ఆర్టీసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోసారి సమీక్ష జరపనున్న సీఎం కేసీఆర్ - తెలంగాణ ఆర్టీసీ సమ్మె

సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సు

ఫొటో సోర్స్, Telangna I&PR/TSRTC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో తరువాత ఏం చేయాలనేదానిపై సోమవారం కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించినట్లు నిరాహార దీక్షకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దాన్ని రద్దు చేసుకున్నారు. గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్ళి సమావేశం కావాలని నాయకులు భావించారు.

అసెంబ్లీ దగ్గర ఉన్న అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించడానికి వెళ్లిన ఆర్టీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావులు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిని నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆ సమావేశం ప్రస్తుతానికి వాయిదా పడింది. సమావేశం తరువాత కార్మిక నాయకుల కార్యాచరణ తెలుస్తుంది.

ఇక కార్మికుల తొలగింపు అనేది ముఖ్యమంత్రి కార్యాలయ పత్రికా ప్రకటనే తప్ప ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలూ కార్మికులకు అందలేదు. దీంతో అవి అందిన తరువాతే కార్మిక సంఘాలు చట్టపరమైన పరిష్కారాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆలోపు పార్టీలు, సంఘాల మద్దతుతో ఆందోళన చేసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంఖ్య సుమారు 50 వేలు. వీరిలో ప్రభుత్వం విధించిన శనివారం సాయంత్రం 6 గంటల గడువు సమయానికి విధుల్లో చేరింది దాదాపు 1200 మంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన వాస్తవంగా అమలు జరిగితే.. 48 వేల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులను తొలగించినట్లవుతుంది.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం ఉన్నతస్థాయి సమావేశం

ఫొటో సోర్స్, Telangana I&PR

ఫొటో క్యాప్షన్, ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం ఉన్నతస్థాయి సమావేశం

ముఖ్యమంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు:

ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం స్పష్టం చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ సమ్మెపై ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

  • సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదం.
  • ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.
  • ఆర్టీసీ ఉద్యోగులతో ఇక ఎలాంటి చర్చలు జరిపేది లేదు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
  • గడువు పూర్తి అయ్యేలోపల, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోం. ఆ ప్రకారం ఇక ఆర్టీసీలో మిగిలిన సిబ్బంది మొత్తం 1200 మంది లోపే.
  • తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడిపేందుకు అధికారులను ఆదేశించాం. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు.
  • అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభం. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. వారికి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
  • ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది.
  • 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలి.
బస్ భవన్

ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు.

"ఆర్టీసీ చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకం, ఆలోచనా తప్పిదం, భాద్యతారాహిత్యం. ఇప్పుడు రాష్ట్రానికి ఈ విషయంలో శాశ్వతమైన లాభం చేకూరాలి. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామమాత్రంగా వున్నాయి. ఆ విధంగా చూస్తే కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని ఈ ప్రకటన తెలిపింది.

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయింతో ఉందని, యూనియన్ల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదని సీఎం స్పష్టం చేశారని కూడా సీఎం సీపీఆర్వో విడుదల చేసిన ఈ ప్రకటన వెల్లడించింది.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం ఉదయం ఎంజీబీఎస్‌ ఆవరణలో రద్దీ తగ్గిపోయింది. ఫ్లాట్ ఫాంపైకి బస్సులు రాలేదు

ఆర్టీసీ జేఏసీ దీక్షకు అనుమతి నిరాకరణ

ఇదిలా ఉండగా, సోమవారం ఇందిరాపార్కులో ఆర్టీసీ జేఏసీ నాయకుల దీక్షకు అనుమతి నిరాకరించినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు అక్కడికి వచ్చినా ఆరెస్టులు తప్పవని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో, ఇందిరాపార్క్ వద్ద సోమవారం నుంచి తలపెట్టిన నిరాహార దీక్ష నిరాహార దీక్ష కార్యక్రమాన్ని వాయిదా వేశామని జేఏసీ వర్గాలు తెలిపాయి.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి స్పందన

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, "మా స్పందన తీవ్రంగా ఉంటుంది. మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఆందోళన ఉధృతం చేస్తాం. మేం కేసీఆర్ కింద జీతగాళ్లం కాదు. మా త్యాగాల పునాదుల మీదే అయన సీఎం అయ్యారు"అని అన్నారు.

"ముఖ్యమంత్రి నిర్ణయం చట్టబద్ధం కాదు. 50 వేల మందిని భయభ్రాంతులకు గురిచేసి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఆ స్థాయి ప్రకటన చేశారు. ప్రపంచంలో సమ్మె చేస్తోన్న మొత్తం కార్మికులను తొలగించడం ఎక్కడా లేదు. మాకు కోర్టులున్నాయి. చట్టాలున్నాయి" అని జేఏసీ కోకన్వీనర్ కె. రాజిరెడ్డి బీబీసీతో అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భయపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పిన రాజిరెడ్డి, "కార్మికులెవరూ డ్యూటీకి పోరు. తెగించే వచ్చాం. సచ్చినా బతికినా, ఆర్టీసీని రక్షించుడే. ప్రజా రవాణాను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలది. అయినా మేం యూనియన్లుగా ముదుకు వచ్చాం. దసరా తరువాత ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. ప్రజల మద్దతు మాకు ఉంటుంది" అని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఇవీ..

టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కరపత్రం ప్రకారం.. సమ్మె జరపడానికి కారణాలు, కార్మికులు చేస్తున్న డిమాండ్లు ఇవీ..

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం
  • కార్మికులకు ఉద్యోగ భద్రత
  • జీతభత్యాల సవరణ
  • ఆర్టీసీ సంరక్షణ - కార్మికుల హక్కుల సంరక్షణ
  • ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ
  • ఆర్టీసీకి అన్ని రకాల ట్యాక్సుల నుంచి మినహాయింపు
  • అద్దె బస్సుల రద్దు, కొత్త బస్సుల కొనుగోలు

తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్ వైజర్స్ అసోసియేషన్ తదితర ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)