World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న

ఫొటో సోర్స్, BBC/Getty Images
''మనం అరబ్బులం కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మూడు వస్తువులు మర్చిపోకుండా తీసుకెళ్లాలి. అవి పాస్‌పోర్ట్, డబ్బు, పోర్టబుల్ బిగెట్'' అని ఈజిప్ట్ కమెడియన్ బసీమ్ యూసఫ్ జూన్ నెలలో బ్రిటన్‌లో తన తొలి ప్రదర్శన సందర్భంగా జోక్ వేశారు.
అలా జోక్ వేస్తూ ఆయన షత్తాఫ్(బమ్ గన్) అని పిలిచే ఒక పిచికారీ గొట్టాన్ని దాటుకుని ముందుకు కదిలారు.
''మీరు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవారు. కానీ వెనక్కి సంబంధించిన ఆ విషయానికొస్తే వెనుకబడే ఉన్నారు.''
చాలామంది ప్రజలు యూసఫ్ మాటలతో అంగీకరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
చాక్లెట్ పుడ్డింగ్ అయితే ఇలా తుడుచుకుంటారా?
చాలా పాశ్చాత్య దేశాల్లో టాయిలెట్‌కి వెళ్లిన తరువాత కడుక్కోకుండా తుడుచుకుంటారన్న విషయం ప్రపంచంలో ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
పేపరుతో తుడుచుకోవడం కంటే నీటితో కడుక్కుంటే మరింత శుభ్రంగా ఉంటుంది. అందుకే.. నీటితో తమ వెనుకభాగాన్ని కడుక్కునే అలవాటున్నవారు ''మీ మూతికి అంటుకునే చాక్లెట్ పుడ్డింగ్‌ను కేవలం కాగితంతో తుడిచి వదిలేస్తారా?'' అని అడుగుతారు.
ప్రాచీన గ్రీకులు శుభ్రం చేసుకునే పింగాణీ పెంకులు, వలసరాజ్యాల అమెరికన్లు వాడిన గింజలు తీసిన మొక్కజొన్న కండెలతో పోల్చితే ప్రస్తుతం పాశ్యాత్యులు వినియోగిస్తున్న టిష్యూ పేపర్ ఎంతో మృదువైనదే. అయితే, నీరయితే ఆ మాత్రం ఇబ్బంది కూడా ఉండదన్నది అందరూ అంగీకరించేమాట.
అందుకే చాలా దేశాల్లో నీటినే వాడుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పారిశుద్ధ్య సామ్రాజ్యవాదం
ప్రపంచానికి బిడెట్ అనే పదాన్ని పరిచయం చేసింది ఫ్రెంచ్ వారు. బిడెట్ అంటే టాయిలెట్‌కి వెళ్లిన తరువాత కడుక్కోవడానికి నీటిని పిచికారీ చేసే చిన్న పరికరం. ఈ టాయిలెట్ ఉపకరణం ఫ్రాన్స్‌లో పెద్దగా పాపులర్ కానప్పటికీ ఇటలీ, అర్జెంటీనాల్లో మాత్రం బాగా వాడుకలో ఉన్నాయి. కమెడియన్ యూసఫ్ చెప్పిన బమ్‌గమ్ ఫిన్లాండ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక అమెరికా, బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాల్లో టిష్యూ పేపర్ల వినియోగమే ఎక్కువ.
ఆధునిక బాత్‌రూం సంస్కృతిపై బ్రిటన్, అమెరికాలు ఎక్కువ ప్రభావం చూపాయని ఆర్కిటెక్చర్ చరిత్రకారిణి బార్బరా పెన్నర్ తాను రాసిన 'బాత్ రూం' పుస్తకంలో పేర్కొన్నారు.
నిజానికి 1920ల్లో ఆంగ్లో-అమెరికన్ బాత్‌రూం ధోరణులు ప్రపంచవ్యాప్తమయ్యాయి. దాన్నే పారిశుద్ధ్య సామ్రాజ్యవాదం అనేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లిం దేశాల్లో నీరే వాడుతారు
మల విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలని ఇస్లాం సూచిస్తున్నందున ముస్లిం దేశాల్లో నీటినే వినియోగిస్తారు.
నీరు వాడాలా.. కాగితమా? అనే అంశంపై ఆసక్తి ఉన్న జుల్ ఓత్‌మేన్ అనే ఆస్ట్రేలియా ఉద్యోగి టాయిలెట్లలో సౌకర్యాలకు సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక ధోరణులపై పరిశోధన చేశారు.
