భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?

స్మార్ట్ ఫోన్‌తో యువతి

ఫొటో సోర్స్, iStock

గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో గడిపిన సమయం సగటున దాదాపు 60% పెరిగిందని తాజా సర్వేలో వెల్లడైంది.

లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ గ్లోబల్‌వెబ్ఇండెక్స్ ప్రపంచంలోని 45 అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ల (దేశాల) నుంచి సేకరించిన డేటాను విశ్లేషించింది.

ఒక్కో వ్యక్తి సోషల్ మీడియా వెబ్‌సైట్లను, అప్లికేషన్లను చూసేందుకు కేటాయించే సమయం 2012లో రోజుకు 90 నిమిషాలు ఉండగా, 2019 మొదటి మూడు నెలల్లో 143 నిమిషాలకు పెరిగిందని అంచనా వేశారు.

సోషల్ మీడియా వాడకంలో ప్రాంతాలు, దేశాల వారీగా చూస్తే భారీ తేడాలు ఉన్నాయి.

ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా ముందుంది. ఇక్కడ నెటిజన్లు రోజూ తెరల మీద గడిపే సమయం సగటున 212 నిమిషాలు. అత్యల్ప ప్రాంతీయ సగటు ఉత్తర అమెరికాలో (116 నిమిషాలు) ఉంది.

ఇక, ప్రజలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే దేశం ఫిలిప్పీన్స్. ఈ దేశంలో రోజుకు సగటున 241 నిమిషాలు సోషల్ మీడియా వాడుతున్నారు. జపాన్‌లో వాడకం కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంది.

సోషల్ మీడియా వినియోగం

భారత్‌లో తగ్గుదల

ఆశ్చర్యకరంగా... 20 దేశాలలో ప్రజలు తెరల మీద గడిపే సమయంలో మార్పు లేదని, లేదా తగ్గిందని వెల్లడించింది.

థాయిలాండ్‌లో రోజువారీ సోషల్ మీడియా వాడకం అత్యధికంగా పడిపోయింది. ఇక్కడ సగటున నెటిజన్లు తెరల మీద గడిపే సమయం 2018లో 194 నిమిషాలు కాగా, , 2019 నాటికి 171 నిమిషాలకు పడిపోయింది.

వియత్నాంలో, గత ఏడాదితో పోలిస్తే రోజువారీ వినియోగం సగటున 10 నిమిషాలు తగ్గిపోయింది.

భారత్‌లో కూడా 2018తో పోలిస్తే, 2019లో సోషల్ మీడియా వినియోగం సగటున 3 నిమిషాలు తగ్గింది.

ఇండోనేషియా, బెల్జియం, ఘనా, అమెరికాలో కూడా భారీ తగ్గుదల నమోదైంది.

సోషల్ మీడియా వినియోగం

కొన్ని దేశాలలో సోషల్ మీడియాలో గడిపే సమయంలో కాస్త తగ్గుదల కనిపించినా, సర్వే చేసిన చాలా దేశాలలో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ సర్వేలో సుమారు 18 లక్షల మంది పాల్గొన్నారు.

"తెరల మీద గడిపే సమయం గురించి చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల్లో మంచి అవగాహన ఉంది" అని గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్ సూచిస్తోంది.

"ఇంటర్నెట్ వినియోగదారులు ప్రస్తుతం సగటున రోజుకు ఆరు గంటలకు పైగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అందులో మూడోవంతు సమయం సోషల్ మీడియాకు కేటాయించారు" అని గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్ సంస్థ ట్రెండ్స్ మేనేజర్ చేజ్ బకిల్ బీబీసీకి చెప్పారు.

ఫిలిప్పీన్స్‌లో రోజూ సగటున నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిలిప్పీన్స్‌లో రోజూ సగటున నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు

సూపర్ యాప్‌లు

ప్రస్తుతం చైనాలో వినియోగదారులు రోజుకు సగటున 139 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2018 కంటే ఇది 19 నిమిషాలు ఎక్కువ.

సౌదీ అరేబియాలో రోజువారీ సోషల్ మీడియా వినియోగం 14 నిమిషాలు, టర్కీలో 13 నిమిషాలు పెరిగింది.

"ఆసియాలో సోషల్ మీడియా మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. 'సూపర్ యాప్స్' - పశ్చిమ దేశాలకు భిన్నంగా ఇక్కడ వేర్వేరు భిన్నమైన సోషల్ మీడియా యాప్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. చాటింగులు, సంభాషణల కోసమే కాకుండా, బిల్లుల చెల్లింపులు, రెస్టరెంట్ల బుకింగులు, ట్యాక్సీ బుకింగులు, దుకాణాల్లో చెల్లింపుల సదుపాయాలు ఉండే యాప్‌ల వాడకం పెరిగిపోయింది" అని చేజ్ బకిల్ వివరించారు.

చైనాలో వీచాట్ సోషల్ మీడియా అప్లికేషన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ యాప్‌కు వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

సోషల్ మీడియా వినియోగం
ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం పెరుగుదల (సగటున నిమిషాలలో)

16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు యువత అత్యధికంగా సోషల్ మీడియా వినియోగిస్తున్నట్లు బకిల్ చెప్పారు.

అరబ్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యంపై ప్రభావం

తెరల మీద ఎక్కువ సమయం గడపడం మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు, తక్కువ సంతోషంగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి" అని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆష్లే విలియమ్స్ చెప్పారు.

"అధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో, అది కుంగుబాటుకు, రోడ్డు ప్రమాదాలకూ కారణమవుతుంది" అని ఆప్లే విలియమ్స్ అన్నారు.

16 నుంచి 24 ఏళ్ల వయసువారు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 16 నుంచి 24 ఏళ్ల వయసువారు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు

ఎంతసేపు వాడాలి?

ప్రజలు ఆన్‌లైన్‌లో 'ఇంతసేపు గడపాలి' అని కచ్చితమైన కొలమానం ఏమీ లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏప్రిల్‌లో మొట్టమొదటి సారిగా తెరలపై గడిపే సమయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలను ఉద్దేశించి ఆ మార్గదర్శకాలను రూపొందించారు.

గత డిసెంబరులో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రచురించిన అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఆ అధ్యయనంలో పాల్గొన్న 143 మంది విద్యార్థుల్లో "ఒంటరితనం, కుంగుబాటులో గణనీయమైన తగ్గుదల కనిపించింది".

కానీ, కొంతమంది నిపుణులు మాత్రం ఈ సమస్య చాలా క్లిష్టమైనదని అంటున్నారు.

"సోషల్ మీడియా చాలా వైవిధ్యమైనది. విభిన్న సైట్లు విభిన్న ఫీచర్లను అందిస్తాయి. కాబట్టి ఒక్కో దాని ప్రభావం ఒక్కో విధంగా ఉంటుంది. అన్నింటి ప్రభావం ఒకేలా ఉండదు" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంకు చెందిన ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌‌లో పనిచేస్తున్న మానసిక నిపుణుడు ఆండీ ప్రజిబిల్‌స్కి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)