అబ్బూరి ఛాయాదేవి: 'ఆమె చైతన్యరూపిణి... తుళ్ళిపడే తొలకరి రోజుల గోదావరి' -అభిప్రాయం

CHAYADEVI

ఫొటో సోర్స్, KSATYAVATI/FACEBOOK

ఫొటో క్యాప్షన్, అబ్బూరి ఛాయాదేవి (1933 - 2019)
    • రచయిత, ఓల్గా
    • హోదా, బీబీసీ కోసం

అబ్బూరి ఛాయాదేవిగారు ఈరోజు నుంచి కనబడరు, వినబడరు అనుకుంటే ఏమీ బాగోలేదు. కానీ, అది వాస్తవం. వాస్తవాన్ని వాస్తవంగా తీసుకోవాలని నేర్పి వెళ్ళిన మనిషి ఆమె.

1960, 70లలో ఆమె కథలు పత్రికలలో చదివి ఆవిడను కలవాలనుకునేదాన్ని. 80ల నుంచి ఆమె నాకు మంచి స్నేహితురాలైంది. 87లోనో 88లోనో సరిగా గుర్తులేదు కానీ, మొదటిసారి ఆమె ఇంటికి బాగ్‌లింగంపల్లికి వెళ్ళినప్పుడు భయంగానే వెళ్ళా. నాకంటే ముందు తరం రచయిత్రి కదా. రచయిత్రిగానే కాకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిప్యూటీ లైబ్రేరియన్‌గా చాలా సంవత్సరాలు పని చేసి రాజీనామా చేసి వచ్చారు. వాళ్ళింటికి రాని ముందటి తరం సాహితీవేత్తలు లేరు.

అబ్బూరి రామకృష్ణరావు కోడలు, వరదరాజేశ్వరరావు గారి భార్య ఇలా చాలా విని ఉన్నాను. ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రచురించిన ఒక పుస్తకం ఆవిష్కరించడానికి ఆహ్వానించడానికి వెళ్ళాను. ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. ఎంత సామాన్యంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉన్నారో చెప్పలేను. పైగా ఆ సెన్సాఫ్ హ్యూమర్. పక్కనే వరదరాజేశ్వరరావు గారి పన్‌లు (చమత్కారాలు)ను తట్టుకుంటూ ఆమె హాస్య చతురతను నిలబెట్టుకోగలిగినందుకు బోలెడు సంతోషించాను. ఫెమినిజం గురించి ఆవిడ చాలా మంచిగా మాట్లాడారు. స్టడీ సర్కిల్‌కు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అంగీకరించారు.

చాయాదేవి

ఫొటో సోర్స్, NAGALAKSHMI VARANAS/FACEBOOK

ఆమె 'బోన్సాయ్ బతుకులు' కంటే మంచి ఫెమినిస్టు కథ ఉంటుందా? అతి సులువుగా జెండర్ పాఠాలనెన్నింటినో ఆమె తన కథలలో చెప్పారు. ఆమె తనకు తెలిసిన బాగా పరిచయమైన మధ్యతరగతి స్త్రీల గురించే రాశారు. తను ఎవరి కోసం రాస్తున్నానో, ఎవరు తన పాఠకులో ఆమెకు తెలుసు. ఐతే వివక్షను, అసమానతలు ఎత్తిచూపడానికి ఆమె ఎంచుకున్న జీవితాలు, ఇతివృత్తాలు ఎంతో బాగా సరిపోయాయి. స్త్రీలు చేసే చాకిరి, స్త్రీలకు పని చేసే చోట ఎదురయ్యే లైంగిక వేధింపులు, భర్తలకు నీడల్లా బతకాల్సిన పరిస్థితి, వీటన్నింటి మీదా తిరగబడాలనిపించే వారి మానసిక స్థితి- వీటిని ఛాయాదేవిగారు చాలా నేర్పుగా పట్టుకున్నారు.

ఆమె కథలలో స్త్రీలు తిరుగుబాటుదార్లుగా కనిపించరు. కానీ, తిరుగుబాటుదార్లే. వారి మార్గం వేరు. తమ జీవితాలలోని అణచివేతను తప్పించుకోవడానికి వారెంచుకున్న దారులు చాలా భిన్నమైనవి. తమ జీవితాలలో పెను మార్పులు రాకుండానే మెల్లిమెల్లిగా తమకంటూ కొంత చోటు కల్పించుకుని దానిని మెల్లిగా విస్తరించుకుంటూ పోతారు. అది కుదరనపుడు కూడా 'సుఖాంతం'లో వలే నిరసన ప్రకటన చేసి నిష్క్రమిస్తారు. ఆ నిరసన ఒక తిరుగుబాటుగానే ఉంటుంది.

