గాలి నుంచి విమాన ఇంధనం తయారీ... విమానయాన రంగం ఆశలన్నీ దీనిపైనేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్నా హోలిగాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూగోళం అంతకంతకూ వేడెక్కిపోవడానికి కారణమవుతున్న బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌డయాక్సైడ్-సీవో2)తో విమాన ఇంధనాన్ని తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానయాన రంగం దీనిపై ఆశలు పెట్టుకుందా? లేక దీనిపై శ్రుతి మించిన ప్రచారం జరుగుతోందా?
"భవిష్యత్తులో విమాన ఇంధనం ఇదే"- నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్ విమానాశ్రయంలోని కెఫేలో స్కైఎన్‌ఆర్‌జీ అనే వ్యాపారసంస్థకు చెందిన ఆస్కార్ మీజెరింక్ నాతో అన్న మాట ఇది.
ఈ సంస్థ ఈ విమానాశ్రయ యజమానులతో కలిసి ప్రపంచంలోనే తొలిసారిగా బొగ్గుపులుసు వాయువుతో విమాన ఇంధనాన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇదే విమానాశ్రయం కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ ఇంధనం తయారీలో భాగంగా గాలిలోంచి బొగ్గుపులుసు వాయువును సేకరిస్తారు.
ఇంధనం తయారీలో మరో ప్రక్రియ ఉంది. అదే ఎలక్ట్రోలిసిస్ (విద్వుద్విశ్లేషణ). ఈ ప్రక్రియతో నీటిలోంచి హైడ్రోజన్, ఆక్సిజన్‌లను వేరు చేస్తారు. సేకరించిన కార్బన్‌డయాక్సైడ్‌కు ఈ హైడ్రోజన్‌ను కలుపుతారు. అప్పుడు ఏర్పడే సింథసిస్ గ్యాస్ (సిన్ గ్యాస్)ను విమాన ఇంధనంగా మార్చవచ్చని ప్రాజెక్టు ప్రణాళిక చెబుతోంది.

ఫొటో సోర్స్, Climeworks
ప్రయోగాత్మకంగా ఇంధన తయారీకి ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇలా రోజుకు వెయ్యి లీటర్ల చొప్పున ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ తయారీ కేంద్రానికి సౌర ఫలకాల నుంచి విద్యుత్ అందుతుంది.
'సీవో2 ప్రభావం తక్కువ'
2021లో తొలిసారిగా ఇలా ఇంధనం ఉత్పత్తి చేయగలమని ఈ ప్రాజెక్టు భాగస్వాములు ఆశిస్తున్నారు. సాధారణ ఇంధనంతో పోలిస్తే తమ ఇంధనంతో విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.
గాల్లోంచి నేరుగా కార్బన్‌డయాక్సైడ్‌ను సేకరించడం వల్ల సీవో2ను మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చని 'క్లైమ్‌వర్క్స్' సంస్థకు చెందిన లూయీ చార్లెస్ తెలిపారు. సీవో2ను ఇలా సేకరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ అందిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
'వ్యయమే ప్రధానం'
సాధారణ ఇంధనంతో పోటీపడే స్థాయికి ఈ ఇంధనం చేరాలంటే సానుకూలంగా జరగాల్సింది చాలా ఉందని ఆస్కార్ మీజెరింక్ అంగీకరించారు. వ్యయం ప్రధానమైన అంశమన్నారు.
పోల్చిచూస్తే తమ ఇంధనం కన్నా శిలాజ విమాన ఇంధనం ఖరీదు తక్కువేనని ఆయన అంగీకరించారు. గాల్లోంచి సీవో2ను సేకరించే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోందని, ఈ ప్రక్రియ ఖరీదైన వ్యవహారం కూడానని చెప్పారు.
కెనడాలోని కార్బన్ ఇంజినీరింగ్ సంస్థ, అమెరికాకు చెందిన గ్లోబల్ థర్మోస్టాట్ సంస్థ, ఇతర సంస్థలు కూడా గాల్లోంచి సీవో2ను సేకరించే విధానాలపై పనిచేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Friends of the Earth
పర్యావరణ కార్యకర్తల మాట?
పర్యావరణ కార్యకర్తలు ఈ ప్రణాళికలపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ టెక్నాలజీ వినడానికి అద్భుతంగా ఉందని, అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారంలా కనిపిస్తోందని, కానీ దీనితో పరిష్కారం సాధ్యం కాదని 'ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్'కు చెందిన జోరియన్ డీ లీగ్ అభిప్రాయపడ్డారు.
రోటర్‌డామ్ విమానాశ్రయంలోని తయారీ కేంద్రంలో రోజుకు వెయ్యి లీటర్లు తయారు చేయొచ్చని చెబుతున్నారని, కానీ బోయింగ్ 747 విమానం ఐదు నిమిషాల ప్రయాణానికే ఇంత ఇంధనం ఖర్చవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
గాల్లోంచి సీవో2 సేకరణకు కంపెనీలు అధునాతన పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఈ పని చేయడానికి ఇప్పటికే ఓ సులభమైన, సమర్థవంతమైన విధానం ఉంది. మొక్కలు పెంచడం. మొక్కల బయోమాస్ నుంచి తయారుచేసిన పునర్వినియోగ ఇంధనంతో నడిచే విమానాలు ఇప్పటికే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి చెరకుపిప్పి, గడ్డి, పామాయిల్, జంతు వ్యర్థాలు ఇలా కార్బన్ ఉన్న ప్రతిదీ నిర్దేశిత ప్రక్రియను అనుసరించి ఇంధనంగా వాడుకోవచ్చు.
