ఇన్‌స్టాగ్రామ్‌‌లో లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు.. అన్నీ నిజం కాదు, వీటిని కొనుక్కోవచ్చు

ఎడ్విన్
ఫొటో క్యాప్షన్, ఎడ్విన్ లేన్
    • రచయిత, ఎడ్విన్ లేన్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

ఇన్‌స్టాగ్రామ్‌లో నేను తాజాగా పెట్టిన పోస్టింగ్ ఒక గంట కూడా లైవ్‌లో లేదు. కానీ, దానికి వెయ్యికి పైనే లైక్‌లు వచ్చాయి.

నేను లంచ్ చేయడం కోసం సిద్ధం చేసిన పాస్తా ఫొటో అది.. నా ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలో అదే బాగా పాపులర్ ఫొటో. అందుకే ఆ ఫొటోని చూసి గర్వపడతాను నేను.

కానీ, అసలు విషయమేంటంటే ఆ ఫొటోకి వచ్చిన 1003 లైకుల్లో కేవలం మూడే నిజమైనవి.. మిగతావన్నీ ఫేక్.

బెల్జియంకు చెందిన ఆర్టిస్ట్ డ్రైస్ డిపూర్టర్ సహాయంతో నేను ఈ ఫేక్ లైక్‌లు సంపాదించాను. క్విక్‌ ఫిక్స్ అనే ఆన్‌లైన్ వెండింగ్ మెషీన్ సహాయంతో ఈ ఫేక్ లైకులు పొందేలా చేశారాయన. క్విక్ ఫిక్స్‌కు కొన్ని యూరోలు చెల్లిస్తే లైక్‌లు, ఫాలోవర్లను కొనుక్కునే వీలుంది.

''నా దగ్గర చాలా ఫేక్ అకౌంట్లున్నాయి. ఆ అకౌంట్లతో నీ పోస్టులకు లైక్ కొట్టొచ్చు, ఫాలో చేయొచ్చు'' అని చెప్పారాయన.

ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే లైకులు, ఫాలోవర్లు అన్నీ నిజం కాదని నాకు ఈ అనుభవంతో అర్థమైపోయింది.

ఎడ్విన్ పోస్ట్

గూగుల్‌లో చూడండి..

నకిలీ అకౌంట్లు సృష్టించి నకిలీ లైకులు, ఫాలోవర్లను అందిస్తున్న డ్రైస్... డబ్బులు కోసం ఆ పనిచేయడం లేదు.

కానీ, కొందరు మాత్రం డబ్బులు తీసుకుని ఈపని చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ కోసం నకిలీ లైకులు, ఫాలోవర్లను అందించే వ్యవస్థ పెద్దగానే ఉంది.

గూగుల్‌లో దీనికోసం కొద్దిసేపు సెర్చ్ చేస్తే చాలు.. పదుల సంఖ్యలో ఇలాంటి సైట్లు కనిపిస్తాయి.

క్విక్ ఫిక్స్

ఫొటో సోర్స్, DRIES DEPOORTER

20 నుంచి 30 శాతం బూటకం

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయినవారితో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయించడానికి అనేక బ్రాండ్లు డబ్బులిస్తున్నాయి.

ఈ లక్ష్యంతోనూ కొందరు నకిలీ ఫాలోవర్లను కొనుగోలు చేసి పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, ఫాలోవర్లు నకిలీ అని తెలిసినప్పుడు డబ్బు వృథా చేసుకోవడం ఎందుకన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

''ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో 20 నుంచి 30 శాతం మంది సహజంగా కాకుండా రకరకాల పద్ధతుల్లో ఫాలోవర్లు, లైకులు పెంచుకుంటున్నారు. కొందరు ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ కామెంట్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు'' అని ఐజీ ఆడిట్‌లో పనిచేసే రీసెర్చర్ ఆండ్రూ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లను గుర్తించడానికి ఐజీ టూల్ వాడతారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో బిజినెస్ డైలీ కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలనుకున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది నకిలీలున్నారో నాకు తెలిసింది.

లండన్ పాస్తా గై

ఫొటో సోర్స్, londonpastaguy

సొమ్ము చేసుకోవడం ఎలా?

బ్రాండ్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల మధ్య అనుసంధానంగా పనిచేసే లండన్‌లోని మార్కెటింగ్ ఏజెన్సీ గోట్ సహవ్యవస్థాపకుడు హ్యారీ హ్యూగోను సలహా కోసం కలిశాను.

