తీవ్రమవుతున్న నీటి సంక్షోభం: ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకులూ పట్టించుకోని ప్రధాన సమస్య: Reality Check

నీటి సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ఒక్క అంశం గురించి మాత్రం ఏ పార్టీ పెద్దగా మాట్లాడలేదు. అదే దేశంలో పెరుగుతున్న నీటి సంక్షోభం.

2024 నాటికి ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని బీజేపీ చెబితే, అందరికీ ఉచితంగా తాగునీటిని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ దేశవ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉందని ఓ నివేదిక హెచ్చరిస్తోంది. దేశంలోని 42శాతం భూమి ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కుకుందని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో నీటి సమస్యను అధిగమించడం ఎలా?

నీటి సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమవుతున్న సంక్షోభం

ప్రపంచ జనాభాలో భారత జనాభా 18శాతం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరుల్లో 4 శాతమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా దేశం నీటిసమస్యతో సతమతమవుతోంది అని ఇటీవల ఓ ప్రభుత్వ నివేదికలోనే వెల్లడైంది.

దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలతో సహా 21 నగరాల్లో 2020 నాటికి భూగర్భజలాలు అడుగంటిపోతాయని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. చెన్నై అయితే గత కొన్ని రోజులుగా తాగునీటికి అల్లాడిపోతోంది.

2030 నాటికి దేశ జనాభాలోని 40శాతం మంది స్వచ్ఛమైన తాగునీరు లేక సమస్యలు ఎదుర్కొంటారని ఓ అంచనా.

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఎండిపోయిన సబర్మతి నదిలో సైకిల్ తొక్కుకుని వెళ్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

నగరాల విస్తరణ - మౌలిక సదుపాయాల లేమి

నీటి సంక్షోభం గ్రామీణ ప్రాంతాల్లో ఓ రకంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో మరో రకంగా ఉంది అని 'అశోక ట్రస్ట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌' సంస్థలో పరిశోధకులు డాక్టర్ వీణా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

"నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కానీ అందుబాటులో ఉన్న నీటిని సరైన రీతిలో సరఫరా చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు" అని ఆమె అన్నారు.

2030 నాటికి నగర జనాభా 60 కోట్లకు చేరుతుందని అంచనా.

నీటి సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

గ్రామీణ ప్రాంతాల్లో అవసరానికి మించి భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నారనేది డాక్టర్ శ్రీనివాసన్ వ్యక్తం చేస్తున్న ఆందోళన.

దేశంలో లభ్యమవుతున్న 80శాతం నీరు వ్యవసాయానికే సరిపోతోంది. దీనిలో చాలా భాగం భూగర్భ జలాల నుంచే వస్తోంది.

తిరిగి చేరుతున్న దానికన్నా వాడుకునేదే ఎక్కువ ఉంటోంది అని 'వాటర్ ఎయిడ్ ఇండియా' సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీకే మాధవన్ అన్నారు.

భారత్‌లోని ప్రధాన పంటలైన గోధుమ, వరి, చెరకు, పత్తి వంటివాటికి ఎక్కువ నీరు అవసరం. కానీ ఈ నీటిని సరైన రీతిలో సమర్థంగా ఉపయోగించట్లేదు.

వ్యవసాయానికి నీటి వినియోగం. (వంద కోట్ల క్యూబిక్ మీటర్లలో). .

"భారత్‌లో ఒక కేజీ పత్తి ఉత్పత్తి చెయ్యాలంటే 22,500 లీటర్ల నీరు కావాలి. కానీ అమెరికాలో ఇది 8,100 లీటర్ల నీటితోనే సాధ్యమవుతోంది" అని వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ సంస్థ అంచనా వేసింది.

గత 30 ఏళ్లలో నీటి స్థాయి 13శాతం తగ్గిపోయిందని 2017-18 సంవత్సర ప్రభుత్వ ఆర్థిక సర్వే స్పష్టం చేస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం... సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండే భూగర్భ జలాలు, ఉపయోగించే జలాల మధ్య నిష్పత్తి. 2013లో ఈ నిష్పత్తి విలువ సురక్షిత స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ అప్పట్లో కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న దానికన్నా ఎక్కువే భూగర్భజలాలు వినియోగమయ్యాయి.

అన్ని ప్రాంతాల్లోనూ బావుల్లోని నీటి స్థాయిని పరిశీలిస్తే... గత పదేళ్లతో పోలిస్తే 2018నాటికి నీటి స్థాయుల్లో 66శాతం తగ్గుదల కనిపించింది.

2011లో తలసరి నీటి లభ్యత 1545 క్యూబిక్ మీటర్లు (15.45 లక్షల లీటర్లు) గా ఉండగా... ఇది 2050 నాటికి 1140 క్యూబిక్ మీటర్లు (11.40 లక్షల లీటర్లు)కు పడిపోయింది అని ఫిబ్రవరిలో ఓ పార్లమెంటు ప్రకటన వెల్లడించింది.

భవిష్యత్‌లో నీటి లభ్యత. . .

వాతావరణ మార్పుల ప్రభావం

"తక్కువగానే అయినప్పటికీ భారీగా కురుస్తున్న వర్షాల ద్వారా వచ్చే నీరు భూమిలోకి ఇంకకుండానే వృధాగా పోతోంది. దీంతో భూగర్భ జలాల స్థాయి పెరగడం లేదు" అని సుందరమ్ వాతావరణ సంస్థకు చెందిన మృదుల రమేష్ అన్నారు.

భూతాపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు పరిస్థితులు సర్వసాధారణమైపోయాయి.

నీటి వినియోగం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి.

కానీ, ప్రభుత్వం గత ప్రభుత్వం పరిశుభ్రత వంటి ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ పథకాలకు గత ఐదేళ్ల కాలంలో నిధుల కేటాయింపు తగ్గిపోయింది.

నీటి సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఈ సంవత్సరం మే నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 18శాతం ఇళ్లకు మాత్రమే పైపులైన్ల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. ఐదేళ్లకు ముందునాటితో పోలిస్తే ఇది కేవలం 6శాతం మాత్రమే ఎక్కువ.

ప్రభుత్వం పరిశ్రమల వద్ద నుంచి నీటి పరిరక్షణ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ఆ ఫీజు ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రైతులకు నీటిని ఎలా అందించాలనే అంశంపై కాకుండా వారి ఆదాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని డాక్టర్ శ్రీనివాసన్ అభిప్రాయపడుతున్నారు.

నీటి పునర్వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, పరిరక్షణకు, వాననీటిని ఒడిసిపట్టి భూమిలోకి వెళ్లేలా చేయడం, తద్వారా భూగర్భజలాల స్థాయిని పెంచడంపై దృష్టిసారించాలి.

Presentational grey line
రియాలిటీ చెక్ బ్రాండింగ్
Presentational grey line

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)