పెళ్లిలో బీఫ్ బిర్యానీ వడ్డించిన కేసులో జైలుకెళ్లిన వ్యక్తిని విడుదల చేసిన గుజరాత్ హైకోర్టు

ఫొటో సోర్స్, TENGKU BAHAR/Getty
- రచయిత, రాక్సీ గగ్దేకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, అహ్మదాబాద్ నుంచి
"అప్పుడు నన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు చెప్పడంతో మానసిక స్థిరత్వాన్ని కోల్పోయాను. తీవ్ర నిరాశలో పడిపోయాను. నేను అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను. ఆ కోర్టు తీర్పుతో నా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది."
ఇవి సలీం మక్రానీ (42) చెప్పిన మాటలు. తన కుమార్తె వివాహంలో బీఫ్ బిర్యానీ వడ్డించినందుకు ఈ ఏడాది జూలైలో ధోరాజీ సెషన్స్ కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ, తాజాగా గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది.
గుజరాత్ హైకోర్టు ఆయన శిక్షను రద్దు చేసి, ఆయన మీద నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ''వ్యాపారం కోసం జంతువులను చంపినట్లు ఆయన మీద ఆరోపణలు లేవు. తన సొంత కుమార్తె వివాహ వేడుక కోసం బిర్యానీ తయారుచేసేందుకు మాత్రమే ఆయన బీఫ్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి" అని హైకోర్టు తన ఉత్వర్వుల్లో పేర్కొంది.
మక్రానీని వెంటనే విడుదల చేయాలని జస్టిస్ ఆర్‌పీ ధోలేరియా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ .10,000 బాండు సమర్పించాలని ఆయనకు సూచించింది.
ఈ తీర్పుతో సెప్టెంబర్ 20న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తన తల్లిదండ్రులను, భార్యా పిల్లలను కలిసిన తరువాత తనకు కొత్త జీవితం లభించినట్లు అనిపిస్తోందని మక్రానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మా పరిస్థితి తలకిందులైంది- మక్రానీ
రాజ్‌కోట్ జిల్లాలోని ధోరాజీ పట్టణంలోని రాసుల్‌పురాలో నివసిస్తున్న మక్రానీ బీబీసీతో మాట్లాడారు. "ఈ కేసుకు ముందు నా జీవితంలో ఒకే ఒక సమస్య ఉండేది, అది కుటుంబ ఆర్థిక సమస్య. ఇప్పుడు దానికి అదనంగా మానసిక సంక్షోభం కూడా వచ్చి చేరింది. నన్ను జైలులో పెట్టాక, న్యాయ పోరాటం చేసేందుకు మేము చాలా ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.
మక్రానీ తన కుమార్తె ఫర్హానా వివాహంలో అతిథులకు బీఫ్ బిర్యానీ వడ్డించారని ఆరోపణలు వచ్చినప్పటి నుంచి వారి కుటుంబం పరిస్థితి తారుమారైంది.
"మాకు చాలా అప్పులు ఉన్నాయి. వీలైనంత త్వరగా అవి తీర్చాలని అనుకున్నాను. ఈ కేసుకు ముందు కూలీ పనులకు వెళ్లేవాడిని. రోజూ 200 నుంచి 300 రూపాయలు సంపాదించేవాడిని. ఇప్పుడు, నా మీద కేసు ఉండటం వల్ల పనులు దొరకడం కూడా కష్టం అవుతుందేమో" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆరుగురు సభ్యులున్న వీరి కుటుంబంలో సంపాదించేది మక్రానీ ఒక్కరే.
"నేను బయటకు వచ్చేందుకు న్యాయ పోరాటం కోసం మా వాళ్లు అప్పులు చేశారు. ఇప్పుడు నేను బయటకొచ్చాను. ఎంత ఖర్చయ్యిందో లెక్క చూడాలి. భారీగానే ఖర్చు అయ్యుంటుంది. రోజూ రెండు షిఫ్టులు పనిచేసైనా ఆ అప్పులు తీర్చాలనుకుంటున్నాను. కానీ, పనులు దొరకాలి" అని మక్రానీ అన్నారు.

ఫొటో సోర్స్, MARILYNA
కుమార్తె పెళ్లి ఒకవైపు, ఆయన అరెస్టు మరోవైపు
2019 జనవరిలో మక్రానీ కుమార్తె వివాహం జరిగింది.
ఆ వివాహం జరిగిన రోజే తనను పోలీసులు అరెస్టు చేశారని, ఆ తర్వాత 8 నెలల పాటు తన కుమార్తె ముఖం చూడలేదని మక్రానీ చెప్పారు.
"ఆ రోజు నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దాంతో, మా బంధువులే నా కుమార్తె వివాహం జరిపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ బాధ కలుగుతోంది. ఏది ఏమైనా, ఇప్పుడు నా బిడ్డ తన భర్తతో సంతోషంగా ఉంది. నేను జైలు నుంచి విడుదలవ్వగానే నా బిడ్డతో మాట్లాడాను" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, gujarathighcourt.nic.in
కేసు ఏంటి?
ఆవు దూడను దొంగిలించి, తన కుమార్తె వివాహ విందు కోసం దానిని చంపి బిర్యానీ వండినట్లు మక్రానీ మీద ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆయన పొరుగింటి సత్తార్ కొలియాకు చెందిన ఆవు దూడ కనిపించకుండా పోయింది. దాంతో, తన ఆవు దూడను మాయం చేసింది మక్రానే అంటూ సత్తార్ కేసు పెట్టారు.
మక్రాన్ మాత్రం తాను ఆవు దూడను అపహరించలేదని, బిర్యానీని హోటల్ నుంచి తెప్పించానని అన్నారు.
గుజరాత్‌లో కొత్తగా తీసుకొచ్చిన గుజరాత్ జంతు సంరక్షణ చట్టం 2017 కింద అరెస్టు అయ్యి, శిక్ష పడిన తొలి వ్యక్తి ఆయనే. ఈ చట్టం ప్రకారం ఆవులను వధించడం నేరం.
మక్రానీని కింది కోర్టు దోషిగా తేల్చి, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ, ఆ మాంసాన్ని ఆయన డబ్బులు సంపాదించేందుకు వాడలేదు, మార్కెట్‌లో అమ్మలేదు. కాబట్టి ఆయనకు శిక్ష వేయకూడదు అని హైకోర్టు చెప్పింది" అని మక్రానీ తరఫున వాదించిన న్యాయవాది యూసుఫ్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








