాటర్ బాటిల్స్, కొబ్బరి నీళ్ల డబ్బాలు, పారేసిన పోస్టర్లు, బానర్లతో నిండిపోయింది. కొందరు వలంటీర్లు ఆ చెత్తనంతా ప్లాస్టిక్ సంచిల్లోకి తీస్తూ కనిపించారు.

ఫొటో సోర్స్, Prasad Charasala
మొత్తమ్మీద చూస్తే, హౌడీ మోదీ నిరసనల్లో పాకిస్తానీ ముస్లింలు, ఖలిస్తానీ సిక్కులు తప్ప మిగతా వారు చాలా నామమాత్రంగా కనిపించారు.
"ఎవరి గోడు వారు వినిపించడం తప్పితే, కశ్మీర్ గొడవ ఎవరికైనా పట్టిందా అని నా అనుమానం".
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం.)
ఇవి కూడా చదవండి
- నరేంద్ర మోదీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?
- పాకిస్తాన్ నుంచి పారిపోయిన గులాలాయీ ఎవరు, ఆమె ఎందుకు అమెరికా చేరారు
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- అత్యాచారం ఆరోపణలపై బీజేపీ నేత చిన్మయానంద అరెస్టు
- శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?
- గోదావరి పడవ ప్రమాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- గోదావరిలో పడవ ప్రమాదం: కొనసాగుతున్న గాలింపు చర్యలు.. బోటును బయటకు తీయడంలో ఆలస్యం
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- దిల్లీ కాలుష్యం: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తగ్గుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








