కశ్మీర్‌లో పాఠశాలలు నడవకుండా పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి?

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం

కశ్మీర్‌లోని చరార్-ఎ-షరీఫ్‌లోని ఓ ట్యూషన్ సెంటర్‌కు రోజూ వందల మంది విద్యార్థులు వస్తుంటారు. స్థానిక యువకులు కొందరు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

పదో తరగతి చదువుతున్న అంజార్ హుస్సేన్ అనే స్థానిక బాలుడు ఆ ట్యూషన్‌కు కొంతకాలంగా వెళ్తున్నాడు.

''ఆగస్టు 5 తర్వాత నుంచి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సమాచార ప్రసార మాధ్యమాలేవీ లేవు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి శుక్రవారం నిరసనలు, రాళ్లు రువ్వడం వంటివి జరుగుతుండేవి. ఈ సమయంలో మా టీచర్ ఇర్ఫాన్ అహ్మద్ ఈ ట్యూషన్ సెంటర్ గురించి చెప్పారు. ఇది ఊరికి కొంచెం దూరంలో ఉంది. ఇక్కడికి రావడం మాకు సురక్షితంగా అనిపిస్తోంది'' అని అంజార్ వివరించాడు.

''ఇక్కడ చదువుకోవడం మొదలుపెట్టాక నాలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నిరాశగా అనిపించేది. ఇంట్లోవారికి భారంగా ఉన్నానన్న భావన కలిగేది. సిలబస్ పూర్తి చేసుకునేందుకు ఇక్కడికి వస్తున్నాం'' అని చెప్పాడు.

''నాలాగే మిగతా విద్యార్థులు కూడా ఒత్తిడిలో ఉన్నారు. ఈ ట్యూషన్ సెంటర్‌కు రాకపోయుంటే, సిలబస్ అలాగే ఉండిపోయేది'' అని అంజార్ అన్నాడు.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

భవిష్యత్తుపై ప్రభావం

తనకు ఈ ట్యూషన్ సెంటర్ గురించి చెప్పిన ఇర్ఫాన్ అహ్మద్ ఇదే పట్టణంలో ఉంటారని, ఇంటింటికీ తిరిగి ఈ సెంటర్ గురించి అందరికీ ఆయన సమాచారం ఇచ్చారని అంజార్ వివరించాడు.

''కశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాల ప్రభావం నేరుగా మా భవిష్యత్తుపై పడుతుంది. నిరసనలు ఆగకపోతే, మా పరీక్షలు ఎలా జరుగుతాయి? పరీక్షలు నిర్వహించకపోతే, ఒక ఏడాది మొత్తం వృథా అవుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశాడు.

2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని సవరించింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్, టెలిఫోన్ వంటి సేవలను నిలిపివేసింది. పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు కూడా మూతపడ్డాయి.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

సమస్యలొస్తాయేమోనని భయపడ్డాం

ట్యూషన్ సెంటర్ ప్రారంభించిన వారిలో ఒకరైన ఇర్ఫాన్ అహ్మద్ బీబీసీతో మాట్లాడారు.

''పట్టణంలో చాలా మంది పిల్లలు పాఠశాలలు లేక ఇళ్లకే పరిమితమవుతుండటం గురించి నేను, నా స్నేహితులు మాట్లాడుకున్నాం. పాఠశాలలు నడవడం ఆగి నెల దాటిపోయింది. దీని ప్రభావం పిల్లల చదువులపై ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ట్యూషన్ సెంటర్ పెడితే ఏవైనా సమస్యలు రావొచ్చని అనుకున్నాం. కానీ, చివరికి దీన్ని మొదలుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాం'' అని ఇర్ఫాన్ వివరించారు.

''మొదట్లో కొందరు పిల్లలు మా ఇంటికి ట్యూషన్ కోసం వచ్చేవారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో నా సహోద్యోగుల సాయంతో వేరే చోట ట్యూషన్ సెంటర్ కోసం ఏర్పాట్లు చేశా. పిల్లల తల్లిదండ్రులు కూడా మా ప్రయత్నానికి సహకరించారు. దీని కోసం మేం ఫీజు ఏమీ తీసుకోం. మేం చేస్తున్న కృషికి ఫలితం తొందరగానే వస్తుండటం ఆనందం కలిగిస్తోంది'' అని అన్నారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

ఇంటింటికీ తిరిగాం

ట్యూషన్ సెంటర్ ప్రారంభించేటప్పుడు భయాందోళనతో ఉన్నారా అన్న ప్రశ్నకు.. ''కొన్ని రోజులయ్యాక ఆంక్షలు తగ్గాయి. రాకపోకలు మొదలయ్యాయి. అప్పుడు నేను విద్యార్థుల ఇళ్లకు వెళ్లా. వాళ్లను ట్యూషన్‌కు రమ్మని చెప్పా. ఇప్పటికీ పరిస్థితులను చూస్తే, రాబోయే పది నిమిషాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంది'' అని ఇర్ఫాన్ బదులిచ్చారు.

