కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అవ్యక్త్
    • హోదా, బీబీసీ కోసం

స్వతంత్ర, స్వావలంబన భారతదేశం గురించి మహాత్మా గాంధీ కలలు కన్నారు. ఎలాంటి సైద్ధాంతిక, తాత్విక పునాదులపైనా ఈ కల నిర్మితమవలేదు. ఇది ఒక ఆచరణాత్మక ప్రాజెక్టు లాంటిది.

భారత్ అంటే ఇక్కడ భారత ప్రజలని అర్థం. అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలు, కులాల సమూహం. సమానత్వం, సోదరభావం, మానవత్వం తదితర ఆదర్శాలతో పురుషులు, మహిళలు, పిల్లలతో ఈ దేశం రూపొందింది.

ఇలా ఒక లౌకిక భారత దేశం ఏర్పడింది. ప్రపంచానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా ఈ దేశం ఉండాలి.

కానీ, ఇప్పుడు భారత్ ఎక్కడ ఉంది? ఈ రోజు గాంధీ మళ్లీ వచ్చి భారత్‌ను తన దృక్పథంతో పరిశీలిస్తే ఈ దేశానికి ఎన్ని మార్కులు వేసేవారు? భారత్ తనకు తాను ఎన్ని మార్కులు కేటాయించుకుంటుంది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

భారత్ బయటి సమస్యలపై ఐక్యంగా పోరడటానికి ముందు తన సమాజంలోని పలు రుగ్మతలు తనకు సమస్యలను సృష్టించాయి.

ఈ సమస్యలు రాజకీయ, ఆర్థిక, సామాజికపరమైనవిగా కనిపించినప్పటికీ, ఇవి సైద్ధాంతిక, అస్తిత్వ సంక్షోభంగా పరిణమించడం ప్రారంభించాయి.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ వాస్తవ పాలకులు ఎవరు?

కశ్మీర్ అంతా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఈ బలవంతపు నిశ్శబ్దాన్ని భారత సమాజం శాంతిగా భావిస్తోంది. ఇప్పుడు కశ్మీరీలు సైన్యం నియంత్రణలో ఉన్నారు. మిగిలిన భారత దేశాన్ని మీడియా నియంత్రిస్తోంది.

ఇటువంటి పరిస్థితిలో గాంధీ ఉంటే ఏం చేసేవారో ఊహించటం కష్టం. దేశ విభజనప్పుడు ఒక సంతకంతో తనకు ఇష్టమైన దేశంలో విలీనమయ్యే అవకాశం కశ్మీర్‌ రాజుకు ఉన్న సమయంలో గాంధీ అక్కడ పర్యటించారు.

కశ్మీర్ తన రాజు కోసమో, భూమి కోసమో కాదు అక్కడి ప్రజల కోసం నిలబడుతుందని గాంధీ అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో బ్రిటిష్ పాలకుల పునాదులను కదిలించిన గాంధీ, ప్రజల మనోభావాల గురించి ఆలోచించడం, వారి హృదయాలను గెలవడం చాలా ముఖ్యమైన అంశం అని అంటారు.

చరిత్రాత్మక కశ్మీర్ పర్యటనకు రెండు రోజుల ముందు, 1947 జులై 29న గాంధీ తన ప్రసగంలో ఇలా అన్నారు, ''భారత్‌లోనే ఉండేలా కశ్మీర్‌‌ను ఒప్పించేందుకు నేను అక్కడికి వెళ్లడం లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కశ్మీర్ ప్రజలు.. అది నేను లేదా మహారాజా తీసుకునే నిర్ణయం కాదు. కశ్మీర్‌కు మహారాజా ఉన్నారు, పౌరులు ఉన్నారు. ఒకవేళ రేపు రాజు మరణించినా, ఆ ప్రజలు అక్కడే ఉంటారు. కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించేది వాళ్లే.''

''మీరు ఈ వయసులో అంత క్లిష్టమైన ప్రయాణం చేయడం అవసరమా? మీరు మహారాజాకు లేఖ పంపితే సరిపోతుంది కదా'' అని ఒకరు ఆనాడు గాంధీకి సలహా ఇచ్చారు. గాంధీ ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ... ''మీ లాజిక్ ప్రకారం, బంగ్లాదేశ్‌లోని నోవాఖలీకి కూడా నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా నేను ఉత్తరం పంపేవాడిని కదా. కానీ మిత్రమా, అలా చేస్తే పనులు జరగవు'' అని అన్నారు.

1947 అక్టోబర్ 26న కశ్మీర్‌పై పాక్ దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఇరు దేశాలకు గాంధీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు "ఈ రాచరిక రాజ్యానికి నిజమైన పాలకులు ప్రజలే. వాళ్లు పాకిస్తాన్‌తో వెళ్లాలని అనుకుంటే, వారిని ఏ శక్తీ అడ్డుకోలేదు. కానీ, ప్రజల అభిప్రాయాలను మీరెలా సేకరిస్తారు? ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అనువైన పరిస్థితులను నెలకొల్పాలి. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేలా చూడాలి. వారిపై దాడి చేసి, వారి గ్రామాలను, ఇళ్లను తగలబెట్టడం ద్వారా మీరు వారి అంగీకారాన్ని పొందలేరు.

తాము ముస్లింలం అయినప్పటికీ భారతదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నామని ఇక్కడి ప్రజలు చెబితే, వారిని ఏ శక్తీ ఆపలేదు. పాకిస్తానీయులు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, వారు తమ పాలనను స్థాపించకుండా ఇక్కడి ప్రజలు అడ్డుకోవాలి. పాకిస్తాన్‌ను అడ్డుకోలేకపోతే, అప్పుడు వారు నిందల నుంచి తప్పించుకోలేరు'' అని గాంధీ పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ దృష్టిలో గో రక్షణ అంటే...

