‘యుద్ధ విమానాన్ని ఎత్తుకెళ్లాడు.. ఎందుకో తెలుసా’

- రచయిత, ఎమ్మా జేన్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంగ్లండ్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి 1969లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ మెకానిక్ సార్జంట్ పాల్ మేయర్ వర్జీనియాలోని తన భార్యను కలవడం కోసం విమానాన్ని దొంగిలించి అందులో వెళ్లే ప్రయత్నం చేశారు.
బీబీసీకి చెందిన ఎమ్మా జేన్ కిర్బీ ఈ ఉదంతంపై రెండేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన థియో వాన్ ఈక్ అనే పాఠకుడు అందుకు సంబంధించిన కథనాలు చదివి తాను తన యవ్వనంలో విమానాన్ని ఎత్తుకెళ్లిన ఉదంతాన్ని ఎమ్మాకు వివరించారు.
సోమర్‌సెట్‌లోని 'థియో వాన్ ఈక్' ఇల్లు అనేక ఆసక్తికర అంశాలకు నిలయం. అక్కడకు వెళ్తే ఆయన కూర్చునే గది పైకప్పు నుంచి వేలాడే చీపుర్లకు వేలాడే మాంత్రికుల బొమ్మలు, పింగాణీ పిల్లి బొమ్మలు, అలమరాల్లో అమర్చిన పుర్రెలు పలకరిస్తాయి.

వాన్ ఈక్స్ కాఫీ టేబుల్‌పై ఉండే వస్తువుల్లో 1964 నాటి డచ్ వార్తాపత్రిక క్లిప్పింగులు కనిపిస్తాయి.
అందులో ఓ యువ నావికాదళ ఉద్యోగి మాల్తాలో తాను పనిచేసే మిలటరీ బేస్ నుంచి విమానాన్ని దొంగిలించి అందులో లిబియాలోని బెంఘాజీకి ఎలా పారిపోయాడన్న కథనం కనిపిస్తుంది.
''ఆ కుర్రాడిని నేనే'' అంటూ నవ్వుతాడు వాన్ ఈక్స్. ఇప్పుడాయన కుర్రాడు కాదు, జుత్తంతా తెల్లగా మారిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు.
'ఆ క్లిప్పింగులోని చిత్రాల్లో కనిపిస్తున్నది నేనే, అప్పుడు నా వయసు 21' అని చెబుతారాయన.
వాన్ భార్య నా చేతికి కాఫీ మగ్ అందించారు. అప్పటి కథలను వాన్ నాకు చెబుతున్నప్పుడు ఆమె నిరాశగా తలూపారు.
ఆమె వాన్ వైపు వేలు చూపిస్తూ 'అహంకారపు మనిషి' అంటూ జోక్ వేశారు.

అప్పట్లో థియో వాన్ ఈక్ మామూలు కుర్రాడు.. విమానాన్ని నడపాలని కలలు కంటుండేవాడు. నిజానికి ఆయనకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే విమానాన్ని నడపాలనే కోరిక ఆయనలో మొదలైంది.
మంచి విద్యార్థైన ఆయన ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరేందుకు కావాల్సినన్ని మార్కులు సాధించలేనేమోనని భయపడుతుండేవాడినని ఆయన చెప్పారు.
అప్పుడు డచ్ నేవీలో ట్రైనీ ఎలక్ట్రీషియన్‌గా చేరేందుకు అవకాశమందని తెలిసి.. అక్కడ నిరూపించుకుంటే నేవీలో అంతర్గతంగా పైలట్ కోర్సుకు చేపట్టే ఎంపికలను సద్వినియోగం చేసుకోవచ్చని భావించి 19 ఏళ్ల వయసులో రెండో ఆలోచన లేకుండా ఎనిమిదేళ్ల నేవీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేందుకు చేరాడు.
విమానం కాక్‌పిట్‌లో ఆయన దిగిన ఒక బ్లాక్ అండ్ ఫొటోను ఆ కాఫీ టేబుల పైనుంచే తీసి నా చేతికందించారాయన. ఆ ఫొటోలో నల్లని హెల్మెట్ పెట్టుకుని ఉన్నారాయన, ఆయన ముఖంలో పసితనం, ఎప్పుడెప్పుడు విమానాన్ని గాల్లో ఎగిరిద్దామా అన్న ఆత్రుత కనిపిస్తున్నాయి.
''నేననుకున్నది అనుకున్నట్లుగానే సక్రమంగా జరిగింది.. నేను పైలట్ శిక్షణకు ఎంపికయ్యాను'' అని అప్పటి సంగతులు చెప్పారు వాన్ ఈక్.

