తెలంగాణ: ఆర్‌టీసీ చరిత్రలో చివరి సమ్మె ఇదే అవుతుందా?

తెలంగాణ ఆర్‌టీసీ

ఫొటో సోర్స్, TSRTCHQ/facebook

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) కార్మికులు.. వేతన సవరణ కోరుతూ జూలై 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. ఆర్‌టీసీ అసలే నష్టాల్లో ఉందని వేతనాలు పెంపు కోసం సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని, ఆర్‌టీసీకే ముప్పుగా పరిణమిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హెచ్చరించారు.

వేతన సవరణ (పీఆర్‌సీ)పై జాప్యం చేయటాన్ని నిరసిస్తూ.. ఆర్‌టీసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) జూన్ 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చాయి. దీనిపై తాజాగా రవాణా శాఖ మంత్రి, అధికారులతో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపినా నిర్దిష్టమైన ఫలితం రాలేదు.

సమ్మెను విరమించుకోవాలని ప్రభుత్వ ప్రతినిధులు సూచించారని.. అయితే.. వేతన సవరణపై నిర్దష్టమైన హామీ ఇవ్వనిదే సమ్మె విరమించలేమని తాము చెప్పామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి బీబీసీకి తెలిపారు.

ఆర్‌టీసీ కార్మికుల నిరసన ప్రదర్శన

ఫొటో సోర్స్, TSRTC Employees Union/Facebook

కార్మికుల డిమాండ్ ఏమిటి?

అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూతో పాటు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక సంఘ్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌, బీకేయూ, బీడబ్ల్యూయూలు కూడా జేఏసీలో భాగస్వాముులుగా ఉన్నాయి.

ఆర్‌టీసీ కార్మికులకు నాలుగేళ్లకోసారి వేతన సవరణ సంఘం ద్వారా వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంటారు. 2013 సంవత్సరానికి సంబంధించిన పీఆర్‌సీ కాలపరిమితి 2017 మార్చి 31వ తేదీతో ముగియటంతో.. 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలుకావాల్సి ఉంది.

‘‘కానీ పదిహేను నెలలుగా ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీనిపై కార్మికులం 14 నెలల కిందటే 72 అంశాలతో నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం నాలుగు నెలల కిందట పీఆర్‌సీని ఏర్పాటు చేసి నామమాత్రపు మీటింగులతో కాలం వెళ్లబుచ్చుతోంది’’ అని థామస్ చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్‌టీసీ కార్మికుల వేతనాలను పెంచాలని, కనీస వేతనం రూ. 24,000 గా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/Facebook

సమ్మె నోటీసుపై ప్రభుత్వం ఏమంటోంది?

ఆర్‌టీసీలో సమ్మెలను నిషేధించటం జరిగిందని.. కార్మికులు సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హెచ్చరించారు. సమ్మెకు వెళితే తెలంగాణ ఆర్‌టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని.. ఆర్‌టీసీని మూసివేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

''రూ. 3,000 కోట్ల అప్పు, ఏటా రూ.250 కోట్ల వడ్డీ భారం, ఏటా రూ. 700 కోట్ల నష్టంతో ఆర్‌టీసీ నడుస్తోంది. కానీ యూనియన్‌ నాయకులు సంస్థపై మరో రూ. 1,400 కోట్ల భారం పడేలా డిమాండ్లతో సమ్మెకు నోటీసివ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’’ అని ఆయన అధికారులతో సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.

ఇంతకుముందు.. దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా ఆర్‌టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచామన్నారు. యూనియన్‌ నాయకుల కోరిక ప్రకారం 25 శాతం ఐఆర్, 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు ఏటా మరో రూ. 1,400 కోట్లు అదనపు భారం ఆర్‌టీసీపై పడుతుందన్నారు. ‘‘ఇప్పటికే ఉన్న అప్పులు, నష్టాలు కలసి ఆర్‌టీసీ మనుగడ ఎలా?’’ అని ప్రశ్నించారు.

‘‘చాలా రాష్ట్రాల్లో ఆర్‌టీసీలను ఎత్తివేయడమో, నామమాత్రంగా నడపడమో, పునర్వవస్థీకరించడమో జరిగింది. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 7.. ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్‌టీసీని విభజించారు. ఇదే పద్ధతిని తెలంగాణలోనూ అవలంబించాల్సిన పరిస్థితులు రావచ్చు'' అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

అసలు వేతనాల పెంపు ఊసేదీ?

అయితే.. నాలుగేళ్లకోసారి చేపట్టాల్సిన వేతన సవరణను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్‌టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం వేగంగా స్పందించి పీఆర్‌సీ వేసింది. కానీ ఆర్‌టీసీ కార్మికుల విషయంలో 15 నెలలుగా పీఆర్‌సీపై నిర్ణయం తీసుకోలేదు. వేతనాల పెంపు అంత కాదు.. ఇంత అన్న ప్రతిపాదనలైనా లేవు. అసలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది’’ అని థామస్‌రెడ్డి విమర్శించారు.

కార్మికుల వేతనాల పెంపుతో ఆర్‌టీసీ నష్టాలను ముడిపెట్టటం సరికాదని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు అనేక కారణాల వల్ల సాధారణంగా నష్టాల్లోనే ఉంటాయని పేర్కొన్నారు.

‘‘ఆర్‌టీసీని నష్టాల నుంచి బయటపడేయటానికి బడ్జెట్‌లో నిధులు సర్దుబాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అది జరగటం లేదు. ఆర్‌టీసీ నష్టాల్లో కొంత వాటా జీహెచ్‌ఎంసీ భరించాల్సి ఉంది. రెండేళ్లుగా వారు ఆ వాటా నిధులు ఇవ్వటం లేదు. సుమారు రూ. 432 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక వివిధ పాస్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్‌ చెల్లించాల్సిన మొత్తంలో రూ. 400 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడరు?’’ అని థామస్‌రెడ్డి ప్రశ్నించారు.

ప్రైవేటు బస్సుల అక్రమ నిర్వహణలను అడ్డుకోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధీనంలో ఉన్న పలు మార్గాల పర్మిట్లను పంచుకోవటం వంటి చర్యలు చేపట్టకపోవటం వల్ల కూడా తెలంగాణ ఆర్‌టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

‘‘ప్రభుత్వ బెదిరింపులు ప్రజాస్వామ్యానికి చేటు...’’

న్యాయమైన జీతాల పెంపు అడిగితే.. ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తామని, సంస్థను మూసేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతోందని.. ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని థామస్‌రెడ్డి పేర్కొన్నారు.

పద్నాలుగు నెలలుగా వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, కొద్ది రోజుల కిందట బస్ భవన్ ముట్టడి వంటి ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని.. సమ్మెకు పోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని ఆయన పేర్కొన్నారు.

అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో 56,000 మంది కార్మికుల మనోభావాలు, సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. జేఏసీలోని ఇతర కార్మిక సంఘాలు, టీఎంయూ కార్యవర్గంతో చర్చించి తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘సమ్మె చేస్తే ఆర్‌టీసీకి ఇదే ఆఖరి సమ్మె అంటూ బ్లాక్‌మెయిల్ చేసి, కార్మికుల చేత సమ్మె మాన్పించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఆర్‌టీసీ కార్మికులను రెచ్చగొట్టకుండా వారి సమస్యలు పరిష్కరించాలి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)