కాంగో: ప్రపంచంలో మొబైల్ డేటా ధరలు ఎక్కువగా ఉంది ఈ దేశంలోనే.. డేటా కోసం తిండి మానేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గయాస్ కోవెనీ
- హోదా, బీబీసీ న్యూస్, కిన్షాసా
కాంగో యూనివర్సిటీలో చదువుతున్న బొన్హర్ మలెంగాకు గత నెలలో చిన్న సంశయమేర్పడింది. అప్పటికి ఆయన బాగా ఆకలితో ఉన్నాడు. అప్పుడే ఆయనకు మొబైల్ డేటా కావాల్సొచ్చింది. తన దగ్గరున్న డబ్బుతో భోజనం చేయాలా లేదంటే ఒక రోజుకి సరిపడా డేటా కొనుగోలు చేయాలా అని ఆయన ఆలోచించాడు.
27 ఏళ్ల మలెంగా ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. తన ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులపై ఆధారపడుతుంటాడు, అయితే, పరిశోధక విద్యార్థి కావడంతో తన చివరి విద్యాసంవత్సరంలో సమర్పించాల్సిన పరిశోధన పత్రం సిద్ధం చేయడం కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాడాయన.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసాలో మలెంగా ఉంటున్నాడు. అక్కడ ఇంటర్నెట్ కావాలంటే మొబైల్ డాటా ఉండాల్సిందే. అక్కడి ప్రజలు తమ సగటు ఆదాయంలో 26 శాతం వెచ్చిస్తే కానీ మొబైల్ డేటా పొందలేరు.
''ఒక పగలు, రాత్రి భోజనం లేకపోతే నేనేమీ చచ్చిపోను. అందుకే భోజనం మానేసి డేటా కొనుక్కున్నాను'' అని బీబీసీతో చెప్పాడాయన.
తన స్నేహితులు కూడా చాలామంది అదే పని చేస్తారని మెలెంగా తెలిపారు.

ఒక జీబీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా ఎక్కడ చవక ఎక్కడ ప్రియం?
'అలయన్స్ ఫర్ అఫర్డబుల్ ఇంటర్నెట్' సంస్థ ఇచ్చిన 'అఫర్డబులిటీ రిపోర్ట్-2019' ప్రకారం ప్రపంచంలో డేటాబాగా ఖరీదుగా ఉన్న దేశాల్లో డీఆర్ కాంగో ఒకటి. సగటు ఆదాయంలో 2 శాతం కంటే ఎక్కువ డేటా కోసం ఖర్చు చేస్తే అది ఖరీదేనని ఈ నివేదిక చెబుతోంది. అలాంటిది కాంగోలో డాటా కోసం సగటు ఆదాయంలో 26 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాజధాని కిన్షాసాకు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బుకావుకి చెందిన ఎరిక్ కసింగా డేటా విషయంలో తనకు ఎదురైన ఒక విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
నెదర్లాండ్స్‌లోని ఒక యూనివర్సిటీలో పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కొద్దిరోజుల కిందట ఆయన ఒక సైబర్ కేఫ్‌కి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవం అది.

'ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. గంటలో పూర్తికావాల్సిన దరఖాస్తు ప్రక్రియకు మూడు గంటలు పట్టింది. నా దగ్గర గంట పాటు ఇంటర్నెట్ వాడుకోవడానికి సరిపడా డబ్బులే ఉన్నాయి. కానీ, దరఖాస్తు పూర్తయ్యేసరికి మూడు గంటలైంది. తరువాత తెచ్చి ఇస్తానని సైబర్ కేఫ్ యజమానికి చెప్పాను. ఆయన నాపై రంకెలేశాడు. చివరకు నా కొత్త షూస్ తీసుకుని నన్ను వదిలిపెట్టాడు'' అని గుర్తు చేసుకుంటూ ఆ రోజు చాలా అవమానపడ్డాను అన్నాడాయన.
జనాభా రీత్యా కాంగో ఆఫ్రికాలో నాలుగో పెద్ద దేశం. స్మార్ట్‌ఫోన్ల తయారీలో వినియోగించే ఖనిజాలు ఆ దేశంలో విస్తారంగా ఉన్నాయి.
అక్కడి ప్రజల్లో చాలామందికి రక్షిత తాగునీరు, కరెంటు, ఆరోగ్య సదుపాయాలు వంటివేమీ అందుబాటులో లేవు.
ఇంటర్నెట్ అంటే వారికి విలాసవంతమైన సౌకర్యం కిందే లెక్క. కాంగోలీస్ పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేషన్ అథారిటీ లెక్కల ప్రకారం ఆ దేశంలో 17 శాతం మందికే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.

