కాపీ కొట్టకుండా విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు.. అధికారులతో చీవాట్లు తిన్న అధ్యాపకుడు

అట్టపెట్టెలతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, ImranQureshi

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కర్నాటకలో ఓ కాలేజీలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్టపెట్టెలు అమర్చడం వివాదాస్పదమైంది. దీంతో ఇందుకు బాధ్యుడైన నిర్వాహకుడు అధికారులకు క్షమాపణ చెప్పారు.

హవేరీ నగరంలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల మిడ్ టెర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించగా విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకంటూ ఓ అధ్యాపకుడు వారి తలలకు అట్టపెట్టెలు అమర్చారు.

నాలుగు వైపులా మూసి ఉన్న అట్టపెట్టెలకు ఒక వైపు ముఖం వెడల్పున రంథ్రం చేసి వాటిని విద్యార్థుల తలలకు పెట్టారు. అలా చేయడం వల్ల వారు ఎదురుగా ఉన్న ప్రశ్నపత్రం, జవాబు పత్రం తప్ప పక్కకు తిరిగి చూడడానికి వీలుండదన్న ఉద్దేశంతో వారు ఈ పనిచేశారు.

విద్యార్థులు అలా పరీక్షలు రాస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి అధికారులు స్పందించారు. విద్యార్థులతో అలా పరీక్షలు రాయించిన నిర్వాహకుడు ఎం.బి.సతీశ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన క్షమాపణ చెబుతూ లేఖ రాశారు.

''ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ చేయబోనని జిల్లా ఉప కమిషనర్‌కు రాత పూర్వకంగా క్షమాపణ చెప్పాను'' అని సతీశ్ బీబీసీతో చెప్పారు.

అట్టపెట్టెలతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, ImranQureshi

అయితే, సతీశ్ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాను విద్యార్థుల సమ్మతితోనే అలా చేశానని, వారే అట్టపెట్టెలు తెచ్చుకుని తలలకు తగిలించుకుని పరీక్షలు రాశారని ఆయన అన్నారు.

''ఇలా చేయమని ఎవరినీ బలవంతం చేయలేదు. ఆ ఫొటోల్లో చూస్తే కొందరు అట్టపెట్టెలు పెట్టుకోని విద్యార్థులూ కనిపిస్తారు. కొందరు కాసేపు పెట్టుకుని తరువాత తీసేశారు. కానీ, ఆ ఫొటో వైరల్ అయిపోయింది'' అన్నారాయన.

''ఇది కేవలం ప్రయోగపూర్వకంగా చేశాం. జపాన్, చైనాల్లో ఇది సర్వసాధారణం. ముంబయిలోనూ ఇలా కొన్ని చోట్ల చేసినట్లు వార్తలొచ్చాయి'' అన్నారు సతీశ్.

ఈ వ్యవహారంపై ప్రీ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌సీ పీర్జాదా మాట్లాడుతూ.. ''సతీశ్ సోషల్ మీడియా స్టేటస్‌లో ఈ చిత్రం చూడగానే నేను వెంటనే పరీక్ష జరుగుతున్న గదికి వెళ్లాను. నేను వెళ్లేటప్పకి కూడా కొందరు విద్యార్థులకు తలలకు అట్టపెట్టెలున్నాయి. కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరుగుతున్నాయి అప్పుడు'' అన్నారు.

''బిహార్లోని ఒక కాలేజీలో ఇలాంటి విధానం పరీక్షించి చూసినట్లు పేపర్లలో చదివానని, అందుకే తానూ ప్రయోగాత్మకంగా ఇలా చేశానని సతీశ్ నాతో అన్నారు'' అని చెప్పారాయన.

ఇలాంటి పద్ధతులతో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

''ఇలా చేసేటప్పుడు పిల్లలకు ఏం చెప్పారన్నది కీలకం. సరదా కోసమే అని చెబితే ఫరవాలేదు. అంతేకానీ, మీరంతా కాపీ కొడుతున్నారు కాబట్టి ఇలా చేయండి అంటే మాత్రం అది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచం తమను నమ్మడం లేదన్న భావన వారిలో ఏర్పడుతుంది'' అని సైకాలజిస్ట్ అచిరా చటర్జీ 'బీబీసీ'తో అన్నారు.

ఈ ఘటన అధ్యాపకుల అసమర్థతకు అద్దం పడుతందని, విద్యార్థులు మోసం చేస్తారన్న భావనలో అధ్యాపకులు ఉండడం వల్ల ఇలాంటిది జరిగిందని.. ఒకవేళ నిజంగా విద్యార్థులు మోసం చేసినా దాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కాపీ కొట్టకుండా పరీక్షలు రాయాలన్న బుద్ధిని విద్యార్థులకు అందించలేకపోవడం అధ్యాపకుడి వైఫల్యమని, విద్యార్థులకు ఇలాంటి శిక్ష వేయడం సరైంది కాదని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)