గాంధీ తనను తాను సనాతన హిందువుగా భావించారు. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దాని సంప్రదాయాల కోణం నుంచి ఆయన గోవుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.

అయితే, భిన్నత్వంతో ఉండే భారత్‌లో... మూక హత్యలతో గో రక్షణ సాధ్యం కాదని గాంధీ అర్థం చేసుకున్నారు. గోవుల ఆరాధన పేరుతో మత కపటత్వం చూపే వారిని ఆయన గమనించారు. తమను తాము గో రక్షకులుగా ప్రకటించుకునేవారు వాస్తవానికి 'గో భక్షకులు' అని చెప్పడానికి కూడా ఆయన వెనకాడలేదు. వాస్తవానికి, గో రక్షణ అనే పదాన్ని గాంధీ ఉపయోగించడం మానేశారు. గో సంరక్షణ కావాలి కానీ, గో రక్షణ కాదని ఆయన చెప్పారు.

హిందూ మతం, గో రక్షణ మధ్య ఉన్న సంబంధంపై 1921 అక్టోబర్ 6న 'యంగ్ ఇండియా'లో గాంధీ ఇలా రాశారు... ''హిందూ మతం పేరిట ఉన్న చాలా విషయాలు నాకు ఆమోదయోగ్యం కావు. ఒకవేళ, నేను నిజంగా అలాంటివి పాటించకపోతే హిందువును కాదు అని భావిస్తే నన్ను హిందువు అని పిలవాల్సిన అవసరం లేదు.''

''ఒక ఆవును రక్షించడం కోసం ఒక మనిషిని చంపడం అనేది హిందూ ధర్మానికి, అహింసా సూత్రాలకు వ్యతిరేకం. తనను తాను ప్రక్షాళన చేసుకోవడం, ఆత్మత్యాగం అనేది హిందూ ధర్మ ఆచరణీయ మార్గం. కానీ, ఈ రోజుల్లో గో రక్షణ పేరిట ముస్లింలతో వివాదం కొనసాగుతోంది. గో రక్షణకు పిలుపునిచ్చిన మతం.. సాటి మనిషిని హింసించడాన్ని ఎలా సమర్థిస్తుంది?'' అని ఆయన ప్రశ్నించారు.

''గో హత్యల నిరోధానికి చట్టం తీసుకొచ్చేలా నెహ్రూ లేదా పటేల్‌పై ఒత్తిడి తేవాలని నన్ను అడుగుతున్నారు. కానీ, నేను ఎప్పుడూ అలా చేయను'' అని 1947 జులై 19న జరిగిన ఒక ప్రార్థన సమావేశంలో గాంధీ స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మతాంతర, కులాంతర వివాహాలపై...

''ఒక ఇంగ్లిష్ కోడలినో, అల్లుడినో తీసుకొస్తే భారతీయ సమాజం దాని గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ, అదే భారతీయ సమాజం తమ మతం, కులం కాని వారిని పెళ్లి చేసుకుంటే వారిని బహిరంగంగా చెట్టుకు కట్టేసి ఉరితీస్తుంది. కన్నబిడ్డలపై ఇంతటి క్రూరంగా ప్రవర్తించే అనాగరికత ఎక్కడ నుంచి వస్తుంది? వాస్తవానికి, సమాజం కులం, మతం అనే సంకుచిత కోణాల నుంచి ప్రపంచాన్ని చూస్తుంది. భారత ఐక్యత, అభివృద్ధికి కులం, మతంలోని ఈ సంక్షిష్టతలు పెద్ద అవరోధాలుగా ఉన్నాయి'' అని కులం, మతంపై గాంధీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గాంధీ తొలినాళ్లలో కులాంతర వివాహాలను వ్యతిరేకించారు. అయితే, తర్వాత కాలంలో వధువు లేదా వరుడిలో ఎవరో ఒకరు దళితులు కాకపోతే అలాంటి వివాహాలకు తాను హాజరుకానని ప్రతిజ్ఞ చేశారు. తన ఆశ్రమంలో కూడా అలాంటి వివాహాలను జరిపించారు.

1946 జులై 7న హరిజన్‌ సంచికలో... ''నాకు ఒక అవకాశం ఇస్తే, నా దగ్గర ఉన్న ఉన్నత కులాలకు చెందిన అమ్మాయిలందరూ యోగ్యులైన హరిజన యువకులను తమ భర్తలుగా ఎన్నుకోవాలని సలహా ఇస్తాను'' అని గాంధీ రాశారు.

అదే విధంగా, 1942 మార్చి 8 నాటి హరిజన్ సంచికలో... ''కాలం మారే కొద్దీ ఇలాంటి వివాహాలు సర్వసాధారణమవుతాయి. సమాజం వాటి నుంచి ప్రయోజనం పొందుతుంది. సహనం పెరిగినప్పుడు, అన్ని మతాల పట్ల గౌరవం పెరిగినప్పుడు ఇలాంటి వివాహాలు పెరుగుతాయి'' అని పేర్కొన్నారు.

కానీ, ఇలాంటి వివాహాల ఆధారంగా మత మార్పిడులు చేయడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.

''పెళ్లి పేరుతో స్త్రీ, పురుషులు మతాన్ని మార్చుకోవడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇష్టానుసారం మార్చడానికి మతం బెడ్‌షీట్, కండువా లాంటిది కాదు'' అని గాంధీ అదే వ్యాసంలో రాశారు.

మహాత్మా గాంధీకి సంబంధించి బీబీసీ ప్రచురించిన కథనాలు మీకోసం..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)