అసదుద్దీన్: భాగ్యనగరం నుంచి బిహార్ వరకు ఎగిరిన ఎంఐఎం ‘గాలిపటం’

ఫొటో సోర్స్, facebook/Asaduddin Owaisi
మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా డాన్స్ చేస్తున్నట్లుగా చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రచార సమయంలో అభిమానులు కోరితే పార్టీ గుర్తయిన గాలి పటం ఎగురవేస్తున్నట్లుగా చేయడం ఆయనకు అలవాటు.
ఎంతో హుషారుతో, చాలావేగంగా గాలిపటం ఎగురవేస్తున్నట్లు ఆయన కాళ్లు, చేతులూ కదిలిస్తూ చేసిన ఆ విన్యాసం పాపులర్ అయింది. ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆ వీడియో క్లిప్‌లను తమ వాట్సాప్ స్టేటస్‌లుగానూ పెట్టుకున్నారు.
అసదుద్దీన్ తన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చూపించిన ఆ హుషారు ఇప్పుడు ఫలితాల్లోనూ కొంతవరకు కనిపించింది.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా రాజకీయాలు చేసే ఏఐఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 17 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రాబట్టుకుంది.
తాజా ఎన్నికల ఫలితాలతో ఏఐఎంఐఎం ప్రాతినిధ్యం మూడు రాష్ట్రాలకు పెరిగింది.
తెలంగాణ, మహారాష్ట్రలతో పాటు కొత్తగా బిహార్‌లోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం దక్కింది.

ఫొటో సోర్స్, facebook/Asaduddin Owaisi
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఏఐఎంఐఎం చాలాకాలంగా హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధిస్తూ వస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికలతో ఆ పార్టీ విస్తరణ మొదలైంది. ఆ ఎన్నికల్లో తొలిసారి తెలంగాణ బయట మరో రాష్ట్రం నుంచి కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
మహారాష్ట్రలోని రెండు నియోజకవర్గాల నుంచి ఎంఐఎం అభ్యర్థులు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
అనంతరం ఆ పార్టీ ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా తన సొంతగడ్డ తెలంగాణ మినహా ఇంకెక్కడా విజయం సాధించలేకపోయింది.

ఫొటో సోర్స్, http://results.eci.gov.in
మహారాష్ట్రలో 2 పోయి 2 వచ్చాయి..
మహారాష్ట్రలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించిన ఆ పార్టీ సంఖ్యాపరంగా తన స్థానాలను పెంచుకోలేకపోయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది.
మరోవైపు 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆ పార్టీ గెలుచుకున్న రెండు స్థానాలనూ తాజా ఎన్నికల్లో కోల్పోయింది. కొత్తగా రెండు స్థానాల్లో విజయం సాధించింది.
2014లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సెంట్రల్, బైకుల్లా నియోజకవర్గాల నుంచి ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు.
తాజా ఎన్నికల్లో ఆ రెండు సిటింగ్ స్థానాలనూ ఏఐఎంఐఎం కోల్పోయింది.
కోల్పోయిన సీట్లు..
ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి 2014లో సయీద్ ఇంతియాజ్ జిలాల్ ఏఐఎంఐఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పార్టీ నసీరుద్దీన్ తఖీయుద్దీన్ సిద్ధిఖీకి టికెట్ ఇచ్చింది. ఆయన శివసేన అభ్యర్థి జైశ్వాల్ శివనారాయణ్ ప్రదీప్ చేతిలో సుమారు 14 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014లో గెలిచిన మరో స్థానం బైకుల్లాలో సిటింగ్ ఎమ్మెల్యే వారిస్ యూసఫ్ పఠానే మరోసారి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. శివసేన అభ్యర్థి యామిని యశ్వంత్ జాదవ్ ఇక్కడ నుంచి గెలిచారు.
దీంతో మహారాష్ట్రలో ఏఐఎంఐఎం రెండు సిటింగ్ స్థానాలనూ కోల్పోయినట్లయింది.
గెలిచిన స్థానాలు
తాజా ఎన్నికల్లో ఏఐఎంఐఎం కొత్తగా ధూలె సిటీ, మాలెగావ్ సెంట్రల్ స్థానాలను గెలుచుకుంది.
ధూలె సిటీలో ఎంఐఎం అభ్యర్థి షా ఫరూక్ అన్వర్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ కూటమిలోని శివసేన పోటీ చేసింది. లోక్ సంగ్రామ్ పార్టీ అభ్యర్థి అనిల్ అన్నగోటే, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్యవర్థన్ రఘూజీ రావ్ (రాజూ బాబా) ఎంఐఎం అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మాలెగావ్ సెంట్రల్‌లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ భారీ ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ 78543 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీ అభ్యర్థి కేవలం 1438 ఓట్లు సాధించారిక్కడ.
బిహార్‌లో తొలిసారి ఎగిరిన 'గాలిపటం'
ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో పోటీపడిన ఏఐఎంఐఎం బిహార్‌లోని కిషన్‌గంజ్ స్థానాన్ని గెలుచుకుని మొట్టమొదటిసారి ఆ రాష్ట్రంలో 'గాలిపటం' ఎగురవేసింది.
కిషన్‌గంజ్ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. 1952, 1967 ఎన్నికలు మినహా మిగిలిన అన్నిసార్లూ ముస్లిం నేతలే విజయం సాధిస్తూ వస్తున్నారు.
గత ఆరు ఎన్నికలుగా ఇక్కడ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలే విజయం సాధిస్తూ వస్తున్నాయి. 2015లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత మహ్మద్ జావేద్ గెలిచారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన లోక్‌సభకు ఎన్నికవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
సీట్లు పెరగకపోయినా..
మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుచుకున్న మూడు స్థానాల్లో రెండు కాంగ్రెస్ సిటింగ్ స్థానాలు, ఒకటి బీజేపీ సిటింగ్ నియోజకవర్గం. మహారాష్ట్రలో ఆ పార్టీ గెలిచిన మాలెగావ్ సెంట్రల్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, ధూలె సిటీ నుంచి బీజేపీ నేత ప్రాతినిధ్యం వహించేవారు.
ఇక బిహార్‌లో కాంగ్రెస్ సిటింగ్ స్థానాన్ని కైవసం చేసుకుని అక్కడ ఎంఐఎం బోణీ చేసింది.
మహారాష్ట్రలో ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. షోలాపూర్ సిటీ సెంట్రల్, బైకుల్లా, ఔరంగాబాద్ సెంట్రల్, ఔరంగాబాద్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
ఔరంగాబాద్ వెస్ట్, బాలాపూర్ నియోజకవర్గాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సంపాదించింది. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో చోట సుమారు 40 వేల చొప్పున ఓట్లను సాధించింది.
ఇవి కూడా చదవండి
- వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందంటే..
- తెలంగాణలో ‘ఆమె’కు ఎందుకు అంత అప్రాధాన్యం?
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








