సుష్మా స్వరాజ్: ‘రేపు వచ్చి నీ ఒక్క రూపాయి ఫీజు తీసుకెళ్లు’... చనిపోవడానికి గంట ముందు లాయర్ హరీశ్ సాల్వేతో చెప్పిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి

సుష్మా స్వరాజ్ లాయర్ హరీశ్ సాల్వే

ఫొటో సోర్స్, Getty Images/BBC

బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.

మరణానికి ముందు ఆమె రాత్రి 7.30 గంటల సమయంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్టికల్ 370 సవరణ నేపథ్యంలో చేసిన ఈ ట్వీట్‌లో ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు కోసం తాను జీవితమంతా ఎదురుచూశానని సుష్మ వ్యాఖ్యానించారు.

సుష్మ చివరగా ఎవరితో మాట్లాడారు?

ప్రసిద్ధ లాయర్, భారత్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ కేసును వాదిస్తున్న హరీశ్ సాల్వేతో సుష్మా స్వరాజ్ చివరిసారిగా మాట్లాడారు.

ఈ విషయాన్ని సాల్వేనే చెప్పారు. ఆయన టైమ్స్ నౌ మీడియాతో మాట్లాడుతూ,

''నేను రాత్రి 8.50 గంటలకు సుష్మతో మాట్లాడాను. అది చాలా భావోద్వేగ సంభాషణ. ఒకసారి కలుద్దాం రండి అని చెప్పారు. మీరు కేసు గెలిచినందుకు ఫీజుగా ఒక్క రూపాయి ఇవ్వాలి కదా అని గుర్తు చేశారు. నేను తప్పకుండా వచ్చి నా ఫీజు తీసుకుంటానని చెప్పా. అయితే, రేపు ఉదయం ఆరు గంటలకు రండి అని చెప్పారు' అని సుష్మతో జరిగిన సంభాషణను ఆయన వెల్లడించారు.

'రూపాయి ఫీజు ఇంకా అందలేదు'

కులభూషన్ కేసులో తన ఫీజు ఒక్క రూపాయిని ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని జులై 18న హరీశ్ సాల్వే బీబీసీకి నవ్వుతూ చెప్పారు.

''ఇప్పటి వరకు నా ఫీజు అందుకోలేదు. సుష్మాస్వరాజ్ నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఒక వేళ ఇండియా గెలిస్తే వచ్చి నీ ఫీజు తీసుకెళ్లు అని చెప్పారు'' అని హరీశ్ సాల్వే అన్నారు.

లాయర్ హరీశ్ సాల్వే

ఫొటో సోర్స్, Getty Images

కులభూషణ్ కేసులో ఏం తీర్పు వచ్చింది?

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ అరెస్టు చేసిన భారత పౌరుడు కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న విధించిన మరణ శిక్షను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇటీవల తీర్పు చెప్పింది.

ఈ తీర్పును భారత్ స్వాగతించింది. భారత్ తరఫున ఐసీజేలో పోరాడిన సాల్వే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కేసులో గెలవడం అనేది 'చట్టబద్ధ పాలన' సాధించిన విజయమని సాల్వే అభివర్ణించారు.

ఈ తీర్పుతో జాధవ్‌ను భారత కాన్సులేట్ అధికారులు కలిసేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు వీలవుతుందని చెప్పారు.

జాధవ్ కుటుంబ సభ్యులు అడ్డంకులు లేకుండా ఆయన్ను కలుసుకొనేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

విచారణ నిష్పాక్షికంగా జరిగితే, సరైన న్యాయ సహాయం అందిస్తే జాధవ్‌ను పాకిస్తాన్ నుంచి విడిపించగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. విచారణ నిష్పాక్షికంగా జరగకపోతే తాము మళ్లీ ఐసీజేను ఆశ్రయించగలమని తెలిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)