దలైలామా ఇంటర్వ్యూ: 'మహిళా దలైలామా అయితే ఆకర్షణీయంగా ఉండాలి'

దలైలామా

ఫొటో సోర్స్, RAGHU RAI

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నీతి తక్కువని ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా వ్యాఖ్యానించారు. బీబీసీకి ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూలో 'మహిళా దలైలామా' గురించి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. మరికొద్ది రోజుల్లో తన 84వ పుట్టినరోజు జరుపుకోబోతున్న దలైలామాను, బీబీసీ ప్రతినిధి రజని వైద్యనాథన్‌ ఇంటర్వ్యూ చేశారు.

తన దేశం వదిలి వచ్చి హిమాలయ పర్వతాల నీడలో ఆయన నివసిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మత గురువులలో ఒకరైన దలైలామా నివసించే ఉత్తర భారత పట్టణం ధరమ్‌శాలకు రజని వెళ్లారు. ఆయన ఆధ్యాత్మిక చింతన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించింది. వారిలో ఎంతో మంది రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ఉన్నారు. కానీ బలపడుతోన్న చైనా ప్రాభవంతో దలై లామా ప్రభావం తగ్గిపోతోందా?

బీబీసీ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ,

''ఒక చైనా అధికారి నన్ను రాక్షసుడు అని పిలిచాడు. మొదటిసారి అది విన్నపుడు నా స్పందన ఇది - 'అవును నేనొక రాక్షసుడినే. కొమ్ములున్న రాక్షసుడిని' అని. ఇది అసలు పెద్ద విషయమే కాదు. వారిని చూస్తే నాకు జాలేస్తుంది. వారి అజ్ఞానం, వారి రాజకీయ ఆలోచన అంతా కూడా సంకుచిత మనస్తత్వాన్నే సూచిస్తుంది'' అన్నారు.

బీబీసీ రిపోర్టర్, దలైలామా మధ్య సంభాషణ ఇలా సాగింది.

దలైలామా వీడియో ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి

వీడియో క్యాప్షన్, వీడియో: డోనల్డ్ ట్రంప్, మహిళల గురించి దలై లామా ఏమన్నారు?

రిపోర్టర్: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కలవాలనుందని మీరొకసారి అన్నారు. ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని అడిగారా?

దలైలామా: లేదు. నిజానికి ఆయన భావోద్వేగాలు కొద్దిగా సంక్లిష్టమైనవి.

రిపోర్టర్: మీ ఉద్దేశం ఏమిటి? అధ్యక్ష పదవిలో ఉన్న ఆయనపై మీ అభిప్రాయం ఏమిటి?

దలైలామా: ఆయన ఒక రోజు ఒక మాట మాట్లాడితే, ఇంకోరోజు మరొకటి చెబుతారు. ఆయనలో నైతిక విలువలు కొద్దిగా తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినపుడు, 'అమెరికా ఫస్ట్' అన్నారు. అది చాలా తప్పు. అమెరికా ప్రపంచదేశాల బాధ్యతను తీసుకోవాలి.

రిపోర్టర్: ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమే అని ఒకసారి అన్నారు?

దలైలామా: అది సాధ్యమే.

రిపోర్టర్: మీరు నా సహోద్యోగి ఒకరితో మాట్లాడుతూ వారసురాలిగా వచ్చే మహిళ అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని, అలా లేకపోతే ఉపయోగం లేదని అన్నారు.

దలైలామా: అవును.

రిపోర్టర్: ఆ వ్యాఖ్య ఎంతో మంది మహిళల మనోభావాలను దెబ్బతీసిందని మీరు గ్రహించారా?

దలైలామా: మహిళా దలైలామా వస్తే ఆమె ఆకర్షణీయంగా ఉండాలి. ఒకవేళ మహిళా దలైలామా ఇలా ఉంటే (తన ముఖ కవళికలు మారుస్తూ...) ప్రజలు ఆ ముఖాన్ని చూసేందుకు ఉత్సుకత చూపించరు.

రిపోర్టర్: చాలా మంది మహిళలు మీ వ్యాఖ్యలను "మహిళలను వస్తువుగా చూడడం" అని అంటున్నారు. అంతర్గతంగా మనమేంటి అన్నది ముఖ్యం కదా?

దలైలామా: రెండూ (బాహ్య సౌందర్యం, అంతర్గత సౌందర్యం) ముఖ్యమే.

రిపోర్టర్: గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ప్రజల్లో సహనం తక్కువైపోతోందని ఎంతో మంది అంటున్నారు. దానికి సమాధానాన్ని శోధించే వారికి మీరేం చెబుతారు?

దలైలామా: ఎన్నో సమస్యలు మనం సృష్టించుకున్నవే. మానవత్వంలో ఏకత్వాన్ని మరిచిపోతున్నాం. ఇది ఒకే ప్రపంచం. ఆ విషయం మనం మరిచిపోతున్నాం. ఇది చిన్న ప్రపంచం- కానీ నా దేశం, నా మత విశ్వాసం అంటూ వాటికి అనవసర ప్రాధాన్యం ఇస్తున్నాం.

మారుతున్న కాలంలో ఆయన సందేశంలో అంతరార్థం, తోటివారి పట్ల దయ చూపాలనేదే. వివాదాల మధ్యనే ఎన్నో తరాలకు దలైలాలామా స్ఫూర్తినిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)