RRB Exam: రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు

రైలు, తెలుగు భాష

రైల్వే ప్రత్యక్ష నియామక పరీక్షల్లో తెలుగును తమ ప్రధాన భాషగా ఎంచుకున్న అభ్యర్థుల సంఖ్య 10 లక్షలకు పైనే ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి తెలిపారు.

భారతీయ రైల్వే ప్రత్యక్ష నియామక పరీక్షల్లో భారతీయ భాషల వాడకం గురించి లోక్‌సభలో బుధవారం ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. 2017వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కాలంలో 47.18 లక్షల మంది అభ్యర్థులు 13 భారతీయ భాషల్లో పరీక్షలు రాశారని తెలిపారు.

తెలుగులో రైల్వే పోటీ పరీక్షలు

రైల్వే ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీలతో పాటు 15 భారతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ (జీడీసీఈ)కి కూడా ఇదే విధంగా భారతీయ భాషల్లో పరీక్షలు రాసే విధానం వర్తిస్తుంది.

ఇంగ్లీషు, హిందీలను మినహాయిస్తే.. తెలుగుతో పాటు మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళం భాషల్లో ఎక్కువ మంది అభ్యర్థులు రైల్వే పరీక్షలు రాశారు. 2018వ సంవత్సరంలోనే 9,89,818 మంది అభ్యర్థులు తెలుగులో పరీక్షలు రాయగా.. 8,42,298 మంది మరాఠీలో పరీక్షలు రాశారు. అలాగే.. అస్సామీలో 1,52,179 మంది, గుజరాతీలో 3,61,900 మంది, పంజాబీలో 1,13,745 మంది, తమిళంలో 3,87,69 మంది, కన్నడలో 3,58,194 మది అభ్యర్థులు పరీక్షలు రాశారని లోక్‌సభలో రైల్వే మంత్రి పేర్కొన్న గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)