సుష్మా స్వరాజ్‌తో నవాజ్ షరీఫ్ తల్లి: 'నువ్వు మా భూమికి చెందిన అమ్మాయివి. మన రెండు దేశాల సంబంధాల్ని బాగు చేస్తానని మాటివ్వు'..

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2015 డిసెంబర్‌లో నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వస్తూ, హఠాత్తుగా లాహోర్‌లో ఆగి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ ఇంట్లో వివాహానికి హాజరు కావాలనుకున్నప్పుడు, ప్రపంచమంతా ఆయన రాజకీయ చతురతను ప్రశంసించింది.

కానీ, ఆ నిర్ణయం వెనుక ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాత్ర ఉందనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు.

మాల్టాలో కామన్వెల్త్ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినపుడు సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పక్కనే కూర్చున్నారు. సుష్మాకు ఉర్దూ, పంజాబీలో ఉన్న పట్టు చూసిన నవాజ్ షరీఫ్ ఆశ్చర్యపోయారు.

అప్పుడు నవాజ్ షరీఫ్‌తోపాటు ఆయన భార్య కుల్సుమ్, కూతురు మరియం కూడా మాల్టాకు వచ్చారు. నవాజ్ షరీఫ్ తర్వాత రోజు సుష్మా స్వరాజ్‌ను తన కుటుంబాన్ని కలవడానికి ఆహ్వానించారు.

డిసెంబర్ 8న సుష్మా ఇస్లామాబాద్ వెళ్లినపుడు, ఆమె నవాజ్ షరీఫ్ కుటుంబంతో మరో నాలుగు గంటలు గడిపారు.

నవాజ్ మరోసారి సుష్మా స్వరాజ్ ఉర్దూ ప్రావీణ్యం గురించి ప్రశంసించారు. తనది పంజాబ్ నేపథ్యం కావడంతో తన ఉర్దూ మాటలు అప్పుడప్పుడు తడబడుతుంటాయని చెప్పారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత నవాజ్ షరీఫ్ తల్లిని కలిసినపుడు ఆమె సుష్మను ఆప్యాయంగా హత్తుకుంటూ "నువ్వు నా భూమి నుంచి వచ్చావా, రెండు దేశాల మధ్య సంబంధాలు సరిచేసి వెళ్తానని నాకు మాటివ్వు" అన్నారు.

నవాజ్ షరీఫ్ తల్లి అమృత్‌సర్‌ భీమ్‌లోని కత్రాలో జన్మించారు. విభజన తర్వాత తను అమృత్‌సర్ రావడంగానీ, అక్కడనుంచి ఎవరైనా వచ్చి తనను కలవడం గానీ జరగలేదని ఆమె సుష్మకు చెప్పారు.

ఇద్దరూ అమృత్‌సర్ గురించి గంటలు గంటలు మాట్లాడుతున్నారు. సుష్మా అంబాలాలో ఉన్న రోజుల్లో తరచూ అమృత్‌సర్ వెళ్లేవారు.

పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చే ముందు సుష్మా స్వరాజ్ నవాజ్ షరీఫ్ కూతురు మరియంతో "మీ నానమ్మకు చెప్పు, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుస్తానననే మాటను నేను నిలబెట్టుకున్నా" అని చెప్పారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక, క్యాబినెట్ ఏర్పాటు గురించి తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ జైట్లీతో చర్చిస్తున్నారు.

ఆయనప్పుడు గత లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ సలహా తీసుకోవడం అవసరమని అనుకోలేదు.

మోదీ మంత్రివర్గంలో చోటు ఇస్తారా, లేదా అనే విషయం చాలామంది రాజకీయ పండితులతోపాటు సుష్మాకు కూడా తెలీదు. దానికి రెండు కారణాలున్నాయి.

వాటిలో ఒకటి నాయకత్వ రేసులో వెనకబడ్డ లాల్ కృష్ణ అడ్వాణీకి ఆమె చాలా సన్నిహితులు. రెండోది అరుణ్ జైట్లీతో ఆమెకు ఉన్న విరోధం అందరికీ తెలిసిన విషయం.

సుష్మను నరేంద్రమోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు దగ్గరి వారని కూడా అనుకునేవారు కాదు.

2013లో నరేంద్రమోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలపాలనే డిమాండ్ మొదటిసారి వచ్చినపుడు ఆమె లాల్‌కృష్ణ అడ్వాణీతో కలిసి దానిని వ్యతిరేకించారు.

