ఇన్‌స్టాగ్రామ్: పోర్న్ తారల అకౌంట్లను తొలగించడంపై పెరుగుతున్న నిరసనలు

ఫొటో సోర్స్, GINGER BANKS; GETTY IMAGES
- రచయిత, థామస్ ఫాబ్రి
- హోదా, బీబీసీ ట్రెండింగ్
సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఏడాది వందల మంది పోర్న్ తారలు, సెక్స్ వర్కర్ల ఖాతాలు తొలగింపునకు గురయ్యాయి. ప్రధాన స్రవంతి సెలబ్రిటీలతో పోలిస్తే తమను తక్కువ చేసి చూస్తున్నారని, తమకు భిన్నమైన ప్రమాణాలను వర్తింపజేస్తున్నారని వీరిలో చాలా మంది విమర్శిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ లేదా మరొకరి వెరిఫైడ్ ఖాతా తరహాలో తన ఖాతాను నిర్వహించుకొనే స్వేచ్ఛ ఉండాలని, కానీ అలా చేస్తే తమను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగిస్తారని 'అడల్ట్ పర్‌ఫార్మర్స్ యాక్టర్స్ గిల్డ్' అధ్యక్షురాలు అలనా ఇవాన్స్ చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోర్న్ నటులను ఖాతాలు నిర్వహించుకోనివ్వాలంటూ పోరాడుతున్న ప్రముఖుల్లో అలనా ఒకరు.
ఇన్‌స్టాగ్రామ్ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ తమ ఖాతాలను తొలగించారని 1,300 మందికి పైగా పోర్న్ నటులు చెబుతున్నారు. నగ్న, లేదా సెక్స్ దృశ్యాలేవీ తమ ఖాతాల్లో పెట్టకపోయినా ఇలా చేశారని వీరు విమర్శిస్తున్నారు. వీరందరి వివరాలను అలనా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూపు సేకరించింది.
జీవనోపాధి కోసం తాము చేస్తున్న పని వాళ్లకు నచ్చదని, అందుకే తమపై వివక్ష చూపిస్తున్నారని అలనా ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అంశంపై జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులతో పోర్న్ నటుల ప్రతినిధులు సమావేశమయ్యారు. తొలగించిన ఖాతాలకు సంబంధించి తర్వాత కొత్త అప్పీలు వ్యవస్థ ఏర్పాటైంది. వేసవిలో రెండు పక్షాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. మరోవైపు పోర్న్ నటుల ఖాతాల తొలగింపును ఇన్‌స్టాగ్రామ్ కొనసాగించింది.
పోర్న్ తార జెస్సికా జేమ్స్ సెప్టెంబరులో మరణించాక ఆమె ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. అలనాకు బాగా బాధ, అసహనం కలిగించిన పరిణామాల్లో ఇది ఒకటి.
జెస్సికా ఖాతాను తొలగించారని తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని, ఈ ఘటనతో ఇన్‌స్టాగ్రామ్ తీరుపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని అలనా పేర్కొన్నారు.
తొమ్మిది లక్షల మందికి పైగా యూజర్లు అనుసరించే జెస్సికా ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ తర్వాత పునరుద్ధరించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఖాతాల తొలగింపే లక్ష్యంగా ఒక వ్యక్తి లేదా అనేక మంది కలసికట్టుగా 2018 ద్వితీయార్ధంలో తమ ఖాతాలను 'రిపోర్ట్' చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని పోర్న్ నటులు చెబుతున్నారు.
రిపోర్ట్ చేసిన తర్వాత చాలాసార్లు అసభ్య సందేశాలతో తమపై వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డారని వారు పేర్కొంటున్నారు.
వందల ఖాతాల తొలగింపు తన పనేనని 'ఒమిడ్' పేరుతో వ్యవహరించే ఒక అజ్ఞాత వ్యక్తి చాలాసార్లు చెప్పుకొన్నారు.

