మహారాష్ట్ర: శరద్ పవార్ 38 ఏళ్లకే సీఎం ఎలా అయ్యారు.. ఆయన వెన్నుపోటు పొడిచారా?

శరద్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరద్ పవార్
    • రచయిత, నామ్‌దేవ్ అంజనా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్రలో ఇప్పుడు రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి.

కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటుండగానే, నవంబర్ 23న ఉదయం అకస్మాత్తుగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తోడుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

బీజేపీతో చేతులు కలపాలని అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతమని, తమ పార్టీతో దానికి ఎలాంటి సంబంధమూ లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.

బీజేపీ నాయకుడు గిరీశ్ మహాజన్ మాత్రం ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ తమ పార్టీకి మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖలు ఇచ్చారని అన్నారు.

ఫడణవీస్ ప్రమాణ స్వీకారంపై విపక్షాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడంతో, నవంబర్ 27న బలపరీక్ష జరపాలని కోర్టు ఆదేశించింది.

ఇంతలోనే మంగళవారం (నవంబర్ 26న) మొదట అజిత్ పవార్, ఆ తర్వాత కాసేపటికే ఫడణవీస్ తమ తమ పదవులకు రాజీనామా చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో అజిత్ పవార్ తిరుగుబాటు చర్చనీయాంశమైంది.

శరద్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరద్ పవార్ (పాత చిత్రం)

మహారాష్ట్రలో 1978లోనూ ఓ తిరుగుబాటు జరిగింది. అందులో ప్రధాన పాత్రధారి శరద్ పవార్.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన తిరుగుబాటు చేశారు. అప్పుడు వసంత్‌దాదా పాటిల్‌ సీఎంగా ఉన్నారు.

ఆ ప్రభుత్వం నుంచి శరద్ పవార్ బయటకు వచ్చి, జనతా పార్టీతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అధికారం చేపట్టారు. 38 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర సీఎం పదవి పొందారు.

మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ప్రస్తావన ఎప్పుడొచ్చినా, వసంత్‌దాదా పాటిల్‌కు శరద్ పవార్ వెన్నుపోటు పొడిచారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినప్పుడూ ఆ పాత విషయాన్ని కొందరు గుర్తు చేసుకున్నారు.

''మహారాష్ట్రకే అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారు'' అని శివసేన అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు అప్పుడు నాటకీయ పరిణామాల మధ్యే జరిగింది.

ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నేతగా ఉన్న వసంత్‌దాదా పాటిల్‌కు ద్రోహం చేశారన్ని ఆరోపణ శరద్ పవార్‌పై ఎప్పుడూ ఉంటూనే ఉంది.

కానీ తిరుగుబాటు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శరద్ పవార్ చిన్న వయసులోనే గొప్ప రాజకీయ పరిపక్వత చూపారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దేశంలో అత్యయిక పరిస్థితి విధింపు, 1977 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు కూడా శరద్ పవార్‌కు కలిసి వచ్చాయి.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీ

ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ మీద దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన వ్యతిరేకత ప్రభావం మహారాష్ట్రలోనూ కనిపించిందని సీనియర్ పాత్రికేయుడు అరుణ్ ఖోరే అన్నారు.

''అప్పుడు కాంగ్రెస్ చీలిపోయింది. శంకర్‌రావ్ చౌహ్మాన్, బ్రహ్మానంద రెడ్డిల వర్గం 'రెడ్డి కాంగ్రెస్'గా.. ఇందిరా వర్గం ఇందిరా కాంగ్రెస్‌గా విడిపోయాయి'' అని వివరించారు.

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌లో చీలిక తర్వాత మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌లో రెండు వర్గాలు తయారయ్యాయి.

శంకర్‌రావ్ చౌహ్మాన్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా శరద్ పవార్, వసంత్‌దాదా.. రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

నాశిక్‌రావ్ తిర్పుడే లాంటి నాయకులు ఇందిరా కాంగ్రెస్‌లో ఉన్నారు.

