అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?

ఫొటో సోర్స్, Mansi Thapliyal
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్య వివాదంలో శ్రీరాముడి ప్రతినిధిగా ఈయన పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టు పత్రాలలో త్రిలోకి నాథ్ పాండే పేరు 'రామ్ లల్లా' ప్రతినిధిగా ఉంది.
అయోధ్య స్థల వివాదంలో ఈయన కూడా ఒక పిటిషనర్. భారత అత్యున్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9 శనివారం నాడు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
''దేవుడికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం. కోట్లాది మంది హిందువులలో నన్నే ఎన్నుకోవడం గర్వంగా, సంతోషంగా ఉంది'' అని 75 ఏళ్ల పాండే నాతో చెప్పారు.
భారతీయ చట్టంలో శతాబ్దాలుగా దైవం లేదా విగ్రహాన్ని''న్యాయ కోవిదుడు"గా పరిగణిస్తారు, ఎందుకంటే, పుణ్యక్షేత్రాలకు పర్యాయపదంగా ఉన్న విగ్రహాలకు చాలా మంది భక్తులు తమ భూమిని, ఆస్తులను దానం చేస్తారు. సాధారణంగా దేవుడి ఆస్తులను భక్తుడు లేదా పుణ్యక్షేత్రం లేదా ట్రస్ట్ మేనేజర్ నిర్వహిస్తాడు. హిందూధర్మంలో విగ్రహాన్ని దేవుడి ప్రతినిధిగా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
కానీ, దేవుడికి ఏం కావాలో మీరు ఎలా చెప్పగలరు? దేవుని ప్రయోజనాలకు అనుగుణంగా అతను వ్యవహరిస్తున్నారని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?
ఇవి గమ్మత్తైన విషయాలు. వీటి గురించి చట్టంలో ఎప్పుడూ నిర్వచించలేదు. కేసును బట్టి ఇలాంటి వాటిని పరిగణిస్తారు. కానీ, సాధారణంగా వేరే వ్యక్తి, నేను కూడా దేవుడి ప్రతినిధిని అని చెప్పుకోనంతవరకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి పేచీ ఉండదు.
లక్షలాది మంది హిందువులు గౌరవించే దేవుడికి న్యాయం చేయడానికి పాండే మాట్లాడుతున్నారు.
రాముడి ప్రతినిధి పిటిషన్‌పై దేశంలోని కొందరు ప్రముఖ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Mansi Thapiyal
వివాదాస్పదమైన ప్రాంతం రాముడి జన్మస్థలమని, అప్పటి అధికారగణం నిర్వహించిన రికార్డుల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతారు. ఆ ప్రాంతంలో పూజించేవారికి ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుందని పిటిషనర్‌లలో ఒకరు చెప్పారు.
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాబట్టి ఆ భూమి మీద హక్కు ఆయనకే ఉంటుందనేది పాండే వాదన.
మసీదు నిర్మించక ముందే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని హిందువుల విశ్వాసం, నమ్మకమని న్యాయమూర్తులు సైతం తమ తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో శ్రీరాముడి ప్రతినిధిగా ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో పాండే ఒకరు. 1989 నుంచి ఆయన ఈ విషయంపై కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కంటే ముందున్న ఇద్దరు ప్రతినిధులలో ఒకరు హైకోర్టు జడ్జీ, మరొకరు లెక్చరర్. వారిద్దరు చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయ సహాయం
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో పాండే జన్మించారు. నలుగురు పిల్లలలో పెద్దవాడు, అక్కడే కళాశాల స్థాయి వరకు హిందీలో చదువుకున్నారు. తరువాత ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందారు. కానీ, ఉద్యోగం చేయలేదు.
హైస్కూల్‌లో చదువుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత
బాబ్రీ మసీదు కూల్చివేతతో సంబంధం ఉన్న వీహెచ్‌పీతోనూ ఆయన కలసి పనిచేశారు. వీహెచ్‌పీతో ఉన్న కాలంలో హిందువులలో చైతన్యం నింపడానికి ఆయన ఉత్తర ప్రదేశ్ అంతటా పర్యటించారు.
''ఏదైనా ప్రాంతంలో హిందువులను భారీస్థాయిలో ముస్లింలుగా మార్చినట్లు తెలిస్తే, అక్కడికి వెళ్లేవాడ్ని. మతం మారడాన్ని ఆపేవాడ్ని. హిందూ సమాజం క్షీణించిందని నేను నమ్ముతున్నాను. హిందువుల గర్వాన్ని పెంచడానికి దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని, రక్షణాత్మక ధోరణిలో ఉండొద్దని భావిస్తున్నా'' అని పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చక్కటి జ్ఞాపకం
మసీదు కూల్చివేతలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 49 మందికి పాండే న్యాయ సహాయం అందించారు. (ఒక కేసు పూర్తి కావడానికి 17 ఏళ్లు పట్టింది. కొన్ని క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.)
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పాండే, సుప్రీం కోర్టులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన తుది విచారణకు క్రమం తప్పకుండా హాజరయ్యారు.
''నేను గత పదేళ్లలో వందల సార్లు కోర్టుకు వచ్చాను. ఇక్కడ పెద్దగా మాట్లాడింది లేదు. న్యాయవాదులు నా తరఫున మాట్లాడారు. నేను దేవుడి ప్రతినిధిగా కోర్టు మెట్లు ఎక్కాను'' అని చెప్పారు.
కోర్టులో రాముడి తరఫున పాండేనే సంతకం పెట్టేవారు.
అయోధ్యలోని వీహెచ్‌పీ ప్రాంగణంలోని దుమ్ముపట్టిన చిన్న గదిలో పాండే నివసిస్తున్నారు. ఆ సంస్థలోని ఇతర సభ్యులు మసీదును కూల్చివేసినప్పటి నుండి ఆలయ నిర్మాణం కోసం ఆందోళన చేస్తున్నారు.
సుప్రీం తీర్పు తరువాత, పాండే దేవుడి ప్రతినిధిగా నిలిచిపోతారు.
''నేనెప్పుడూ రాముడితోనే ఉంటాను. ఆయనతో ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు? ఈ తీర్పుతో దేవుడున్నాడని రుజువైంది'' అని పాండే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ''సుప్రీం బట్ నాట్ ఇన్ఫాలిబుల్'': అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
- అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘బాబ్రీ వద్ద హిందువులను ఆలయాన్ని కట్టుకోనివ్వండి’
- వాజ్‌పేయి: 'బీజేపీ పాత తరం నాయకుల్లో అత్యంత శక్తిమంతమైన నేత'
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాషకు ప్రమాదమా...
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








