BHU: మతానికి, భాషకు సంబంధం ఉందా.. సంస్కృతం బోధించే ప్రొఫెసర్ హిందువే కావాలన్న డిమాండ్ కరెక్టేనా? - అభిప్రాయం

సంస్కృతం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, గణేష్ దేవీ
    • హోదా, సాహిత్య విమర్శకుడు, సాంస్కృతిక విశ్లేషకుడు

సుమారు 70 వేల ఏళ్ల క్రితం మానవ సమాజం తన ఆలోచనలను వ్యక్తపరిచేందుకు భాషను వినియోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం మనకు తెలిసిన మతాలు, దేవుడి గురించి చెప్పే సిద్ధాంతాలు దాదాపు రెండు- మూడు వేల సంవత్సరాల నుంచి మొదలయ్యాయి. అంటే, భాషకు, మతానికి మధ్య ఎలాంటి తార్కిక సంబంధం లేదని దీని అర్థం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,000 భాషలు మాట్లాడుతున్నారు. కానీ, ప్రధానమైన మతాల సంఖ్య ముప్పైకి మించి లేదు. కాబట్టి, ఫలానా మతానికి, ఫలానా భాషకు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి వాస్తవ ఆధారం లేదు.

భారత్‌లో కులాలు, తెగలు, సామాజిక సముదాయాలపై కె.ఎస్. సింగ్ ఒక సర్వే చేశారు. ఆ విషయాలను 'ది పీపుల్ ఆఫ్ ఇండియా' అనే శీర్షికతో 1980ల్లో కొన్ని సంపుటాలుగా విడుదల చేశారు.

భారతదేశంలో దాదాపు 4,000 కులాలు- తెగలు- సముదాయాల ఉనికిని ఆ పత్రాలు వెల్లడించాయి. దేశంలోని ప్రధాన మతాలను పరిశీలిస్తే, ప్రతి మతానినీ కనీసం 500 కులాలు, తెగలు అనుసరిస్తున్నాయి. కాబట్టి, ఏ మతమూ ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టమవుతుంది.

లాజికల్‌గా చూస్తే, ఏ భాషకూ ఏ ఒక్క మతంతోనూ, సామాజిక వర్గంతోనూ పరస్పర సంబంధం లేదు. అలాంటి సంబంధం ఏదైనా ఉన్నట్లు ఆధారాలున్నా, అది ఏదైనా ఒక నిర్దిష్ట చారిత్రక సందర్భం నుంచి ఉద్భవించి ఉంటుంది.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, BHU.AC.IN

హిబ్రూ, లాటిన్, ఇంగ్లిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ క్రైస్తవ మత భాషలు అని చెప్పడం కష్టం. ఒకవేళ, ఫ్రెంచ్ మాట్లాడేవారు క్రైస్తవ మతం గురించి మాట్లాడొద్దని ఇటాలియన్లు అనడం మొదలుపెడితే, అది హాస్యాస్పదం అవుతుంది.

అలాగే, బౌద్ధ మతం భాష పాలి అనో, చైనీస్ అనో, జపనీస్ అనో చెప్పలేం. మతం అనేది ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించినది అయితే; భాష అనేది సంభాషణలకు మాధ్యమం. ఒక మతం చెప్పే భావనలను రకరకాల భాషలలో వ్యక్తపరచవచ్చు.

ఒక భాషను అనేక రంగాలలో ఉపయోగిస్తారు. విద్యా బోధన కోసం, ఆలోచనలను పంచుకునేందుకు, సాహిత్యం, కళలు, శాస్త్రాలు, వ్యాపారం, ప్రభుత్వం వ్యవహారాలు, క్రీడలు, వినోదం... ఇలా విభిన్న రంగాలలో భాష ఉపయోగపడుతోంది.

బనారాస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన
ఫొటో క్యాప్షన్, బనారాస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన

వ్యాపారంలో సంస్కృతం లాంటి భాషనే ఉపయోగించాలంటే, తెలివైన వ్యాపారవేత్త ఎవరూ క్రైస్తవులను, యూదులను, బౌద్ధులను వదులుకునేందుకు ఇష్టపడరు. ఆయుర్వేదానికి సంబంధించి వాస్తవ గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నప్పటికీ, ఆయుర్వేద వైద్యులందరూ ముస్లిం లేదా క్రైస్తవ రోగులకు వైద్య చేసేటప్పుడు సంస్కృతంలోనే మాట్లాడాలన్న షరతు ఏమీ లేదు.

