ఎల్‌కే అద్వానీ: రథయాత్ర సమయంలో ఈ బీజేపీ నేతను ఎలా అరెస్టు చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
1990 అక్టోబర్ 22(సోమవారం)
స్థలం - 1 అన్నే రోడ్, పట్నా
ఈ బంగ్లాలోనే అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివసించేవారు. ఆరోజు ఉదయం ఆయన కొంతమంది పెద్ద అధికారులను తన బంగ్లాకు పిలిపించినట్లు సమాచారం. సీఎం ఆదేశం మేరకు ఒక్కొక్కటిగా తెల్ల అంబాసిడర్ కార్లు అనేకం అక్కడికి వచ్చాయి.
కొద్దిసేపటి తర్వాత, పట్నాలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న డీఐజీ రామేశ్వర్ ఓరాన్, సీనియర్ ఐఏఎస్ రాజ్‌కుమార్ సింగ్ (అప్పటి రిజిస్ట్రార్-కోఆపరేటివ్)లను కూడా పిలిపించారు.
లాలూ యాదవ్ వయసు అప్పుడు 42 ఏళ్లు. ఏడు నెలల కిందటే ఆయన బిహార్ అధికారపగ్గాలు చేపట్టారు.
అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నారు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది.
ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు.
సోమనాథ్ నుంచి అయోధ్యకు అద్వానీ రథయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 25న మొదలైన ఈ యాత్ర అదే నెల 30న అయోధ్యకు చేరుకోవలసి ఉంది.
అయితే, ఈ రథయాత్రను ఆపాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళిక వేశారు. ఇందుకోసమే ఆయన పట్నాలోని అన్నే రోడ్ నివాసంలో ఉన్న బంగ్లాలో ఉన్నత స్థాయి సమావేశం పెట్టారు. రామేశ్వర్ ఒరాన్, ఆర్.కె. సింగ్లాను తన నివాసానికి పిలిపించారు.
రామేశ్వర్ ఓరాన్ ఇప్పటికీ ఆ ఘటన మరిచిపోలేదు, దాన్ని ఆయన బీబీసీతో గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Ravi prakash
ఆయన ఏం చెప్పారంటే...
అద్వానీని అరెస్టు చేస్తారా అని ముఖ్యమంత్రి నన్ను అడిగారు. నేను వెంటనే అంగీకరించాను. అప్పుడు ఆయన చమత్కారంగా 'ఓరాన్ సాహెబ్, ఆయనను అరెస్టు చేస్తే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. అయినా చేస్తారా' అని ప్రశ్నించారు. అప్పుడు నేను పోలీసు యూనిఫాం ధరించిన రోజే నాపై పువ్వులు కాదు, రాళ్లు పడతాయని తెలుసు సర్ అని బదులిచ్చాను.
ఆయనకు నేను ఇవేమీ పట్టించుకోనని అర్థమైంది. అరెస్టు చేయడానికి మేజిస్ట్రేట్ కూడా అవసరమని చెప్పాను. అప్పుడు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ముకుంద్ బాబు ఆ బాధ్యతను ఆర్కే సింగ్‌కు అప్పగించారు.
మాకు ఆయన ప్రణాళిక మొత్తం వివరించారు. ఈ పని హింస తలెత్తకుండా చేయాలని చెప్పారు. సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్టు చేసిన తరువాత ఆయనను దుమ్‌కాకు, అక్కడి నుంచి మసంజోర్‌కు తీసుకెళ్లాలని మాకు ఆదేశాలొచ్చాయి. మా ప్రణాళికను గోప్యంగా ఉంచారు.
ఈ ఆపరేషన్ కోసం ఎంపికైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
హెలికాప్టర్‌లో బయలుదేరిన మేము (రామేశ్వర్ ఓరాన్, ఆర్.కె. సింగ్) సాయంత్రం ఆలస్యంగా సమస్తిపూర్‌లోని సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్న పటేల్ మైదానంలో దిగాం. అక్కడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లాం.
అక్కడ ఏ ఫోన్ పనిచేయలేదు. ఆ రాత్రి గడిచింది. ఆపరేషన్ సమాచారం బయటకు పొక్కకుండా చాలా అప్రమత్తంగా ఉన్నాం. అద్వానీ రెండున్నర గంటలకు సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని తెలిసింది. అప్పటికే ఆయన అలసిపోయి ఉన్నారు. ఆయనను మేల్కొలపడానికి మేము వేచిచూస్తున్నాం.
అక్టోబర్ 23న ఉదయం ఐదు గంటలకు మేం అద్వానీ గది తలుపు తట్టాం. ఆయనే స్వయంగా తలుపు తెరిచారు. మమ్మల్ని ఎవరని అడిగారు. నన్ను నేను పరిచయం చేసుకున్న తరువాత, అరెస్ట్ గురించి చెప్పాం.
అప్పుడు అద్వానీ 15 నిమిషాల సమయం అడిగారు. మీ వెంట ఒకరిని తీసుకరావొచ్చు అని ఆయనకు చెప్పాం. ఆయనకు ఈ సదుపాయం ఇవ్వాలని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన ప్రమోద్ మహాజన్‌ను తన వెంట తీసుకొచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, Ravi prakash
అరెస్టు చేశాక ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందని అందులో పేర్కొన్నారు. ఆ లేఖను పట్నాకు పంపించాలని మమ్మల్ని అభ్యర్థించారు. మేం ఆ ఏర్పాట్లు చేశాం.
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం పడిపోతుందని మాకు తెలుసు, ఎందుకంటే అది బీజేపీ మద్దతుతో నడుస్తోంది.
అద్వానీ, ప్రమోద్ మహాజన్‌లతో కలిసి కారులో పటేల్ మైదాన్‌కు చేరుకున్నాం. అక్కడ మా కోసం హెలికాప్టర్ ఉంది. అక్కడి నుంచి మేం దుమ్‌కా వెళ్లాం. తర్వాత మసంజోర్ గెస్ట్ హౌస్‌కు ఆయనను తీసుకెళ్లాం. అక్కడ మూడు రోజులు వారితో ఉన్న తరువాత, ఈ ఆపరేషన్ నుంచి నేను బయటకొచ్చాను.
ఆర్‌కే సింగ్ మరో రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images
అద్వానీ అరెస్టు పెద్ద సవాల్
అరెస్టుకు ముందు అద్వానీ.. ధన్బాద్, రాంచీ, హజారీబాగ్, నవాడా మీదుగా పట్నా వచ్చారు. ఆయన ప్రసంగం వినడానికి అక్కడి గాంధీ మైదానానికి సుమారు మూడు లక్షల మంది జనం వచ్చారు.
మీటింగ్ తర్వాత అద్వానీ సమస్తిపూర్ చేరుకున్నారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత సుమారు 50 వేల మందితో కలసి సమస్తిపూర్‌లోనే ఎక్కడో బసచేశారు.
అటువంటి పరిస్థితిలో ఆయనను అరెస్టు చేయడం పెద్ద సవాల్. హింస చెలరేగే ప్రమాదం ఉంది. కానీ ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా ఉంచడంతో హింస లేకుండా ఆయనను అరెస్టు చేయగలిగాం.
ఇది రామేశ్వర్ ఓరాన్ కథనం..
ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆయనను జైలు నుంచి రాజేంద్ర ఇన్స్‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చేర్పించారు.
పదవీ విరమణ తర్వాత రామేశ్వర్ ఓరాన్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా గెలిచారు. ఇక ఆర్కే సింగ్ ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








