భారత్ వ్యాపార అనుకూల దేశంగా మారడానికి కారణమేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురంజన్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకప్పుడు భారత్‌లో ఏదైనా వ్యాపారం చేయాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది. భారత్‌లో బ్యూరోక్రసీ, రెడ్‌టేపిజం, అనుమతుల జారీలో అంతులేని ఆలస్యం వంటివన్నీ ఉండేవని.. అవన్నీ దాటుకుని ముందుకెళ్తే పన్నులు భారం, పరిశ్రమకు కావాల్సిన భూమి సేకరించడం, ముడిసరకు తెచ్చుకోవడం వంటి సమస్యలూ తీవ్రంగా ఉండేవన్నది అప్పట్లో పారిశ్రామికవేత్తల ఆరోపణ.
కానీ ఇప్పుడు, ఆ పరిస్థితి మారిపోయిందని ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. భారత్‌లో వ్యాపారం పెట్టడం ఇప్పుడు ఎంతో సులభతరమైందని ఆ నివేదిక తెలిపింది.
'సులభతర వ్యాపార సూచి-2020'(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్)లో భారత్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానంలో ఉంది. 2016 నాటి 'సులభతర వాణిజ్య సూచి'లో భారత్ 130వ స్థానంలో ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
మూడేళ్లలో ఇంత మార్పు ఎలా సాధ్యం?
''భారత్ గత ఏడాది కాలంలో ప్రధానంగా నాలుగు వ్యాపార సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రపంచంలో సులభతర వాణిజ్యంలో మెరుగవడంలో వరుసగా మూడో ఏడాది కూడా భారత్ టాప్ 10 దేశాల జాబితాలో ఉంది'' అని ప్రపంచ బ్యాంకు తన 'సులభతర వ్యాపార సూచి-2020' నివేదికలో చెప్పింది.
దివాలా పరిష్కారాలు, నిర్మాణ అనుమతులు, వాణిజ్య పరిధులు సడలించడం వంటి అనేక అంశాల్లో ప్రక్రియ వేగవంతం, సరళతరం చేయడంతో వ్యాపార అనుకూలత ఏర్పడిందని ఆ నివేదిక ప్రస్తావించింది.
దేశీయ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్లో పోటీతత్వం పెంచే లక్ష్యంతో మోదీ 'మేకిన్ ఇండియా' ప్రచారం చేపట్టి విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నారని నివేదిక పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా చూసుకుంటే ఈ సంస్కరణలన్నీ ప్రశంసించదగ్గవేనని ఆ నివేదిక చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాపారవర్గాలు ఏమంటున్నాయి?
ఈ ఏడాది జూన్‌లో 'ప్యాంట్స్ అండ్స్ పైజామాస్' అనే స్టార్టప్ ప్రారంభించిన రిచా బజాజ్ మాట్లాడుతూ.. ''ఇప్పుడు భారత్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రతి వ్యాపారానికీ తప్పనిసరి.. జీఎస్టీ వెబ్‌సైట్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇలాంటివన్నీ వ్యాపారాన్ని సులభం చేస్తున్నాయని'' అన్నారు.
ఒకప్పటితో పోల్చితే దేశంలో ఒక చోటి నుంచి మరోచోటికి ప్రయాణం కూడా చాలా సులభమైపోయిందని.. దాని వల్ల వ్యాపారాన్ని ఇతర నగరాలకు విస్తరించడం కూడా సులభమైందని ఆమె చెప్పారు.
రిజిస్ట్రేషన్లు వంటివి ఆన్‌లైన్లోనే సాధ్యమవుతుండడంతో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందని ట్రావెల్ స్టార్టప్ యజమాని వరుణ్ హూజా అన్నారు.
వీరిద్దరూ ముంబయికి చెందిన వ్యాపారులు.. డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ రూపకల్పనలో భారత్‌లోని ముంబయి, దిల్లీ నగరాలలో సర్వే చేసింది ప్రపంచ బ్యాంక్.
దిల్లీ, ముంబయిలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉంది?
హరియాణాలో పులకిత్ కౌశిక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫార్మాష్యూటికల్ వ్యాపారం ప్రారంభించారు. 'విద్యుత్ కనెక్షన్, భూమి కొనుగోలు చేయడం, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి అనుమతులు, కొత్త లైసెన్స్ వంటివన్నీ ఆన్‌లైన్లోనే తీసుకోవడం పూర్తయ్యాయి. దేనికీ గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లాల్సిన పని పడలేదు. పైగా నేను అప్లికేషన్ పెట్టుకున్న తరువాత అప్రూవ్ అయ్యేవరకు ప్రతి స్థాయిలోనూ ఆన్‌లైన్లో స్టేటస్ కూడా చూసుకునేవాడిని'' అన్నారాయన.
పుణెలో క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తున్న శశాంక్ దీక్షిత్‌దీ అదే మాట. అన్నీ ఆన్‌లైన్లోనే పూర్తవుతున్నాయని ఆయన చెపారు. అంతేకాదు.. ఇలాంటి వ్యాపార అనుకూల వాతావరణం భారత జీడీపీకి ఊతమివ్వడం ఖాయమంటున్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
అయినా ఇంకేమైనా ఇబ్బందులున్నాయా?
గతంతో పోల్చితే అనేక అంశాలు వ్యాపారులకు సులభ వాతావరణం కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా జీఎస్టీ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం పాటించడం వల్ల కొంత ఇబ్బంది తప్పడం లేదంటున్నారు రిచా బజాజ్.
కొత్త వ్యాపారాలు పెట్టినప్పుడు కొన్ని పన్నులు, ఫీజులకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటుందని, అలాంటివి తగ్గిస్తే మరింతమంది వ్యాపారంలోకి రాగలుగుతారని రిచా అన్నారు.
ప్రభుత్వ టెండర్లు పొందడానికి అనుసరించే ప్రక్రియలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని, ఒకసారి అప్రూవ్ అయితే అక్కడి నుంచి అన్నీ చకచకా జరిగిపోతున్నాయని.. అంతవరకు ప్రాసెస్ నెమ్మదిగా ఉంటోందని పులకిత్ అన్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాపారానికి కావాల్సిన విద్యుత్, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు పొందడంలో ఇబ్బందులున్నాయని సాఫ్ట్‌వేర్ కంపెనీ జెటా సీఎఫ్‌వో మెహుల్ తురాఖియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏమంటోంది
ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడం నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని, డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో మెరుగైన స్థానానికి చేరడం కూడా తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2024-25 నాటికి భారతదేశం డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో టాప్ 25 దేశాల జాబితాలో చోటు సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వ్యాపారంపై ప్రభావం చూపుతోందని గోయల్ అంగీకరించారు. గిరాకీ, సరఫరా మళ్లీ పుంజుకుంటే అన్నీ సర్దుకుంటాయన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?
- ఓలా, ఉబెర్ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
- భారత్-పాకిస్తాన్లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు
- బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పరిస్థితి ఏంటి?
- ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...
- బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిలో దక్షిణాసియా పెద్దపులిగా మారనుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