ఫొటో సోర్స్, @OMID91679072
ఈ కార్యక్రమంలో తొలుత లక్ష్యంగా మారిన వారిలో పోర్న్ నటి, సెక్స్ వర్కర్ల హక్కుల కార్యకర్త జింజర్ బాంక్స్ ఒకరు.
ఎంతో శ్రమించి, సమయం వెచ్చించి మూడు లక్షల మందికి పైగా ఫాలోయర్లతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అభివృద్ధి చేసుకున్నానని, దానిని తొలగించినప్పుడు నిరాశ చెందానని ఆమె వివరించారు. నిబంధనలను అనుసరించినా ఖాతాను తీసేశారని, అది ఇంకా బాధ పెట్టిందని చెప్పారు.
పోర్న్ నటులు, సెక్స్ వర్కర్లకు సోషల్ మీడియా ప్రాథమికమైన, కొన్ని సందర్భాల్లో ఏకైక మార్కెటింగ్ వేదికని, ఇక్కడ వీరిని తొలగించడమంటే మరింత వివక్షకు గురిచేయడమేనని జింజర్ బాంక్స్ వ్యాఖ్యానించారు.
"మా ఖాతాలను రిపోర్ట్ చేయడం వల్ల మాకు ఆదాయం లేకుండా పోతుందనే విషయం అలా చేసేవాళ్లకు తెలియదేమో. ఒకవేళ తెలిసినా పట్టించుకోరేమో. మేం ఈ పని చేయకూడదని వాళ్లు అనుకుంటున్నారు. అసలు ఈ పనే ఉండకూడదనీ అనుకొంటున్నారు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, @SABRINATHEBUNNY
సాంకేతిక విప్లవంతో సరికొత్త అవకాశాలు
సాంకేతిక విప్లవం పోర్నోగ్రఫీ పరిశ్రమలో భారీ మార్పులు తీసుకొచ్చింది. సరికొత్త అవకాశాలను కల్పించింది.
చాలా మంది పోర్న్ తారలు, సెక్స్ వర్కర్లు వెబ్‌క్యామ్ సైట్లు, సబ్‌స్క్రిప్షన్ సేవలు, కస్టమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకొంటూ సొంతంగా పనిచేయడం మొదలుపెట్టారు.
వీరిలో అత్యధికులు ఇన్‌స్టాగ్రామ్‌ను తమ వ్యక్తిగత బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి, తమను తాము చూపించుకోవడానికి వాడతారు.
పోర్న్ చిత్రాలు తీసే సంస్థలు ఈ రంగంలోని నటులకు అవకాశాలిచ్చేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఖాతాను తీసేస్తే వీరు అభిమానులను కోల్పోతారు. వీరు ఏర్పరచుకొన్న వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతింటాయి. చివరకు వీరి ఆదాయం, జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం పడుతుంది.
వీరు పెట్టే చాలా పోస్టుల్లో చూసేవారి ఊహాశక్తికి పని చెప్పేదేమీ ఉండదు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ మార్గదర్శకాలు స్పష్టంగా, నిర్దిష్టంగా లేవని, వీటి అమల్లోనూ స్థిరత్వం కొరవడిందని వీరు వాదిస్తున్నారు.
పోర్న్ తారలు, సెక్స్ వర్కర్ల ఖాతాల కంటే ఎక్కువగా ప్రముఖ సెలబ్రిటీల ఖాతాల్లో అభ్యంతరకర దృశ్యాలు ఉంటాయని, కానీ వారిని ఇన్‌స్టాగ్రామ్ అనుమతిస్తోందని వీరు ఆక్షేపిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత చిత్రాలు తానెప్పడూ పెట్టలేదని జింజర్ బాంక్స్ చెప్పారు. అయితే ఉదాహరణకు తాను లెగింగ్స్ వేసుకున్న ఫొటో ఎవరైనా ఒకరికి బాగా రెచ్చగొట్టే, 'రిపోర్ట్' చేయాల్సిన ఫొటోగా అనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఏది కళ, ఏది పోర్నోగ్రఫీ అనేది వ్యాపారసంస్థలు నిర్ణయించి, తమను శిక్షించే పరిస్థితులు వచ్చాయని, మనం దీనిని అనుమతిస్తున్నామని విచారం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, @BUSTY_VON_TEASE
ఫేస్‌బుక్ ఏమంటోంది?
