హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం.. సైదిరెడ్డికి 43359 ఓట్ల మెజార్టీ

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ శాసన సభ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.

అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డికి 113094 ఓట్లు (56.34 శాతం) పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69736 ఓట్లు (34.74 శాతం)లభించాయి.

సైది రెడ్డి 43359 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

స్వతంత్ర అభ్యర్థి సపవత్ సుమన్‌కు 2697 ఓట్లు (1.34 శాతం), బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావుకు 2638 ఓట్లు (1.31 శాతం), నోటాకు 506 ఓట్లు (0.25 శాతం) లభించాయి.

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు.

అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది.

ఈనెల 21వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికల్లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/UTTAMKUMARREDDY

2018 ఎన్నికల్లో

గత ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు.

శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.

ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.

కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ

ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు.

ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు.

2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)