కొంతమంది ముస్లిం ఆస్ట్రేలియన్లు నీరు, టాయిలెట్ పేపర్ రెండింటినీ ఉపయోగిస్తారని ఆమె పరిశోధనలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
20 పౌండ్ల నోటుతో
గత రెండేళ్లుగా శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో నివసిస్తున్న ముంబయికి చెందిన డాటా సైంటిస్ట్ ఆస్తా గార్గ్ మాట్లాడుతూ టాయిలెట్‌లో వాడేందుకు మగ్ కొనేందుకు ఎన్ని దుకాణాలు తిరిగినా దొరకలేదని.. చివరకు భారతీయ దుకాణంలో అది దొరికిందని చెప్పారు.
''కొంతమంది భారతీయులు కూడా టాయిలెట్ పేపర్ వాడకానికి అలవాటుపడతారు. కానీ, నీరు దొరికినప్పుడు మాత్రం నీరే వాడుతారు'' అన్నారామె.
''అమెరికాలో ఒక భారతీయ మిత్రుడి ఇంటికి వెళ్లినప్పుడంతా అక్కడ టాయిలెట్ సీట్ పక్కన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ బకెట్‌లో నీరు కానీ ఉంటుంది'' అన్నారామె.
పాశ్యాత్యులు కాగితం తుడుచుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందని.. బ్రిటన్‌లోని షెఫీల్డ్స్‌లో ఉండే తన క్లాస్‌మేట్ ఒకసారి టాయిలెట్ పేపర్ అయిపోతే 20 పౌండ్ల నోటుతో తుడుచుకోవడం తెలుసని ఓత్‌మన్ చెప్పారు.
సంగీతకారుడు, పాడ్‌కాస్టర్ అయిన కైజర్ కుయో కుటుంబం దీనికి ఒక హైబ్రీడ్ పరిష్కారం కనుగొంది. మూడేళ్ల కిందట వారు బీజింగ్ నుంచి అమెరికా వెళ్లారు. వారు కొన్ని చైనా అలవాట్లు అలాగే కొనసాగిస్తూ అమెరికా అలవాట్లనూ నేర్చుకున్నారు.
అమెరికన్ల విధానాన్ని అలవాటు చేసుకున్న తన పిల్లలు ఎంత టాయిలెట్ పేపర్ వాడుతున్నారో చూసి కుయో ఆశ్చర్యపోయారట.
మిగతా దేశాల వారికంటే అమెరికన్లు ఎక్కువగా టాయిలెట్ పేపర్ వాడుతారు. అక్కడ సగటున ప్రతి వ్యక్తి ఏడాదికి 141 రోల్స్ పేపర్ వాడుతారు.
వాడిపడేసే టాయిలెట్ పేపర్ల కారణంగా మరుగుదొడ్లలో సమస్యలు తలెత్తుతాయని.. అమెరికాలో 25 శాతం మరుగుదొడ్లకు ఈ సమస్య ఉందని ఆస్తా గార్గ్ చెప్పారు.
కుయో కుటుంబం ఇప్పుడు టాయిలెట్ పేపర్ వాడకం తగ్గించి ఫ్లష్ చేయడానికి వీలైన వెట్ వైప్స్ వాడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా కూర్చోవాలి..?
టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు ఎలా కూర్చోవాలన్న చర్చా ఒకటుంది. పాశ్చాత్య శైలి టాయిలెట్ సీట్లయితే కుర్చీలో మాదిరి కూర్చుంటారు. అదే, సాధారణ టాయిలెట్ సీట్లయితే నేలన కూర్చున్నట్లుగా(స్క్వాట్) ఉంటాయి.
మానవ శరీర నిర్మాణం ప్రకారం చూస్తే సాధారణ టాయిలెట్ సీట్లపై కూర్చునే విధానంలోనే మల విసర్జన సాఫీగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీనిపై ఒక్కో దేశంలో ఒక్కో అలవాటు, పద్ధతి ఉంది. చైనాలో ఎక్కువగా సాధారణ టాయిలెట్ సీట్లే వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మూడింట రెండొంతులు ఇవే వాడుకలో ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- హ్యాకింగ్: భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- మలం మ్యూజియం: రోజూ వెయ్యి మందికి పైగా సందర్శకులు వస్తున్నారు
- అమెరికాలో తాజా నత్తల వ్యాపారం: గ్రీన్హౌస్ ఫామ్‌ల్లో నత్తల్ని సాగుచేసి రెస్టారెంట్లకు అమ్ముతున్న హెలీకల్చరలిస్ట్
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- యూఎస్ఎస్ గ్రేబ్యాక్: 75 ఏళ్ల తర్వాత దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జలాంతర్గామి
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