1991 వరకూ ఆమె కథల సంపుటి రాలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది గానీ అది రావడానికి అది సరైన సమయం. అత్యవసర సమయం. ఏదో ఆడవాళ్ల కథలు అని పక్కన పెట్టకుండా, ఇవి స్త్రీవాద కథల వలే ఉన్నాయే అని ఎంతో ఆసక్తితో చదివే పాఠకులున్న రోజుల్లో ఆ సంకలనం వచ్చింది. ఆ కథలను చదవ వలసిన రీతిలో, లోతుగా చదివి స్త్రీవాద దృష్టితో విశ్లేషించుకునే సమయం, సందర్భం ఉన్నప్పుడు ఆ కథా సంకలనం వచ్చింది. స్త్రీవాద రచయిత్రినని చెప్పుకోవడంలో ఆమెకేమీ మొహమాటం లేదు. "నేనెప్పుడో స్త్రీవాద కథలు రాశాను. అంటూనే నేను స్త్రీవాద రచయిత్రిని కాదు" అనే రచయిత్రుల గురించి వ్యాసం కూడా రాశారు.

ఛాయాదేవి

ఫొటో సోర్స్, Abburi Chayadevi

1990వ దశాబ్దం నుంచీ హైదరాబాదులో రచయిత్రులకు పెద్ద దిక్కుగా, అండగా ఉన్నారు. సాహిత్య ఎకాడమీకి రచయిత్రుల రచనలు సంకలనం చేసిపెట్టారు. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని తెలుగు పాఠకులకు తనదైన రీతిలో పరిచయం చేశారు. జిడ్డు కృష్ణమూర్తి తాత్త్విక దృక్పథమే ఆమె జీవితాన్ని నడిపించింది. ప్రతి క్షణాన్నీ విలువైనదిగా భావించి జీవించడం, జీవితం పట్ల ప్రేమ పూర్వక నిర్లిప్తత, మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులు, ఇవన్నీ ఆమెకొక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. 1933లో రాజమండ్రిలో పుట్టిన ఆమె 1997లో కర్నాటకలో పుట్టిన వారికి కూడా అభిమాన రచయిత్రి కాగలిగిందంటే కారణం ఆమె కథలలో ప్రతిఫలించిన ఆమె వ్యక్తిత్వమే.

ఆమె బోన్సాయ్ బతుకులు కర్ణాటకలో కూడా పాఠ్యాంశంగా పిల్లలు చదువుకున్నారు. రచయిత్రులతో కలిసి గడపటం, ప్రయాణాలు చేయటం ఆమెకు చాలా ఇష్టం. 1999లో చెన్నైలో జరిగిన రచయిత్రుల సమావేశంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆ మధ్య మూడు నాలుగేళ్లపాటు రచియత్రులు ఒక గ్రూపుగా జరిపిన సాహిత్య, సామాజిక యాత్రలలో అన్ని తరాలవారితో హాయిగా కలిసిపోయి వారిని నవ్విస్తూ ప్రయాణం చేశారు. రెండు దశాబ్దాల పాటు హైదరాబాదులో జరిగిన ప్రతి సాహిత్య సమావేశంలోనూ ఆమె కనిపించేవారు. చాలాసార్లు వేదిక మీద కొందరు పెద్దల వలె ఆమెకు వేదిక మీద కూచుంటే తప్ప సభలకు రాకూడదనే పట్టింపు లేదు.

రెండు కథా సంపుటాలు - 'అబ్బూరి ఛాయాదేవి కథలు'(1991), 'తన మార్గం'(2002), 'మృత్యుంజయ' అనే విభిన్న రచనలతో ప్రసిద్ధి తెచ్చుకున్న ఛాయాదేవి గారు చేసిన సాహిత్య సేవ చాలా ఉంది. తన ఇంటిలో ఆ తరం రచయితలందరినీ ఆదరించి, అతిథిమర్యాదలు చేయడమే కాదు-1952లోనే ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన 'కవిత' అనే పత్రికకు సంపాదకురాలుగా ఉన్నారు. ఆ దశాబ్దంలోనే వెలువడిన మోడర్న్ తెలుగు పొయిట్రీ సంకలనానికీ సంపాదకులుగా ఉన్నారు. పిల్లల కోసం ప్రపంచ దేశాల కథలు అనువాదం చేసి ప్రచురించారు.