విమానాల్లో ఉపయోగించేందుకు ఎప్పటికైనా సంప్రదాయ శిలాజ ఇంధనం స్థానంలోకి ఇలాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఔనని సమాధానమిచ్చారు నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనవర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో సీనియర్ అధ్యాపకుడైన జోరిస్ మెల్కర్ట్. ఇది ఎప్పటికి సాధ్యమౌతుందనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పడం కష్టమన్నారు.
సంప్రదాయ ఇంధనాలతో ప్రత్యామ్నాయ ఇంధనాలు పోటీపడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పర్యావరణ నష్టాలను కూడా విమానయాన వ్యయంలో కలిపితే టికెట్ల ధరలు పెరుగుతాయని చెప్పారు.
విమానయాన రంగంలో మార్పు తీసుకురావడం చాలా కష్టమని జోరిస్ మెల్కర్ట్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీవో2 ఉద్గారాల్లో విమానయానం వాటా ఎంత?
అంతర్జాతీయ సీవో2 ఉద్గారాల్లో విమానయానం వాటా మూడు నుంచి ఐదు శాతం వరకు ఉంది. పైగా ఈ ఉద్గారాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
2050 నాటికి ఈ ఉద్గారాలను 50 శాతానికి తగ్గించాలని అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ(ఐఏటీఏ) లక్ష్యంగా నిర్దేశించింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు విమానయాన సంస్థలు మార్గాలను అన్వేషిస్తున్నాయి.
'రైల్లో వెళ్లండి'
స్కాండినేవియన్ విమానయాన సంస్థ 'ఎస్‌ఏఎస్' దేశీయ విమానాలను బయో ఇంధనాలతో నడపాలని, వచ్చే దశాబ్దంలో కర్బన ఉద్గారాలను 25 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేఎల్ఎం విమానయాన సంస్థ ప్రయత్నాలు విభిన్నంగా ఉన్నాయి.
విమానయానం తగ్గించుకోవాలని ప్రయాణికులకు సూచిస్తోంది. విమానంలో కాకుండా రైల్లో ప్రయాణించాలని, నేరుగా సమావేశమయ్యే బదులు ఇంటర్నెట్ ద్వారా వీడియో సమావేశాలు పెట్టుకోవాలని చెబుతోంది.

ఫొటో సోర్స్, TU Delft
ప్రయాణికుల బరువు లెక్కింపు
సీవో2 ఉద్గారాల తగ్గింపు ప్రయత్నాల్లో భాగంగా, తక్కువ ఛార్జీలకు సేవలందించే డచ్ సంస్థ ట్రాన్సేవియా దేశంలోని ఇన్‌ధోవన్ విమానాశ్రయంలో ఒక ఆసక్తికర ప్రయోగాన్ని చేపట్టింది. ఎంత ఇంధనం అవసరమవుతుందో మెరుగ్గా లెక్కగట్టేందుకు ప్రయాణికుల బరువును చూడటం మొదలుపెట్టింది.
రోటర్‌డామ్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసే ఇంధనాన్ని వాడబోయే తొలి సంస్థ ట్రాన్సేవియానే.
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే 'రైట్ ఎలక్ట్రిక్'తో కలసి బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్ ఎలక్ట్రిక్ విమానాలను అభివృద్ధి చేస్తోంది. ఈ విమానాలు 2030లోగా దగ్గరి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేయగలవు.
సగటున ఒక విమానం వినియోగ కాలం 26 సంవత్సరాల ఆరు నెలలని, ఇది ఇంత ఎక్కువగా ఉండటంవల్లే దశాబ్దాలుగా అవే విమానాలను వాడుతున్నామని జోరిస్ మెల్కర్ట్ చెప్పారు.
సంప్రదాయ ఇంధనాలపై విమాన రంగం విపరీతంగా ఆధారపడుతోందని, బయో ఇంధనాలు దీనిని తగ్గించగల అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. పర్యావరణ నష్టాలను తగ్గించడంలో బయో ఇంధనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం బయో ఇంధనం వ్యయం మరీ ఎక్కువగా ఉందని, అయితే విమానయాన సంస్థలు మార్పును ఎంత వేగంగా స్వీకరిస్తాయనేదానిపై ఇది ఆధారపడి ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, EVIATION
'విమాన ప్రయాణాలు తగ్గించుకోవడమే మార్గం'
విమానయాన కాలుష్యాన్ని తగ్గించడానికి బయో ఇంధనమేమీ మంత్రదండం కాదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఏకైక మార్గం విమాన ప్రయాణాలను తగ్గించుకోవడమేనని 'ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్'కు చెందిన జోరియన్ డీ లీగ్ చెప్పారు.
కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు భయానక వేగంతో చోటుచేసుకొంటున్నాయని, విమాన ప్రయాణాలను తగ్గించుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు.
విమాన ప్రయాణాలను తగ్గించుకుంటే జీవితం చాలా సౌకర్యవంతంగానే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
- గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ బాడీని 85 ఏళ్ళ తరువాత సమాధి నుంచి ఎందుకు తవ్వి తీస్తున్నారు?
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- నెదర్లాండ్స్: ట్రామ్ బండిపై కాల్పుల కేసులో టర్కీ పౌరుడి అరెస్టు
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- ఉత్తర్ ప్రదేశ్‌లో వరదలు: ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి ఎలా ఉంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