మరోవైపు ఆన్‌లైన్ యాక్సెస్ విషయంలో ఆఫ్రికా దేశాల్లో జండర్ గ్యాప్ భారీగా ఉందని మరో నివేదిక వెల్లడించింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాల్లో 33.8 శాతం మంది పురుషులు ఆన్‌లైన్ యాక్సెస్ చేస్తుంటే మహిళల్లో ఆ శాతం 22.6 మాత్రమే.
డీఆర్ కాంగోలో ఇంటర్నెట్ ధరలు భారీగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని కిన్షాస్‌కు చెందిన డిజిటల్ రైట్స్ నిపుణుడు కోజో డుకుమా చెప్పారు.
1) ఎంత ధర ఉండాలన్న విషయం ఎవరికీ తెలియదు
'టెలికం సంస్థలు పెట్టే పెట్టుబడి, నిర్వహణ వ్యయం, ఎంతమంది ఖాతాదారులున్నారన్నదాన్ని బట్టి ధరలు నిర్ణయమవుతాయి. అయితే, ఇవన్నీ వాయిస్ కాల్స్‌కి సంబంధించి వేసే లెక్కలు. ఇంటర్నెట్ విషయంలో ఈ లెక్కలు వేయడం లేదు. దాంతో నియంత్రణ సంస్థలు ధరలకు పరిమితి విధించలేకపోతున్నాయి. పరిమితి లేకపోవడంతో టెలికం సంస్థలు ఇష్టమొచ్చిన ధరలు వసూలు చేస్తున్నాయి'' అన్నారు కోజో.
2) పోటీ లేకపోవడం
'చాలా కాలంగా కాంగోలో టెలికం సంస్థలు, వినియోగదారుల సంఖ్యలో మార్పు లేదు. కొన్ని సంస్థలే డేటా అందిస్తుండడంతో వారంతా ఒక్కటై నచ్చిన ధరలకు అమ్ముకుంటున్నారు. 2016లో కాంగోలోని అన్ని టెలికం సంస్థలు ఏకమై ధరలు 500 శాతం పెంచాలని నిర్ణయించాయి'' అని చెప్పారు.
3) పన్ను భారం ప్రజలకి బదిలీ
''స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాలకు టెలికం సంస్థలు ఇక్కడ పన్నులు కడుతున్నాయి. ఆ పన్నుల భారమంతా వినియోగదారులపైనే మోపుతున్నాయ''ని చెప్పారు కోజో.
కాంగోలో ఇంటర్నెట్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో యువత 'లా లూచా' పేరుతో ఉద్యమిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది.
మార్చి, అక్టోబరు మధ్య ఈ లా లూచా గ్రూప్ ఇంటర్నెట్ ధరలు తగ్గించాలంటూ 11 ఆందోళనలు చేసింది.
టెలికం సంస్థలను ఆదేశించడానికి కొన్ని పరిమితులున్నాయని నియంత్రణ సంస్థలు మాతో చర్చల సమయంలో చెప్పాయని ఆ గ్రూప్‌కు చెందిన బీన్వెను మతూమో చెప్పారు. ''మేం దారుణంగా మోసపోతుంటే చూడడం మాని ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని ఏదో ఒకటి చేయాలి'' అని మాతుమో డిమాండ్ చేశారు.

ఎంత డబ్బు పెట్టినా నాణ్యత లేని డేటానే
ఎన్ని ఆందోళనలు జరిగినా పరిస్థితుల్లో అప్పుడే మార్పు వస్తుందని అనుకోవడం లేదని కాంగోకు చెందిన మహిళా వ్యాపారవేత్త వనెస్సా బాయా చెప్పారు. మార్కెటింగ్ వ్యాపారం చేసే ఆమె తన వ్యాపార అవసరాల కోసం ఇంటర్నెట్ వాడుతుంటారు.
ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటుందిక్కడ. అందుకే రెండు వేర్వేరు ఆపరేటర్లకు చెందిన ఇంటర్నెట్ సర్వీసులు వాడుతూ ఏది బాగుంటే దానికి మారుతూ పనులు పూర్తిచేస్తాం అంటారామె.
అసలే ఎక్కువ ఖర్చున్న ఇలాంటి చోట రెండు వేర్వేరు సంస్థల ఇంటర్నెట్ ప్యాకేజీలు కొనుగోలు చేయడం భారమే, ఇందుకోసం ఇతర అవసరాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.
''నేను ఇంటర్నెట్ వాడుతూ మా ఉత్పత్తుల క్యాటలాగ్‌ను క్లయింట్లకు పంపించినా వారిలో చాలామంది ఇంటర్నెట్ సక్రమంగా అందుబాటులో లేక డౌన్‌లోడ్ చేసుకోరు'' అన్నారు వనెస్సా బాయా.
ఇవి కూడా చదవండి:
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- 'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