2002లో కూడా గుజరాత్ అల్లర్ల తర్వాత అటల్‌ బిహారీ వాజ్‌పేయి నరేంద్రమోదీ 'రాజధర్మం' పాటించాలని చెప్పినపుడు, ఆమె వాజ్‌పేయి వెంట నిలిచినట్లు కనిపించారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

సీనియారిటీని పట్టించుకోలేదు

నిజమే, సుష్మాకు మోదీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను అయితే ఇచ్చారు. కానీ, ప్రభుత్వంలో ఆమెకు రాజ్‌నాథ్ సింగ్ తర్వాత మూడో ప్రాధాన్యంలో ఉంచారు. అనుభవంలో, సీనియారిటీలో రాజ్‌నాథ్ సింగ్ ఆమె కంటే ఎంతో జూనియర్.

మొదట్లో ఆమె పదవీకాలం ఎంత కఠినంగా ఉండేదంటే, నరేంద్ర మోదీ క్రియాశీల విదేశాగ విధానం క్రెడిట్ అంతా ఆమెకు దక్కకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్‌కు ఇచ్చేవారు. దాంతో సుష్మా స్వరాజ్ 'లో ప్రొఫైల్‌'లో ఉండేవారు.

విదేశాంగ మంత్రిగా ఏడాది పనిచేసిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు ఆమెను మీ విజయ రహస్యం ఏంటి అడిగినపుడు సుష్మ "మీడియాకు దూరంగా ఉండడం, ఏ పని అప్పగించారో, ఆ బాధ్యతలు నిర్వహించడం" అని చెప్పారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

25 ఏళ్లకే హర్యానా మంత్రి

సిల్క్ చీరపై పురుషుల జాకెట్ ధరించే సుష్మా స్వరాజ్ ఎత్తు దాదాపు ఐదడుగులు, లేదా అంతకంటే కాస్త ఎక్కువే ఉండచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆమె అంతకంటే ఎంతో ఎత్తులకు చేరారు.

1977లో 25 ఏళ్ల వయసులోనే ఆమె హరియాణాలో దేవీలాల్ క్యాబినెట్‌లో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అయినప్పుడు, మరికొన్ని దశాబ్దాల్లో భారతదేశంలో వేళ్లమీద లెక్కించే రాజకీయ నేతల్లో ఆమె కూడా ఒకరవుతారని చాలా తక్కువమంది ఊహించుంటారు.

1973లో సుష్మా స్వరాజ్ సుప్రీంకోర్టు వకీలుగా తన కెరీర్ ప్రారంభించారు. అక్కడ ఆమె స్వరాజ్ కౌశల్‌ను కలిశారు. తర్వాత 1975లో ఆయన్నే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి అప్పట్లో అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సమాజ్‌వాదీ నేత జార్జ్ ఫెర్నాండెజ్ కేసు వాదించేవారు.

1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అధికారంలోకి వచ్చినపుడు, ఆయన స్వరాజ్ కౌశల్‌ను మిజోరామ్ గవర్నర్‌గా చేశారు. అప్పట్లో గవర్నర్‌గా పనిచేసిన అత్యంత పిన్న వయస్కులు ఆయనే.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

సోనియాగాంధీపై బళ్లారిలో పోటీ

1998లో సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినపుడు భారతీయ జనతా పార్టీ సుష్మను ఆమెపై పోటీకి నిలిపింది.

ఒక సమయంలో ఏకపక్షంగా కనిపించిన పోటీని ఆమె తన ప్రచార శైలితో చాలా కఠినంగా మార్చారు. చాలా తక్కువ కాలంలోనే కన్నడ నేర్చుకుని బళ్లారి ఓటర్ల మనసు గెలుచుకున్నారు.

కానీ, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు "సోనియా ప్రధాని అయితే గుండు గీయించుకుంటా, జీవితాంతం నేలపై పడుకుంటా" అని సుష్మ చేసిన ప్రకటన అందరికీ షాకిచ్చింది. ఆమె వ్యాఖ్యలపై చాలా విమర్శలు కూడా వచ్చాయి.

కానీ, ఆ మాటలను ఆమె చాలా త్వరగానే మర్చిపోయారు. పార్లమెంటు ఆవరణలో సుష్మ చాలాసార్లు సోనియాగాంధీతో చేతులు కలిపి మాట్లాడుతూ కనిపించారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

విదేశాంగ మంత్రిగా జనాదరణ

1998లో అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన తన క్యాబినెట్‌లో సుష్మను సమాచార, ప్రసార శాఖా మంత్రిని చేశారు. ఆమె కొంతకాలం దిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.

2009లో సుష్మను లాల్‌కృష్ణ అడ్వాణీ స్థానంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా చేశారు.

కానీ, భారత విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు సుష్మా స్వరాజ్ అందరికంటే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ దౌత్యంతోపాటు ఆమెలోని మానవీయ కోణం కూడా వెలుగు చూసింది.

సౌదీ అరేబియా, యెమెన్, దక్షిణ సూడాన్, ఇరాక్, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది భారతీయ కార్మికులు తిరిగి భారత్ చేరేందుకు సుష్మ సాయం చేశారు.