కానీ, 1964లో వాన్ ఈక్ హాలండ్‌లో తానుండే బ్యారక్స్‌లోనే ఒక పార్టీకి వెళ్లారు. అప్పటికి ఆయనకు 40 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఆ పార్టీలో వాన్ బాగా తాగారు. ఆ పార్టీలో ఆయన కమాండర్ కూడా ఉన్నారు. అప్పుడు ఆ పైలట్ ట్రైనింగ్ స్కీమ్‌పై చర్చ జరిగింది. అక్కడ మాట్లాడుకునేవన్నీ బయట ఎక్కడా మళ్లీ ప్రస్తావించబోమని, ఈ చర్చలో మాట్లాడొచ్చని వాన్‌తో ఆ కమాండర్ అన్నారు.
దాంతో వాన్ అమాయకంగా అంతా కక్కేశారు. సరైన విమానాల్లో శిక్షణ ఇవ్వడం లేదని, శిక్షణ కోసం చెత్త విమానాలు వాడుతున్నారని వాన్ అన్నారు. అంతవరకు ఎలాంటి రిమార్కు లేకుండా సాగిన వాన్ వైమానిక శిక్షణ ప్రయాణంపై మచ్చ పడింది. పార్టీ జరిగిన మరుసటి రోజే ఆయనకు 'ఆరెంజ్ కార్డ్' హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శిక్షణ ముగింపు పరీక్షల్లో ఆయన ఫెయిల్ కావడానికి అది కారణమయ్యే ప్రమాదం ఉంది. దాంతో తనను అన్యాయంగా ఇరికించారంటూ వాన్ ఆగ్రహించాడు. ఆ కోపంలోనే శిక్షణ తరగతుల్లో ఇన్‌స్ట్రక్టర్ రావడానికి ముందు బ్లాక్ బోర్డుపై 'శిక్షణ నెమ్మదిగా సాగుతోంది' అని రాశాడు.
అలా రాయడం ఆయన్ను మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఆ వారాంతంలో ఆయన్ను బ్యారక్స్‌లోని జైలులో పెట్టారు. జైలు తలుపులకున్న బోల్టులు వదులుగా ఉండడం గమనించిన ఆయన వాటిని విప్పేసి తప్పించుకున్నాడు. జైలు నుంచి తప్పించుకోవడంతో ఆయన్ను శిక్షణ నుంచి తప్పించేశారు. ఒప్పందం ప్రకారం ఆయనకున్న మిగతా ఆరేళ్ల సర్వీసును ఎలక్ట్రీషియన్‌గానే గడపాలని ఆదేశించారు.
''నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. 12 మంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల్లో నేను తొమ్మిదో వాడిని. మా కుటుంబ పద్ధతుల ప్రకారం తప్పు తప్పే ఒప్పు ఒప్పే. దాని ప్రకారం నేవీలో నాకు జరిగిన అన్యాయం తప్పే'' అన్నారాయన.
ఆ పరిణామాలతో పైలట్ కావాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. మిగతా ఆరేళ్లు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేయలేనని, మానేస్తానని ఆయన అభ్యర్థించినా అధికారులు అంగీకరించలేదు. దీంతో అక్కడ చిక్కుకుపోయాడు. దాంతో అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆయన పథకాలు వేయడం ప్రారంభించాడు.

ఫొటో సోర్స్, Getty Images
చివరకు విమానం దొంగతనం చేసి అందులో పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ వాడే గ్రమన్ ట్రాకర్ ప్లేన్‌కి సంబంధించిన హ్యాండ్ బుక్ ఒకటి సంపాదించి తన షెల్ఫ్‌లో పెట్టుకున్నాడు. రోజూ బ్యారక్స్‌లో ఉన్నవారంతా నిద్రపోయాక దాన్ని తీసి చదివి ఔపోసన పట్టాడు.
మంచి అనుభవం ఉన్న కొందరు పైలట్లతో స్నేహం చేసి వారి నుంచి విమానం టేకాఫ్, ల్యాండింగ్, నడపడానికి సంబంధించిన పూర్తి మెలకువలు తెలుసుకున్నాడు.
''అయితే, హాలండ్ నుంచి విమానంలో పారిపోవాలని నేను అనుకోలేదు. అలా చేయడం కొంత కష్టమని తెలుసు. అదే సమయంలో మాల్తాలో రెండు నెలల పాటు బ్రిటిష్ నేవీతో కలిసి నిర్వహించే విన్యాసాలకు కొందరు వలంటీర్లు కావాలనుకున్నారు. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలనుకున్నాను. పథకం ప్రకారం మాల్తా వెళ్లాను.
రెండు నెలలు అక్కడ పూర్తయి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాం. వీడ్కోలు సభ జరిగింది. దానికీ హాజరయ్యాను. అక్కడ పార్టీలో గతంలో తప్పు చేయకుండా కొద్దిగానే తాగాను. పార్టీ పూర్తయి అంతా నిద్రలోకి జారుకున్నారు. వారు పొద్దున్న లేవడానికి ముందే నేను బైక్ మీద రన్‌వేకు చేరుకున్నాను. అక్కడున్న గార్డ్‌కు నా పేరు జేన్సెన్ అని చెప్పాను.
విమానాలు ఉంచే ప్రదేశం గేట్లు తెరిచాడాయన'' అన్నారు వాన్.

