ఒడిశా: ‘మీరు అంటరానివాళ్లు అంటూ తుపాను పునరావాస శిబిరంలోకి మమ్మల్ని రానివ్వలేదు’

కొద్ది రోజుల కిందట వచ్చిన ఫొని తుపాను ఒడిశాకు భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 64 మంది చనిపోగా, లక్షల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తుపాను సమయంలో అత్యవసర శిబిరాలను ఏర్పాటు చేసి చాలా మంది ప్రజలను వాటిల్లోకి తరలించింది ఒడిశా ప్రభుత్వం.
అయితే మే నెల మూడో తేదీన పూరి గ్రామంలోని ఒక ప్రభుత్వ శిబిరంలోకి దళితులను రానివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలపై ఒడిశా నుంచి బీబీసీ ప్రతినిధి ఫైజల్ మహ్మద్ అలీ అందిస్తున్న రిపోర్ట్.
''మే నెల రెండో తేదీ సాయంత్రం, తుపాను గురించి వినగానే సురక్షిత శిబిరానికి వెళ్లాం. అక్కడి వాళ్లు మమ్మల్ని అంటరాని వారన్నారు. మీకిక్కడ చోటు లేదంటూ మమ్మల్ని లోపలకు రానివ్వలేదు'' అని తుపాను బాధితుడు త్రినాథ్ మాలిక్ తెలిపారు.
తుపాను సమయంలో గ్రామంలోని బడిని పునరావాస శిబిరంగా మార్చారు. ప్రజలను అక్కడికి తరలించారు. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఈ దళిత కుటుంబాలకు ఒక గది ఇచ్చారు. మిగిలిన వారికి దూరంగా, అది కూడా సిమెంటు రేకుల గదిలో ఉంచారు. కానీ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను ఆ రేకులు ఎంత సేపు తట్టుకోగలవు?
''రేకులు విరిగిపోయాయి. మాలో పదిపదిహేను మంది వరండాలో కూర్చున్నారు. కాపాడమని దేవుడిని వేడుకున్నాం. భయంకరమైన గాలివానలోనూ మా వాళ్లు వరండాలోనే ఉండాల్సి వచ్చింది'' అని బాధితుల్లో ఒకరైన బినితా గోచ్యత్ చెప్పారు.

అంటరానితనం నేరమని ఈ బడిలో ఒక చోట రాశారు. కానీ హక్కుల కోసం గొంతెత్తిన దళితులు బెదిరింపులకు లోనవుతున్నారు.
''నేను బలవంతంగా తలుపు తెరవడానికి ప్రయత్నించా. మా మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోలీసు కేసు పెడతామని వారు బెదిరించారు. నిజంగా కేసు పెడితే పోరాడే శక్తి మాకు లేదు. ఒకరోజు తింటే మరొక రోజు పస్తులుండే మేం ఏం చేయగలమని అనుకున్నాం'' అని ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు రీలా మాలిక్.
తుపానుకు కూలిన చెట్టే నేడు వారికి ఆసరాగా మారింది. ఆరు రోజుల తరువాత మనిషికో కేజీ చొప్పున ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో వీరు వంట చేసుకున్నారు.
ఒడిశాలోని ప్రఖ్యాత జగన్నాథుని కీర్తనలను వీరు పాడుతుంటారు. పండుగలు, శుభకార్యాల్లో పాడటానికి కూడా వీరిని పిలుస్తుంటారు. అయినా ఇవేవీ వారి అంటరానితనాన్ని పోగొట్టలేకపోయాయి.

''మేం సన్నాయి వాయించడానికి వెళ్లిన ఇళ్లలో అన్నం మా దోసిట్లో పడేస్తారు'' అని మాగా మాలిక్ చెప్పారు.
''అటువంటి కేసేదీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా అలా జరిగిందని మీకు చెప్పి ఉన్నట్లయితే మేం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి అందరూ ముఖ్యమే'' అని పూరి జిల్లా కలెక్టర్ బల్వంత్ సింగ్ తెలిపారు.
19వ శతాబ్దంలో ఒడిశా తీవ్ర కరవును చవి చూసింది. ఆరోజుల్లో ప్రభుత్వ శిబిరాల్లో అన్ని వర్గాలతో కలిసి భోజనం చేసిన వాళ్లకు 'ఛతర్ ఖియా' అనే పేరును తగిలించారు. 150 ఏళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- లోక్-సభ ఎన్నికలు 2019- 'మోదీ భారత్'లో హామీలు నెరవేరాయా
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- డేటింగ్ యాప్ నుంచి అధునాతన కార్ల వరకు అన్నీ కెనడాలోనే ఎందుకు పరీక్షిస్తారు?
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ‘ఆమెతో సెక్స్ అంటే ఓ కొట్లాట... ఆమె ఒంటి మీది దుస్తులన్నీ చింపేసేవాడ్ని’
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
- లిప్స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్లోనూ జోరుగా సాగు
- మీ ఆలోచనల్ని చదివి, మాటల రూపంలో వినిపించే పరికరం... శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