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా భిన్న నేపథ్యాలున్న యూజర్లు ఉంటారని, అందువల్ల కంటెంట్ అందరికీ ముఖ్యంగా చిన్న వయసువారికి తగిన విధంగా ఉండేలా చూసేందుకు నగ్నత్వం, లైంగిక సేవల అంశాల్లో తాము నిబంధనలను అమలు చేయాల్సి ఉందని ఫేస్‌బుక్ తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సంస్థ.
నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌ను తమ దృష్టికి తీసకొస్తే చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ తెలిపింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకొనే అవకాశాన్ని ఇస్తామని, ఏదైనా పొరపాటున తొలగిస్తే పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.
ఫేస్‌బుక్ తాజా మార్గదర్శకాల ప్రకారం- యూజర్లు నగ్నచిత్రాలను, సెక్సువల్ కంటెంట్‌ను అడగడానికిగాని, చూపించడానికిగాని వీల్లేదు. సాధారణంగా సెక్సువల్ ఎమోజీలుగా అనిపించే ఎమోజీలను. ప్రాంతీయమైన సెక్సువల్ యాస వాడుతూ సెక్స్ చాట్ చేయకూడదు.
ఈ మార్గదర్శకాలు అమలుచేసే మాడరేటర్లు ఉపయోగించే ట్రైనింగ్ మెటీరియల్ ఏవనేది బయటకు తెలియదు.
నిష్పాక్షికత, భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా అత్యంత సంప్రదాయవాద యూజర్లకు ఆమోదయోగ్యంగా ఉండటానికే ఫేస్‌బుక్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ఉందని సెక్స్ వర్కర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
లైంగిక వినోద అంశాల జర్నలిస్ట్, వీటిపై వార్తలు అందించే 'ఎక్స్‌బిజ్' ఎడిటర్ గుస్టావో టర్నర్ ఫేస్‌బుక్ చర్యపై విమర్శలు గుప్పించారు. సిలికాన్ వ్యాలీలో ఒక సంస్కృతి ఉందని, అది ప్రేక్షకులను పసివాళ్లలా చూడాలనుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఒకవైపు పరస్పర అంగీకారమున్న వయోజనుల మధ్య, వ్యాపారమయం కాని సందర్భాల్లోనూ లైంగిక సంభాణపై కఠినమై నిబంధనలను అమలు చేస్తున్న ఫేస్‌బుక్, మరోవైపు 'క్రషెస్' పేరుతో డేటింగ్ సర్వీసును తీసుకొస్తోందని టర్నర్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
వలలో కళ
లైంగిక సమాచారం విషయంలో ఇన్‌స్టాగ్రామ్ నిబంధనల ప్రభావం 'అడల్ట్' తారలు, సెక్స్ వర్కర్ల మీదే కాదు ఇతరులపైనా పడుతోంది.
న్యూయార్క్‌లోని లెసీల్-లోమన్ మ్యూజియంలో 'ద రివల్యూషనరీ ఆర్ట్ ఆఫ్ క్వీర్ సెక్స్ వర్క్' పేరుతో జరిగిన ప్రదర్శన ఫొటోలను షేర్ చేసినందుకు కళాకారిణి, రచయిత అయిన రేచల్ రాబిట్ వైట్ ఖాతానే తొలగించారు.