''ఆ రెండు కాంగ్రెస్ వర్గాలు మహారాష్ట్రలో 1978 ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయ. ఇందిరా గాంధీపై వ్యక్తమైన ప్రజాగ్రహ ప్రభావం ఆ రెండింటిపైనా కనిపించింది. ఎన్నికల్లో జనతా పార్టీ 99 సీట్లు గెలిచింది. రెడ్డి కాంగ్రెస్‌కు 69, ఇందిరా కాంగ్రెస్‌కు 62 సీట్లు వచ్చాయి'' అని మహారాష్ట్ర టైమ్స్ పత్రిక సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ విజయ్ చోర్మరే అన్నారు.

ఆ తర్వాత జనతా పార్టీకి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రెండు కాంగ్రెస్ వర్గాలు కలిసి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 1978 మార్చి 7న వసంత్‌దాదా పాటిల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

''జనతా పార్టీని ఆపేందుకు వసంత్‌దాదా పాటిల్ ప్రయత్నాలు ఆరంభించారు. బ్రహ్మానంద రెడ్డి, యశ్వంత్‌రావ్ చవాన్‌లతో మాట్లాడారు. ఇందిరా గాంధీ కూడా ఒక అడుగు వెనక్కితగ్గి, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారు'' అని అరుణ్ ఖోరే చెప్పారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీ

రెండు కాంగ్రెస్ వర్గాల సంకీర్ణ ప్రభుత్వంలో శరద్ పవార్ పరిశ్రమల శాఖ మంత్రి పదవి చేపట్టారు. ఇందిరా కాంగ్రెస్‌లో ఉన్న నాశిక్‌రావ్ తిర్పుడేకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చింది.

''అప్పుడు ఇందిరా కాంగ్రెస్ మహారాష్ట్రలో కొత్త పార్టీ. దాని విస్తరణ కోసం వసంత్‌దాదా పాటిల్, శరద్ పవార్, యశ్వంత్‌రావ్ చవాన్‌లను నాశిక్‌రావ్ లక్ష్యంగా చేసుకుంటుండేవారు. ప్రభుత్వంలో ఉంటూ ఇందిరా గాంధీపై భక్తిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండేవారు. వసంత్‌దాదాకు ఇదో తలనొప్పిగా మారింది'' అని విజయ్ చోర్మరే అన్నారు.

''శరద్ పవార్ లాంటి నేతలకు నాశిక్‌రావు తీరు నచ్చలేదు. వసంత్‌దాదాకు ప్రభుత్వం నడపడం కూడా కష్టమవుతూ వచ్చింది. రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ కారణంగానే పవార్ సొంత దారిని చూసుకున్నారు. వసంత్‌దాదా ప్రభుత్వం నుంచి బయటకి వచ్చారు. 1978 జులైలో మహారాష్ట్రలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని శరద్ పవార్ బయటకు వచ్చారు. కొందరు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దీంతో ప్రభుత్వానికి బలం తగ్గిపోయింది. వసంత్‌దాదా, నాశిక్‌రావ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ఏర్పడిన తొలి సంకీర్ణ సర్కారు నాలుగు నెలలకే కూలిపోయింది'' అని చోర్మరే వివరించారు.

శరద్ పవార్ ప్రభుత్వం నుంచి బయటకు రావడం వెనుక యశ్వంత్‌రావ్ చౌహ్వాన్ పాత్ర ఉందని ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది.

వసంత్‌దాదా పాటిల్‌తో విడిపోయాక పవార్ సమాజ్‌వాదీ కాంగ్రెస్ స్థాపించి, ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆ తర్వాత ఆయన జనతా పార్టీకి దగ్గరయ్యారు.

శరద్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

సమాజ్‌వాదీ కాంగ్రెస్, జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ తదితర పక్షాలు 'ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్'గా ఏర్పడి, 1978 జులై 18న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్‌యేతర ప్రభుత్వం ఇది.

38 ఏళ్ల వయసులోనే సీఎం పదవి చేపట్టిన శరద్ పవార్.. 18 నెలలపాటే ఆ పదవిలో ఉండగలిగారు.

''ఇందిరా గాంధీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టారు. జనతా పార్టీ బలహీనపడుతూ వచ్చింది. దేశంలో మళ్లీ రాజకీయ అస్థిరత వాతావరణం ఏర్పడింది. 1980 ఫిబ్రవరి 17న శరద్ పవార్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ తర్వాత మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. శరద్ పవార్ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. పవార్ ఆరేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మళ్లీ 1987లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు'' అని చోర్మరే అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)