''ఎప్పుడైనా ఎక్కడైనా నిరసనలు జరగొచ్చు. భద్రతా దళాలు ఎలాగైనా స్పందించొచ్చు. ఆ ఆందోళన కూడా మాకు ఉంటుంది. విద్యార్థుల క్షేమానికే మా తొలి ప్రాధాన్యం. ట్యాషన్ సెంటర్ క్లాస్ ప్రారంభమయ్యే సమయంలో మేం బయటే వారి కోసం వేచి చూస్తూ ఉంటాం. వచ్చాక, వారిని లోపలికి తీసుకువెళ్తాం'' అని చెప్పారు.

కశ్మీర్ లోయ ప్రాంతంలో అన్ని పాఠశాలలూ కళాశాలలూ ఆగస్టు 5 నుంచి మూతపడే ఉన్నాయి. కొన్ని పాఠశాలలను తెరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పిల్లలెవరూ వాటికి వెళ్లడం లేదు.

గత 45 రోజులుగా బీబీసీ చాలా పాఠశాలలకు వెళ్లి పరిశీలించింది. ఒక్క దానిలో కూడా విద్యార్థులు గానీ, ఉపాధ్యాయులు గానీ కనిపించలేదు.

అయితే, పాఠశాలలకు ఉపాధ్యాయులు వస్తున్నారని, విద్యార్థుల హాజరు శాతం కూడా బాగానే ఉంటోందని ప్రభుత్వం చెబుతోంది.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

ఎందుకు వెళ్లడం లేదంటే..

ఇర్ఫాన్ నడుపుతున్న ట్యూషన్ సెంటర్‌కు రిబా తారిక్ అనే పదో తరగతి విద్యార్థిని కూడా వెళ్తోంది. ఆమెతో బీబీసీ మాట్లాడింది.

''మేం ఇంట్లో ఆందోళనగా కూర్చునేవాళ్లం. ఇక్కడికి వచ్చాక కాస్త ప్రశాంతత దొరికినట్లు అనిపించింది. ట్యూషన్ సెంటర్‌లోని మిగతావారితో మాట్లాడుతుంటే కొంచెం ఆనందంగా ఉంటోంది. నా స్నేహితులతోపాటు కొత్త వారినీ ఇక్కడ కలుస్తున్నా. ఆగస్టు 5 తర్వాత మా అనుభవాలను ఒకరితో మరొకరం పంచుకుంటున్నాం'' అని రిబా వివరించింది.

ప్రభుత్వం పాఠశాలలను తెరిచినట్లు ప్రకటించినా, అక్కడికి ఎందుకు వెళ్లడం లేదని రిబాను బీబీసీ ప్రశ్నించింది.

అందుకు.. ''పాఠశాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేదు. చాలా మంది విద్యార్థులు దూరం నుంచి వస్తారు. మా ఉపాధ్యాయులదీ అదే పరిస్థితి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల జీవితాలను ప్రమాదంలో పెట్టాలనుకోవడం లేదు. పాఠశాలకు వెళ్లొద్దనే చెబుతున్నారు'' అని ఆమె జవాబిచ్చింది.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

ఈ ట్యూషన్ సెంటర్‌కు పది కిలో మీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామం నుంచి ఇక్రా అనే ఓ బాలిక కూడా వస్తోంది. ఆమె కూడా పదో తరగతి విద్యార్థినే.

''ట్యూషన్ సెంటర్‌కు రావడం చాలా కష్టమవుతోంది. ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు వాహనాలు కూడా దొరకడం లేదు. అలాంటప్పుడు నడిచే రావాల్సి వస్తోంది. ఏదైనా జరుగుతుందేమోనని ఎప్పుడూ భయంగానే ఉంటుంది. దీని ప్రభావం నా చదువుపైనా పడుతోంది'' అని ఆమె చెప్పింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)