ఛాయాదేవి

ఫొటో సోర్స్, Abburi Chayadevi

ఈ సభల తాకిడి తట్టుకోలేకనే తాను సీ.ఆర్. ఫౌండేషన్‌కు వెళ్ళిపోతున్నానని హాస్యంగా అన్నారు గానీ, అందులో నిజముందేమో. 2012లో అక్కడికి వెళ్ళాక మరి ఆమె ఏ సాహిత్య సభకూ రాలేదు. ఎవరెంత బతిమాలినా రాలేదు. ఆమె అంతే. చాలా స్వతంత్రురాలు. నిర్ణయాధికారం తన చేతిలోకి తీసుకోగల సమర్థురాలు. ఆ నిర్ణయాన్ని అమలు చేయగల కార్యదక్షురాలు.

'తన మార్గం' కథలో వర్థనమ్మ కొడుకులను కాదని తన ఇంట్లో తాను బతుకుతూ తన స్వతంత్రతను సంపూర్ణంగా అనుభవించిన తీరు రాసిన ఛాయాదేవి, 'తన మార్గం' తాను వేసుకున్నారు. జీవితంలో డిటాచ్‌మెంట్ ఎంత అవసరమో ఆమెకు బాగా తెలుసు. జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ప్రేమిస్తూనే కొంత డిటాచ్‌డ్‌గా ఉండటాన్ని అభ్యసించారా అనిపిస్తుంది. ఆమె తను ఉన్న చోటుని కళాత్మకంగా, అందంగా తీర్చిదిద్దుకుంటుంది. అది బాగ్ లింగంపల్లిలో ఇల్లే కానక్కరలేదు. వృద్ధాశ్రమంలో ఒక గదిని కూడా ఎంతో సంతోషంగా చూపించారు. 2012లో తన గదిని, దానిని తాను అలంకరించిన తీరునూ చూపించారు.

ఔను ఆమె పనికిరానివని పడేసిన వస్తువులను మంచి మంచి బొమ్మలుగా మలచగల కళాకారిణి. తన చుట్టుపక్కల ఉన్నవారితో పుస్తకాలు చదివించారు. అక్కడున్న మహిళా కేంద్రానికి వచ్చేవారికి బొమ్మలే చేయటం నేర్పారు. ఇదంతా ఈ చివరి ఆరేడేళ్ళలో. ఆమె చైతన్యరూపిణి. మాట్లాడుతూ, పనిచేస్తూ, నవ్విస్తూ ఎప్పుడూ తుళ్ళిపడే తొలకరి రోజుల గోదావరిలా ఉండేవారు. ఆమెను చూస్తేనే ఉత్సాహం వచ్చేది.

ఛాయాదేవి

ఫొటో సోర్స్, NAGALAKSHMI VARANAS/FACEBOOK

ఆమె సాహిత్య కృషిని అందరూ గుర్తించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినపుడు చాలా మంది రచయిత్రులు అది తమకే వచ్చినట్లు సంబరపడ్డారు. ఆవిడ అవార్డు వచ్చినందుకంటే మేమంతా సంతోషపడడం చూసి చాలా ఆనందించారు. అజో విభో ప్రతిభామూర్తి పురస్కార సభ బాపట్లలో జరిగినపుడు నేను ఆవుల మంజులత, కాత్యాయనీ విద్మహే, ముదిగంటి సుజాతారెడ్డి, మృణాళిని, శిలాలోలిత, ప్రతిమ ఇంకా ఎందరెందరమో వెళ్లి ఆమెను హృదయానికి హత్తుకున్నాం.

ఇవాళ ఆమె లేరు. అలాగని విచారంగా కూచుంటే ఆమెకిష్టం ఉండదు. ఏదో ఒక పనిలో నిమగ్నమై పోవాలి. మరణాన్ని జీవితమంత సహజంగా నిర్లిప్తంగా తీసుకోవాలని అంటారు. వరదరాజేశ్వరరావు గారు మరణించినపుడు ఆమె ఎంత హుందాగా ఆ విషయాన్ని స్వీకరించారో దానినుంచి నేర్చుకోవాలి. Death is part of life కదా అనేవారు. అది Celebration of life కూడా అనేవారు. ఇవాళ మనం ఛాయాదేవిగారి జీవితాన్ని, సాహిత్యాన్ని, సంబరంగా తలచుకోవాలి. ఇలాంటి ఒక మనిషి మనందరి మధ్యా జీవించి చిరకాలం జీవించే తన సాహిత్య సృజన ద్వారా భవిష్యత్ తరాల ప్రేమను పొందగలరనే ఆశను పెంచుకోవాలి. అది అత్యాశ కానే కాదు. 'సుఖాంతం'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)