ఒక పాఠశాలలో రష్యన్ లేదా చైనీస్ బోధించాలి అన్నప్పుడు, ఆ తరగతి గదిలో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థులు మాత్రమే ఉండాలని ఎవరూ పట్టుబట్టరు. అలాగే, సంస్కృతం బోధించే అధ్యాపకుడు హిందూ మతాన్ని అనుసరించేవారే అయ్యుండాలని పట్టుబట్టడం హాస్యాస్పదంగా ఉంది.

పాఠశాల
ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఉన్న ఈ పాఠశాలలో ముస్లిం చిన్నారులు సంస్కృతం అలవోకగా మాట్లాడుతారు

ఈ డిమాండ్ నిరాధారమైనది, అశాస్త్రీయమైనది, అజ్ఞానంతో కూడినది. సంస్కృత భాషా చరిత్రలో, హిందూ మతం నమ్మకాలను, సంప్రదాయాలను సవాలు చేసిన చార్వాక్ లాంటి బలమైన నాస్తికులు ఉన్నారు.

బౌద్ధ తత్వవేత్త అశ్వఘోష్ రచించిన పురాణ బుద్ధచరితకు సంస్కృత సాహిత్య చరిత్రలో గౌరవ స్థానం ఉంది. అశ్వఘోష్ బుద్ధుడిని అనుసరించేవారు అయినా, ఆయన గౌరవ స్థానం ఏనాడూ తగ్గలేదు.

'ది సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్' అనే ప్రసిద్ధ సంపుటాలను ప్రచురించిన, ఋగ్వేదాన్ని మొదటిసారి అచ్చువేసిన ఫ్రెడ్రిక్ మాక్స్ ముల్లర్, హిందువు కాదు. కానీ, మాక్స్ ముల్లర్ అచ్చువేసినందున ఋగ్వేదంను ఏ హిందూ మేధావీ అగౌరవపరచలేదు.

మాక్స్ ముల్లర్ ముద్రించిన ఋగ్వేదంను స్వామి వివేకానంద, లోక్‌నాయక్ తిలక్, యోగి అరవింద్ చదివి, దాని మీద మాట్లాడారు కూడా. హిందూయేతరుడైన మాక్స్ ముల్లర్ సంస్కృతాన్ని చదవలేరని వాళ్లెవరూ గుడ్డిగా వాదించలేదు.

సంస్కృతాన్ని హిందువులు తప్ప మరెవరూ చదవలేరని అనేవారు మానసిక అస్థిరతతో బాధపడుతున్నవాళ్లే అయ్యుంటారు. ప్రస్తుతం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించేందుకు ఫిరోజ్ అనే ప్రొఫెసర్‌ను నియమించడానికి వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేస్తున్నారు.

ఈ నిరసనలు వారి మానసిక అస్థిరతను సూచిస్తున్నాయి. నిజానికి, భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి డిమాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా పరిగణించాలి, డిమాండ్ చేస్తున్నవారిని శిక్షించాల్సి ఉంది. రాజ్యాంగాన్ని ఉత్తర ప్రదేశ్ పాలకవర్గం ఎంతమేరకు గౌరవిస్తుందన్నది వేరే విషయం. ఇది భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని చెప్పడానికి ఇదో వాస్తవ సంకేతం.

కానీ, ఈ వ్యవహారాన్ని భాషాశాస్త్రం తార్కిక కోణం నుంచి చూస్తే... ముస్లింలకు, సంస్కృతానికి మధ్య 'వైరుధ్యాల' మీద జరుగుతున్న చర్చ పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది.

వివేకానందుడు
ఫొటో క్యాప్షన్, హిందూయేతరుడైన మాక్స్ ముల్లర్ సంస్కృతాన్ని చదవలేరని స్వామి వివేకానంద లాంటివారు ఎన్నడూ వాదించలేదు

మధ్య యుగాలను 'స్టాటిక్ అండ్ డార్క్'గా పరిగణిస్తుంటాం. కానీ, ఆ కాలంలోనూ ఇలాంటి చర్చలను మూర్ఖమైనవిగా, అసంబద్ధమైనవిగా చూసేవారు.

21వ శతాబ్దంలో ఇలాంటి చర్చలు జరగడం, భారత ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే. ఇవన్నీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరుగుతుండటం బాధాకరం.

ఈ విశ్వవిద్యాలయం గత ఎనిమిది తొమ్మిది దశాబ్దాల కాలంలో సంస్కృత పరిశోధనలో ఎంతో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం జరుగుతున్న అసంబద్ధమైన వివాదం ఆ ఘన చరిత్రకు ఒక మచ్చ లాంటిది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)