"నేను ఒక ప్రతిష్ఠాత్మక గాలరీ నుంచి స్వలింగ సంపర్కుల శృంగారానికి సంబంధించిన పురాతన, చాలా ముఖ్యమైన ఫొటోలు పోస్ట్ చేశాను. వాటిలో అసభ్యంగా ఉండేవి ఏవీ కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కానీ కొన్ని గంటల తర్వాత నా అకౌంట్ పోయింది. అప్పటి నుంచి దాన్ని పునరుద్ధరించలేదు" అని ఆమె విచారం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, @UNITEDSTRIPPER
పోల్‌డాన్స్ హ్యాష్‌ట్యాగ్‌లపై చర్యలు
వేసవిలో పోల్‌డాన్సింగ్ హ్యాష్‌ట్యాగ్‌లపై ఇన్‌స్టాగ్రామ్ చర్యలు చేపట్టింది. తర్వాత దీనికి వ్యతిరేకంగా 'ఎవ్రీబాడీవిజిబుల్' పేరుతో ఒక ఉద్యమం మొదలైంది. దీనిని ప్రారంభించినవారిలో పోల్ డాన్సర్, బ్లాగర్ 'బ్లాగర్‌ఆన్‌పోల్' ఒకరు.
అప్పట్లో పోల్‌డాన్సింగ్, ఫిమేల్ ఫిట్నెస్ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు సర్చ్‌లో కనిపించలేదు.
తన విధానాన్ని మార్చినందుకు ఇన్‌స్టాగ్రామ్ తర్వాత క్షమాపణలు చెప్పింది. అయితే మార్గదర్శకాలకు విరుద్ధమైన కంటెంట్ పెట్టడానికి ఉపయోగించే అవకాశమున్న హ్యాష్‌ట్యాగ్‌లను అడ్డుకుంటోంది.
ఉద్యమకారులు దీనిని సెన్సార్షిప్‌లో అతిగా చెబుతున్నారు. ఇది సెక్స్ వర్కర్లను, సెక్స్ అధ్యాపకులను, పోల్ డాన్స్ సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
"సెలబ్రిటీలు వారి ఫొటోలు ఉంచుకోవచ్చు. కానీ మేం బికినీలో పనిచేస్తున్న ఒక వీడియో కూడా పోస్ట్ చేయకూడదు. మనం మన శరీరాన్ని ఎలా అయినా, విద్య కోసం, లేదా బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు ఏం చేయలేరు. ఎందుకంటే సోషల్ మీడియా అలాగే నడుస్తుంది" అని బ్లాగర్ ఆన్ పోల్ రాశారు.
లండన్‌లోని సిండ్రెల్లా జివెల్స్ అనే మరో పోల్ డాన్సర్ తన పోల్ జర్నీని ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తానని, కానీ తన ఖాతాను తొలగించి, తన పోస్టులు కనిపించకుండా చేయడం వల్ల అది తన పనిపై, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిందని అన్నారు.
"అది మనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదేమో, మనం చేసేది ప్రజలకు వ్యతిరేకంగా ఉందేమో అనిపించేలా చేస్తుంది" అన్నారు సిండ్రెల్లా.
ఇవి కూడా చదవండి:
- బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ ఉండే కుబేరుల నగరానికి ఆర్థిక కష్టాలు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- మహారాష్ట్ర: ఏ పార్టీ ఏం ఆశిస్తోంది... గతంలో ఇలాంటి సందర్భాలలో కోర్టు ఏం చెప్పింది?
- BHU: మతానికి, భాషకు సంబంధం ఉందా.. సంస్కృతం బోధించే ప్రొఫెసర్ హిందువే కావాలన్న డిమాండ్ కరెక్టేనా?
- టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ: 'డిపోల వద్ద శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు' - ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
- పీఎస్ కృష్ణన్: ఉద్యోగాన్ని సామాజిక ఉద్యమంలా చేసిన బడుగు వర్గాల బాంధవుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