''అన్నీ చాలా పక్కాగా ప్లాన్ చేశాను. తెలివిగా గార్డ్ పిస్టల్‌ను లాక్ చేయడంతో పాటు తాను తెచ్చిన బైక్ తాళం కూడా వేసేశాను. అంతేకాదు, అక్కడున్న టెలిఫోన్ మైక్రోఫోన్లనూ పీకేశాను'' అంటూ ఆ రోజు ఉదయం తాను చేసినవన్నీ చెబుతుంటే వాన్ నీలి కళ్లు ఉత్సాహంతో మెరుస్తున్నాయి.
''విమానమెక్కి ఇంజిన్ స్టార్ట్ చేశాను. రేడియో ఆన్ చేశాను. కంట్రోల్ టవర్ నుంచి వెంటనే స్పందించారు.. నేనెవరో చెప్పాలని అడుగుతున్నారు. కానీ, నేనేమీ చెప్పలేదు.. నేరుగా విమానాన్ని రన్ వే పైకి తీసుకెళ్లి టేకాఫ్ చేశాన''న్నారు.
దాంతో.. వాన్ ఎత్తుకెళ్తున్న ఆ గ్రమాన్ ట్రాకర్ సబ్‌మెరైన్ డిస్ట్రాయర్ విమానం ఉత్తర ఆఫ్రికా వైపు సాగిపోయింది.
''యుద్ధ విమానం కావడంతో దానికి రెండు టార్పెడోలు ఉన్నాయి. ఆ సంగతి గుర్తు రాగానే భయం మొదలైంది. కానీ, అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాన''ని చెప్పారు.
''5 వేల అడుగుల ఎత్తున ఒక్కడినే ఆకాశంలో ఎగురుకుంటూపోయాను'' అంటూ వాన్ అప్పటి ముచ్చట చెప్పుకొంటూపోతున్నారు.

ఫొటో సోర్స్, Alamy
దాదాపు ఐదున్నర గంటల పాటు 21 ఏళ్ల వాన్ ఆ విమానాన్ని నడుపుకుంటూ వెళ్లారు.
ల్యాండింగ్ కోసం సురక్షితమైన ప్రదేశం కోసం వెతికారు. ట్రిపోలీలో బ్రిటీష్ సైన్యం బేస్‌క్యాంప్‌గా ఉన్న బెంఘజికి విమానాన్ని తిప్పారు. పచ్చికబయళ్లతో ఉన్న ఆ ప్రాంతంలో గుడెసులు, గొర్రెల మంద కనిపించింది. రన్ వే స్పష్టంగా ఉందా అనేది తెలుసుకునేందుకు విమానాన్ని కాస్త కిందకు దింపారు.
''నేను క్షేమంగా ల్యాండ్ చేయగలిగితే నేవీ అధికారులు నన్ను పైలెట్ అనుకుంటారని భావించాను'' అని వాన్ చెప్పారు.
కానీ, వాన్ పథకం తలకిందులైంది. విమానాన్ని దొంగిలించి తీసుకొచ్చినట్లు అక్కడి అధికారులకు అర్థమైంది.
దీంతో వాన్ లిబియా పోలీసులకు లొంగిపోయారు. అక్కడి నుంచి విడుదలై మళ్లీ డచ్ మిలిటరీలో తన నియామకం కోసం ప్రయత్నించారు.
డచ్ రాయబారితో వారం రోజుల చర్చించిన వాన్ చివరకు ఒక ఒప్పందానికి అంగీకరించారు. అతను నెదర్లాండ్
తిరిగి వెళ్తాడు (పైలట్‌గా కాకుండా ప్రయాణీకుడిగా). విమానంతో పారిపోయినందుకు ఏడాది జైలు శిక్ష అనుభవిస్తాడు. ప్రతిగా నేవీ అతనికి గౌరవప్రదంగా వీడ్కోలు ఇస్తుంది.
''నేను కోరుకున్నది నాకు దొరికింది. నేవీ నుంచి బయటపడాలని అనుకున్నాను. నేను చేసిన పనికి ఏమీ చింతించడం లేదు'' అని వాన్ పేర్కొన్నారు.
''నేను విమానాన్ని నడపాలనుకున్నాను. నడిపాను '' అని చెప్పారు.
''అప్పుడు నన్ను వెంబడించడానికి మూడు విమానాలను పంపారు. కానీ వారు తప్పు దిశలో వెళ్లడంతో
నన్ను కనిపెట్టలేకపోయారు. నేను రేడియోలో వారితో మాట్లాడాను. నా విమానానికి రెండు టార్పెడోలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని కాల్చండని వారికి సూచించాను'' అని వాన్ తన సహసాన్ని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- ‘బ్రౌన్ గర్ల్స్’... ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- ‘క్యాన్సర్ చికిత్సతో గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








