అమెరికన్ గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ బాడీని 85 ఏళ్ళ తరువాత సమాధి నుంచి ఎందుకు తవ్వి తీస్తున్నారు? .

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఎనిమిది దశాబ్దాల కిందట ఎఫ్‌బీఐ ఏజెంట్లు కాల్చి చంపామని ప్రకటించిన గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ మృతదేహాన్ని సమాధి నుంచి తవ్వితీయటానికి ఇండియానాపోలిస్ అధికారులు అనుమతించారు.
ఎఫ్‌బీఐ ఏజెంట్లు 1934లో చికాగోలో కాల్చి చంపింది డిలింగర్‌ను కాదని.. అతడి వేషంలో ఉన్న వేరొక వ్యక్తినని డిలింగర్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
ఇండియానాపోలిస్‌లోని క్రౌన్ హిల్ స్మశానవాటికలో సమాధి చేసిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్షించి నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియానా అధికారులు ఎట్టకేలకు అందుకు అంగీకరించారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీన మృతదేహాన్ని వెలికితీయాలని నిర్ణయించారు. కానీ.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్మశాన వాటిక కోర్టుకు వెళ్లింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కుట్ర సిద్ధాంతం అంటున్న ఎఫ్‌బీఐ
1934లో చికాగోలోని బయోగ్రాఫ్ థియేటర్‌లో తమ ఏజెంట్లు కాల్చి చంపింది డిలింగర్‌నే అనటానికి తమ దగ్గర 'సమాచార సంపద' ఉందని ఎఫ్‌బీఐ ఆగస్టులో ఒక ట్వీట్‌లో పేర్కొంది.
చికాగోలో కాల్చి చంపిన వ్యక్తి మృతదేహాన్ని పొరుగు రాష్ట్రమైన ఇండియానా రాజధాని ఇండియానాపోలిస్‌లో సమాధి చేశారు.
అది డిలింగర్ కాదంటున్న వాదనలన్నీ 'కుట్ర సిద్ధాంతం' అని ఎఫ్‌బీఐ కొట్టివేసింది.
అయితే, ఎఫ్‌బీఐ ఏజెంట్లు చంపింది డిలింగర్ వేషంలో ఉన్న వేరే వ్యక్తినని తాము నమ్ముతున్నట్లు డిలింగర్ మేనల్లుడు మైఖేల్ థాంప్సన్, ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సమాధిలో ఉన్న వ్యక్తి కళ్ల రంగు, వేలిముద్రలు వేరేవని చెప్పటానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ జాన్ డిలింగర్?
అమెరికాలో అత్యంత సంక్షుభిత కాలంగా భావించే 'మహా మాంద్యం' శకం 1930వ దశకంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్.
అతడు నడిపే 'డిలింగర్ గ్యాంగ్' బ్యాంకు దోపిడీలకు పాల్పడేదని ఆరోపణలు ఉన్నాయి.
అతడు రెండు సార్లు జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. డిలింగర్‌ను 'పబ్లిక్ ఎనిమీ నంబర్ 1' అని అప్పట్లో అభివర్ణించేవారు.
అతడి తల మీద అప్పట్లోనే 10,000 డాలర్ల బహుమానం ప్రకటించారు.
డిలింగర్ జీవిత కథతో 2009లో 'పబ్లిక్ ఎనిమీస్' అనే పేరుతో క్రైమ్ డ్రామా మూవీ విడుదలైంది. మైఖేల్ మాన్ దీనికి దర్శకత్వం వహించారు.
డిలింగర్ పాత్రను జానీ డెప్ పోషించాడు. గ్యాంగ్‌స్టర్ చివరి రోజులను, ఆధునిక ఎఫ్‌బీఐ జననాన్ని ఈ సినిమా వివరిస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








