ఆలోచనల్ని చదివి, మాటల రూపంలో వినిపించే పరికరం... శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లాఘెర్
    • హోదా, బీబీసీ న్యూస్ ప్రతినిధి

మనసులోని మాటలు ఇక అక్కడే దాగిపోవు. మనుషుల ఆలోచనలను చదివి వారు ఏమనుకుంటున్నారో మాటల రూపంలో బయటకు వినిపించే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

ఇందుకోసం మెదడుకు అమర్చే ఓ పరికరాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు.

మాట పడిపోయిన చాలా మందికి ఈ సాంకేతికత ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.

ఎలా పనిచేస్తుంది?

మనసును చదివే ఈ సాంకేతికత రెండు దశల్లో పనిచేస్తుంది.

మొదట మెదడులో ఓ ఎలక్ట్రోడ్‌ను అమర్చాల్సి ఉంటుంది.

పెదవులు, నాలుక, స్వరపేటిక, దవడలకు మెదడు పంపే ఎలక్ట్రిక్ సంకేతాలను ఇది గ్రహిస్తుంది.

రెండో దశలో.. ఇలా గ్రహించిన సంకేతాలను ఓ శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషించి, ఆయా కదలికల వల్ల ఏర్పడే ధ్వనులను కృత్రిమంగా ఏర్పరుస్తుంది.

ఓ కృత్రిమ గొంతు వీటిని బయటకు వినిపిస్తుంది.

ఎలక్ట్రోడ్‌లు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఎలక్ట్రోడ్‌లు చదివేస్తాయి

ఈ పద్ధతే ఎందుకు?

ఒక్కో పదం పలికే సమయంలో మెదడులో ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ సంకేతాల సరళిని పరిశీలించడం ద్వారా ఆలోచనలు చదవడం సులువన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే, ఇప్పటివరకూ ఇలా చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు.

అందుకే శాస్త్రవేత్తలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నోటి కదలికలు, ధ్వనులను విశ్లేషించి, వాటి ద్వారా ఏర్పడే పదాలను గుర్తించే పద్ధతిని అనుసరించారు.

మెదడులోని చర్యల ఆధారంగా ఓ మనిషి మాట్లాడే పూర్తి వాక్యాలను గుర్తించగలగడం ఇదే తొలిసారని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఎడ్వర్డ్ చాంగ్ అన్నారు.

''మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ పరికరాన్ని రూపొందించవచ్చని మేం రుజువు చేశాం. మాట్లాడే సామర్థ్యం కోల్పోయినవారికి దీని ద్వారా మేలు చేయొచ్చు'' అని చెప్పారు.

ఎంత బాగా పని చేస్తుంది?

'బుక్స్' పదంలోని 'బు' లాగా చాలా తక్కువ సమయంలో పలికే ధ్వనుల కన్నా.. 'షిప్' పదంలో 'షి' తరహాలో సుదీర్ఘంగా పలికే ధ్వనుల విషయంలో ఈ సాంకేతికత మెరుగ్గా పనిచేస్తోంది.

ఐదుగురు వ్యక్తులతో కొన్ని వందల వాక్యాలను చదవించి ఈ సాంకేతికతపై పరిశోధకులు ప్రయోగాలు నిర్వహించారు.

వారి కృత్రిమ మాటలను వింటున్న శ్రోతలకు పదాల జాబితాలను ఇచ్చారు.

కృత్రిమ మాటల్లో దాదాపు 70 శాతాన్ని శ్రోతలు సరిగ్గా అర్థం చేసుకోగలిగారు.

ఇద్దరు మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి ఉపయోగం?

నాడీ సంబంధ వ్యాధులు, మెదడు గాయాలు, గొంతు క్యాన్సర్, పక్షవాతం, పార్కిన్సన్స్, మల్టిపుల్ సెలోరోసిస్ వంటి వాటి బారినపడ్డవారికి ఈ కొత్త సాంకేతికత సాయపడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

పెదవులు, నాలుక, స్వర పేటిక, దవడ కదలికలతో సంబంధం ఉండే మెదడులోని భాగాలపై ఆధారపడి ఈ సాంకేతికత పనిచేస్తుంది.

అందుకే కొన్ని రకాల పక్షవాతాలకు గురైన వారికి దీని ద్వారా ప్రయోజనం ఉండదు.

సెరెబ్రల్ పాల్సీ ఉండే చిన్నారులతోపాటు జీవితంలో ఎప్పుడూ మాట్లాడనివారికి మాట్లాడటంపై తర్ఫీదునిచ్చేందుకు దీని ద్వారా కొంత వరకూ అవకాశాలున్నాయి.

చదివితే పట్టేస్తుంది

వ్యక్తులతో వాక్యాలను చదివిస్తూ ఈ సాంకేతికతపై పరిశోధకులు ప్రయోగాలు నిర్వహించారు.

ఎలాంటి నోటి కదలికలూ చేయొద్దని వారికి సూచించారు.

''వారిని మేం కేవలం వాక్యాలను చదవమన్నాం. మెదడు సహజంగానే ఆ పదాలకు సంబంధించిన కదలికలను చేసేస్తుంది'' అని ప్రొఫెసర్ చాంగ్ తెలిపారు.

మెదడు

ఫొటో సోర్స్, CAROL & MIKE WERNER/SPL

ఆలోచనలు తెలిసిపోతాయా?

అచ్చంగా మెదడులోని ఆలోచనలను గుర్తించడం ప్రస్తుతానికి కష్టమైన విషయమేనని చాంగ్ అన్నారు.

''అచ్చంగా ఆలోచనలనే గుర్తించడం సాధ్యమవుతుందా అని మేం ప్రయత్నించి చూశాం. అది చాలా కష్టం. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వ్యక్తులు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారన్నదాన్ని గుర్తించడంపైనే మేం దృష్టి పెట్టాం'' అని చెప్పారు.

అయితే, 'మెదడును చదివే ఇలాంటి సాంకేతికతలు ఉండాలా? వద్దా?' అన్న అంశంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

మాట్లాడే సామర్థ్యం కోల్పోయినవారికి మాత్రం ఇదో వరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ సాంకేతికత ఆరంభ దశల్లోనే ఉందని, వినియోగానికి ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాకపోవచ్చని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ సోఫీ స్కాట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)