ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ: ఉక్రెయిన్ అధ్యక్షుడితో సంభాషణ వివరాలు విడుదల చేసిన వైట్‌‌హౌజ్‌

అమెరికా అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, AFP

డోనల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమీర్ జెలెంస్కీ మధ్య ఫోన్లో జరిగిన సంభాషణల వివరాలను అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వైట్ హౌస్ విడుదల చేసింది.

ఈ ఫోన్ కాల్ ఆరోపణలతో అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్లు అభిశంసన ప్రక్రియ చేపట్టారు.

ట్రంప్ ఈ ఏడాది జులై 25న జెలెంస్కీతో మాట్లాడారు.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉక్రెయిన్‌లో ఒక గ్యాస్ సంస్థలో పనిచేస్తున్నఆయన కుమారుడికి వ్యతిరేకంగా దర్యాప్తు జరిపించాలని ఆయన్ను కోరారు.

ఉక్రెయిన్ ఈ ఏడాది జులైలో సైనిక సాయం ట్రంప్ ఆపేశారు. అయితే, ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తాను అలా చేయలేదని ట్రంప్ చెప్పారు.

రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, అతడి ప్రతిష్టపై బురద చల్లాలని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని బెదిరించలేదని ట్రంప్ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య జరిగిన సంభాషణ గురించి విజిల్ బ్లోయర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో గత మంగళవారం ఆ సంభాషణల పూర్తి వివరాలను అంటే స్క్రిప్ట్‌ను తానే స్వయంగా విడుదల చేస్తామని ట్రంప్ చెప్పారు.

అమెరికా అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, EPA

ట్రంప్, జెలెంస్కీతో ఏం మాట్లాడారు?

ఆ సంభాషణ జరిగే సమయంలో అమెరికా అధికారులు నోట్ చేసుకున్న వివరాలను ట్రంప్ కార్యాలయం బుధవారం విడుదల చేసింది.

ట్రంప్ ఈ సంభాషణల్లో "ఉక్రెయిన్ టాప్ ప్రభుత్వ వకీల్ విక్టర్ షౌకిన్‌ను ఎలాగోలా ఆ పదవి నుంచి తప్పించాలని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ ఒత్తిడి చేశారు" అని జెలెంస్కీకి చెప్పారు.

ట్రంప్ తర్వాత "ఇంకో విషయం ఏంటంటే, బైడెన్ కొడుకు గురించి చాలా చర్చ జరుగుతోంది. బైడెన్ ఆ దర్యాప్తును ఆపివేయించారు. కానీ చాలామంది దర్యాప్తు కోరుకుంటున్నారు. అందుకే మీరు ఏదైనా చేయగలిగితే బాగుంటుంది" అన్నారు.

"నేనే దర్యాప్తు ఆపించానని బైడెన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకే, మీరు ఈ కేసును చూడండి. అది నాకు చాలా భయంకరంగా అనిపిస్తోంది" అని ట్రంప్ జెలెంస్కీతో అన్నారు.

అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్, అధ్యక్షుడి వ్యక్తిగత లాయర్ రుడాల్ఫ్ గియలియానీని కూడా సంప్రదించాలని కూడా ట్రంప్ ఈ సంభాషణల్లో జెలెంస్కీతో చెబుతున్నారు.

జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ బోర్డు మెంబరుగా ఉన్న నేచురల్ గ్యాస్ ఏజెన్సీకి వ్యతిరేకంగా షౌకిన్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది.

అయితే షౌకిన్‌ అవినీతి కేసుల్లో మెత్తగా వ్యవహరించడం వల్లే ఆయన్ను తొలగించారని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

అమెరికా అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడేం జరుగుతుంది

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియను ప్రారంభించారు.

దిగువ సభ అంటే 'హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌'లో అభిశంసన పాస్ కావచ్చని చెబుతున్నారు.

కానీ సెనేట్‌లో ఇది పాస్ కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అక్కడ రిపబ్లికన్లకు భారీ మెజారిటీ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)