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు ఒక్క పోస్టింగ్ కోసం వేల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిసింది. నీష్ మార్కెట్లలో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారూ డబ్బు చేసుకోగలుగుతున్నారని గుర్తించాను.

''ఒకవేళ 5 వేల మంది ఫాలోవర్లు ఉంటే ప్రమోటెడ్ పోస్టులను ఉచితంగా ఇవ్వొచ్చు.. అప్పుడప్పుడు 50 నుంచి 100 పౌండ్లు చార్జి చేయొచ్చు' అన్నారు హ్యూగో.

ఒక నీష్ మార్కెట్‌ను గుర్తించి అదే థీమ్‌తో వరుసగా పోస్టింగులు పెట్టాలని హ్యూగో సూచించారు.

ఆ తరువాత నా ఇన్‌స్టా అకౌంట్‌ను పరిశీలించి పాస్తాపై ఫోకస్ చేయాలని నిర్ణయించాం. పాస్తా తినడం నాకిష్టం, ఇంట్లో పాస్తా తయారు చేయడం కూడా నాకు ఇష్టమే.

నేను క్రమం తప్పకుండా పాస్తాకు సంబంధించిన పోస్టింగులు పెడుతుంటే పాస్తా సంబంధిత ఫుడ్ బ్రాండ్లను ఆకర్షించొచ్చని హ్యూగో చెప్పారు. దాంతో నేను @londonpastaguy అనే అకౌంట్ మొదలుపెట్టాను.

మొదట్లో పెద్దగా స్పందన లేదు. తక్కువ లైకులు వచ్చేవి. దాంతో నేనింకా యాక్టివ్ కావాలని హ్యూగో చెప్పారు.

నకిలీ ఖాతాలు

ఫేక్ ఫాలోవర్లు..

అయితే, ఇలా నెలల తరబడి కష్టపడడం కంటే తొందరగా ఫాలోవర్లను సంపాదించుకోవడానికి షార్ట్ కట్ పద్ధతులున్నాయి. గూగుల్‌లో వెతికితే కొద్దిసేపట్లోనే 15 డాలర్లకు 1000 మంది ఫాలోవర్లను ఇచ్చే సైట్ ఒకటి కనిపించింది.

నేను వెంటనే క్రెడిట్ కార్డుతో ఆ మొత్తం కట్టేశాను.. అంతే, కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. అదే రోజు 500 మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఆ తరువాత ఒకట్రెండు రోజుల్లోనే మరో 300 మంది, ఆ తరువాత మిగతా వారు నా అకౌంట్‌కు ఫాలోవర్లుగా మారిపోయారు.

వారిలో ఫేక్ ప్రొఫైల్స్‌ను సులభంగా గుర్తుపట్టేలా ఉన్నాయి. చాలావాటికి ప్రొఫైల్ పిక్చర్లు ఒకేలా ఉన్నాయి. పేర్లు కూడా అసలైనవిలా లేకుండా కంప్యూటర్ జనరేటెడ్ పేర్లని తెలిసిపోయేలా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇన్‌స్టాగ్రామ్ సులభంగా గుర్తించేస్తుంది.

అయితే, ఇప్పుడు ఇలా సులభంగా దొరికిపోకుండా నకిలీ ఫాలోవర్లను అందిస్తున్నారు. నకిలీ అకౌంట్లు నిర్వహించేవారు పరస్పరం కామెంట్లు పోస్ట్ చేసుకునే విధానం ఫాలో అవుతున్నారు. దాంతో అవి యాక్టివ్ అకౌంట్లలా అనిపిస్తాయి.

అయితే, ఇన్‌ఫ్లూయెన్సర్స్ మార్కెట్‌పై ఆధారపడుతున్న సంస్థలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్‌కు పెట్టే ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నాయి.

కాస్మొటిక్ దిగ్గజం ఎస్తే లాడర్ తన సోషల్ మీడియా మార్కెటింగ్ బడ్జెట్‌ను మూడొంతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది.

ఇదంతా ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెట్ వృద్ధిని దెబ్బతీస్తుందని.. నకిలీలను అరికట్టడమే దీనికి పరిష్కారమని ఆండ్రూ హాగ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)