ఒక మహిళ పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో ఆమె మళ్లీ హనీమూన్‌కు వెళ్లడానికి, వెంటనే పాస్‌పోర్ట్ అందేలా చేశారు.

సోనూ అనే ఒక 12 ఏళ్ల పాపను బంగ్లాదేశ్‌లోని ఒక అనాథాశ్రమం నుంచి భారత్ తీసుకురావడానికి సుష్మ సాయం చేశారు. ఆమెను ఆరేళ్ల ముందు దిల్లీ నుంచి అపహరించారు.

ప్రపంచమంతటా భారతీయుల సమస్యలను పరిష్కరించడంలో ఆమె స్ఫూర్తిని చూసిన వాషింగ్టన్ పోస్ట్ ఆమెకు "సూపర్ మామ్ ఆఫ్ ద స్టేట్" అని చెబుతూ ప్రశంసించింది.

కానీ, కొన్ని విషయాల్లో ఈ సూపర్ మామ్ నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కూడా కనిపించారు.

ఒక వ్యక్తి ఆమె ట్విటర్‌లో "ఒక కంపెనీ తనకు పనికిరాని ఫ్రిజ్ అమ్మిందని చెప్పినపుడు", ఆమె "సోదరా ఫ్రిజ్ విషయంలో నేను మీకెలాంటి సాయం చేయలేను. ఎందుకంటే నేను ఇబ్బందుల్లో ఉన్న మనుషుల కష్టాలు తీర్చే పనిలో కాస్త బిజీగా ఉన్నాను" అని చెప్పారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాదౌత్యంలో నైపుణ్యం

భారత రాజకీయాల్లో ట్విటర్‌ను అందరి కంటే ముందు ఉపయోగించిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన, తన మంత్రిమండలి సభ్యులకు కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని, వారిపై అంచనాలకు అది ఒక ముఖ్యమైన ప్రమాణం అవుతుందని స్పష్టంగా చెప్పారు.

సుష్మా స్వరాజ్ దాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ట్విటర్‌లో ఆమెను 86 లక్షల మంది ఫాలో కావడానికి బహుశా అదే కారణం కావచ్చు.

అయితే, నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శించేవారు,ఆయన మైక్రో మేనేజ్మెంట్‌తో సుష్మా స్వరాజ్‌ తన విధులు నిర్వహించడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వలేదని, అందుకే ఆమె బహుశా ట్విటర్‌లో ప్రజా దౌత్యం మద్దతు తీసుకోవాల్సొచ్చిందని చెబుతారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Pti

లలిత్ మోడీ వివాదం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన లలిత్ మోదీకి తన భార్య ఆపరేషన్ కోసం బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లడానికి సాయం చేసినపుడు సుష్మా స్వరాజ్ వివాదాల్లో పడ్డారు.

లలిత్ మోదీపై ఆర్థిక అవతవకల ఆరోపణలుండడం మీకు గుర్తుండే ఉంటుంది. భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై దర్యాప్తు చేస్తోంది. "లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాలా? అని బ్రిటిష్ ప్రభుత్వం అడిగినపుడు, సుష్మా వారికి "బ్రిటన్ ప్రభుత్వం అలా చేస్తే అది భారత్-బ్రిటన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని" సమాధానం ఇచ్చారు.

ఈ విషయంపై పార్లమెంటులో చాలా గొడవ జరిగింది. సుష్మా స్వరాజ్ రాజీనామాకు కూడా డిమాండ్ చేశారు.

వాజ్‌పేయి మంత్రిమండలిలో ఆరోగ్యమంత్రిగా "ఎయిడ్స్ నుంచి కాపాడుకోడానికి గర్భనిరోధక పద్ధతుల కంటే బ్రహ్మచర్యం పాటించడమే మేలు" అని సుష్మ చేసిన ఒక ప్రకటనపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థి అయినా, లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ, ఆమెను భారతదేశ అత్యుత్తమ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రకటించారు. దానికి ఆయన సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Pti

అద్భుతమైన వక్త

సుష్మా స్వరాజ్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత బీజేపీలో అత్యద్భుత వక్తల్లో ఒకరుగా భావిస్తారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషలపై సమాన పట్టున్న సుష్మా స్వరాజ్ వాగ్ధాటిని అందరూ మెచ్చుకుంటారు.

2016లో ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు చాలా ముందే, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె సంచలనం సృష్టించారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్తారని, ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా చేస్తారని వచ్చిన ఊహాగానాలకు ఆమె స్వస్తి పలికారు.

అంతే కాదు పదవి వీడిన కొన్ని రోజుల్లోనే తన ప్రభుత్వ నివాసాన్ని వదిలి ఒక ప్రైవేటు భవనంలో ఉండాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)